Share News

తాయిలాల జోరు!

ABN , Publish Date - Nov 01 , 2026 | 03:22 AM

మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తాయిలాల బాట పట్టారు. ఓటుకు రూ.1000 నుంచి గరిష్ఠంగా 5 వేల వరకు...

తాయిలాల జోరు!

  • ఓటర్లకు భారీగా నగదు, మద్యం, బిర్యానీ

  • ఓటుకు రూ.1000-2000

  • చీమకుర్తిలో వైసీపీ 5 వేలు

  • నరసాపురంలో కూటమి 4 వేలు

  • కుక్కర్లు సహా ఇంటి సామగ్రి

  • బొబ్బిలిలో వెండి కుంకుమ భరిణెలు

  • తిరుపతిలో ఇత్తడి దీపపు సెమ్మెలు

  • పోటాపోటీగా సాగిన ‘కానుకల’ పంపిణీ

  • కర్నూలులో వైసీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి స్నేహితుడి ఇంట్లో 76 లక్షలు స్వాధీనం

  • రూ.100 విలువ చేసే చీర ఇచ్చారని బెజవాడలో మహిళల ఆగ్రహం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తాయిలాల బాట పట్టారు. ఓటుకు రూ.1000 నుంచి గరిష్ఠంగా 5 వేల వరకు పంపిణీ చేశారు. కార్పొరేటర్‌ అభ్యర్థుల నుంచి మేయర్‌ అభ్యర్థుల వరకు, కౌన్సిలర్‌ నుంచి చైర్‌పర్సన్‌ దాకా అందరిదీ ఇదే బాట కావడం గమనార్హం. ప్రత్యర్థుల కదలికలను గమనిస్తూ.. వారికంటే ఎక్కువ మొత్తంలో పంపిణీ చేసిన ఘటనలు కూడా వెలుగు చూశాయి.

చీమకుర్తిలో వైసీపీ అభ్యర్థులు గరిష్ఠంగా ఓటుకు రూ.5 వేలు, నరసాపురంలో కూటమి అభ్యర్థులు రూ.4 వేల చొప్పున పంపిణీ చేయడం గమనార్హం. మద్యం, బిర్యానీ ప్యాకెట్ల పంపిణీ కూడా జోరుగా సాగింది. పలుచోట్ల కుక్కర్లు, ఇతర సామగ్రిని కూడా ఇచ్చి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో టీడీపీ అభ్యర్థులదే పైచేయిగా ఉండగా.. వైసీపీ అభ్యర్థులు చాలా చోట్ల గెలుస్తామో లేదో అన్న మీమాంసలో తాయిలాలను ఆచితూచి పంపిణీ చేశారు.

ఇక, కర్నూలు జిల్లాలో వైసీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి స్నేహితుడి ఇంట్లో పంపిణీకి సిద్ధంగా ఉంచిన రూ.76 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికలను మించిన స్థాయిలో ఈ పంపకాలు ఉండడం గమనార్హం.


ఎక్కడెక్కడ ఎలా.. ఎలా?

  • ఏలూరు కార్పొరేషన్‌తోపాటు, నూజివీడు, జంగారెడ్డిగూడెం, నరసాపురం, ఆకివీడు మునిసిపాలిటీలలో ఓటర్లను ఆకట్టుకునేందుకు రూ.500 నుంచి రూ.1500 వరకు పంపిణీ చేశారు. ఏలూరులో వైసీపీ మేయర్‌ అభ్యర్థి ఆచితూచి వ్యవహరించారు. చాలాచోట్ల ఓటుకు రూ.500 పంపిణీ చేశారు. ఏలూరు నగరంలో ఒక స్వతంత్ర అభ్యర్థి ఓటుకు రూ.1,500 ఖర్చు చేసినట్టు తెలిసింది. నూజివీడులో రూ.1,500 చొప్పున పంపిణీ చేశారు. అలాగే ఇంటికో క్వార్టర్‌ మద్యం బాటిల్‌ను పంపిణీ చేశారు.

  • పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని కొన్ని వార్డుల్లో ఓటుకు రూ.1500-రూ.4 వేల వరకు ఇచ్చారు. మరికొన్ని చోట్ల కుక్కర్లు, చీరలు, ఎలక్ర్టికల్‌ వస్తువుల్ని అందించారు. బిర్యానీ బ్యాకెట్లతోపాటు మద్యాన్ని పంపిణీ చేశారు. ఈ పంపకాల్లో కూటమి ఆభ్యర్థులే ముందుండడం గమనార్హం. ఒకటి, రెండు వార్డుల్లో వైసీపీ ఓటుకు రూ.2 వేల నుంచి రూ.2,500 పంపిణీ చేసింది. మహిళా ఓటర్లను అకర్షించేందుకు చీరలు పంపిణీ చేశారు.

  • గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీవీఎంసీ) ఎన్నికల్లో కార్పొరేటర్‌ అభ్యర్థులు ఓటుకు రూ.500 చొప్పున, మేయర్‌ అభ్యర్థి తరఫున మరో రూ.500 పంపిణీ చేశారు. 120 వార్డులకు గాను సుమారు 80 వార్డుల్లో శనివారం సాయంత్రానికే డబ్బుల పంపిణీ పూర్తి చేశారు. కొన్ని వార్డుల్లో మద్యం కూడా పంచి పెట్టారు.

  • విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓ రాజకీయ పార్టీ ఒక్కో ఓటరుకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేయగా, మరో పార్టీ రూ.700 పంపిణీ చేసినట్లు సమాచారం. కొన్ని డివిజన్‌లలో చీరలు, టిఫెన్‌ బాక్స్‌లు, స్వీట్‌ ప్యాకెట్‌ల పంపిణీ సాగింది. ఓ పార్టీ కార్పొరేటర్‌ అభ్యర్థి రూ.100 విలువ చేసే చీరను పంపిణీ చేశాడని, నాణ్యత లేని ఆ చీరలు చిరిగిపోతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


  • విజయనగరం జిల్లాలో ఒక్కొక్క ఓటుకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు.. కొన్ని డివిజన్లలో రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఇచ్చినట్లు తెలిసింది.

  • కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ తరఫున రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేయగా, వైసీపీ నాలుగైదు వార్డుల్లో మాత్రమే పంపకాలు చేసింది.

  • తిరుపతి జిల్లాలో టీడీపీ ముఖ్యనేత సన్నిహిత బంధువు పోటీ చేస్తున్న డివిజన్‌లో ఓటుకు రూ.4 వేల చొప్పున పంపిణీ చేశారు.

  • ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని ఒక ప్రాంతంలో వైసీపీ అభ్యర్థులు ఓటుకు రూ.5 వేల వరకు పంచారు. ఈ విషయాన్ని పసిగట్టిన టీడీపీ నేతలు.. స్థానిక నాయకులను అప్రమత్తం చేశారు. దీంతో ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు వైసీపీ శ్రేణులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని సంగతులు!

  • తిరుపతి నగర టీడీపీలో కీలక నేత తాను పోటీ చేస్తున్న డివిజన్‌లో గట్టి పోటీ నెలకొనడంతో నగదుకు తోడు ఇంటింటికీ ఇత్తడి దీపపు సెమ్మెలను పంపిణీ చేశారు.

  • విజయనగరం జిల్లా బొబ్బిలి, నెల్లిమర్లలో కూటమి అభ్యర్థులు మహిళలకు చీరలు, వెండి కుంకుమ భరిణెలు పంపిణీ చేశారు.

  • నెల్లూరు నగరంలోని ఓ డివిజన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటుకు కేజీ చికెన్‌ ఇచ్చేలా టోకెన్లు పంపిణీ చేశారు. ఓటు వేశాక వాటిని చూపించి చికెన్‌ తీసుకువెళ్లేలా ఏర్పాట్లు చేశారు.

  • చీరాలలోని 15 వార్డు కౌన్సిలర్‌ సీటు ఆశించి భంగపడిన టీడీపీ అభ్యర్థి చివరి నిమిషంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకొని పోటీలో నిలిచారు. ఏకంగా రూ.2 వేలు చొప్పున పంపిణీ చేశారు.

  • హిందూపురం మునిసిపాలిటీలో డబ్బులు పంచుతున్న 11 మంది వైసీపీ నాయకులను పోలీసులు అరె స్టు చేసి రూ.64 వేలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..

జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!

Updated Date - Nov 01 , 2026 | 05:48 AM