జగన్ నైజం బట్టబయలు!
ABN , Publish Date - Oct 22 , 2026 | 07:06 AM
మున్సిపల్ ఎన్నికలపై సొంత మీడియా సాక్షిగా వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించింది. సుప్రీంకోర్టు తీర్పునే వక్రీకరిస్తూ 19 చోట్ల మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు పొడిగిస్తున్నట్లు అసత్య ప్రచారాన్ని హోరెత్తించింది.
సుప్రీంకోర్టు తీర్పునకూ వక్రభాష్యం
నామినేషన్లపై జగన్ మీడియాలో ఫేక్ వార్తలు
తానే విధ్వంసం సృష్టించి బాధితులుగా నమ్మించేందుకు వైసీపీ ప్రయత్నం
ఫిర్యాదు చేసిన 19 స్థానాలకుగాను..11 చోట్ల నామినేషన్లు వేసిన వైసీపీ
భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు
అమరావతి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికలపై సొంత మీడియా సాక్షిగా వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించింది. సుప్రీంకోర్టు తీర్పునే వక్రీకరిస్తూ 19 చోట్ల మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు పొడిగిస్తున్నట్లు అసత్య ప్రచారాన్ని హోరెత్తించింది. వైసీపీ అభ్యంతరాలు లేవనెత్తినచోట్ల, వారి ఫిర్యాదులను మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని మాత్రమే సుప్రీంకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది. ఫిర్యాదులు వచ్చినచోట మళ్లీ నామినేషన్లు తీసుకోవాలా.. వద్దా.. అనే అంశాన్ని ఎస్‌ఈసీకే వదిలివేసింది. ఎన్నికల నామినేషన్లు సహా, ఎన్నికల నిర్వహణ వరకు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తంచేయలేదు. వాస్తవం ఇలా ఉంటే గొడ్డలి పార్టీ మాత్రం ప్రజల్లో అయోమయం సృష్టించేలా తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టింది.
ఓటమి భయంతో ఎన్నికలకు దూరంగా ఉన్న మున్సిపాలిటీల్లో హింస జరిగిందని, నామినేషన్ల గడువు పొడిగించాలంటూ కోర్టును ఆశ్రయించిన వైసీపీ అత్యున్నత న్యాయస్థానాన్ని తప్పదారి పట్టించేలా వ్యవహరించిందని టీడీపీ శ్రేణులు ఆధారాలతో సహా బయట పెట్టాయి. ఆ వివరాలు.. నామినేషన్లు వేయనివ్వలేదంటూ కోర్టుకు వైసీపీ ఇచ్చిన 19 నగర, పట్టణ స్థానిక సంస్థల జాబితాలో 11 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడం గమనార్హం. తిరుపతి, కడప మేయర్ అభ్యర్థులుగానూ, జమ్మలమడుగు, తాడిపత్రి, కనిగిరి, ప్రొద్దుటూరు, బద్వేల్, పులివెందుల, రాజంపేట, గుత్తి, దాచేపల్లి మున్సిపాలిటీ చైర్మన్ స్థానాలకూ వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 19 స్థానాల్లో 13 స్థానాల్లో వార్డులకు వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. జమ్మలమడుగులో 32 వార్డులకుగాను 31, తాడిపత్రిలో 48 వార్డులకుగాను 43, కనిగిరిలో 32 వార్డులకుగాను 26, ప్రొద్దుటూరులో 52 వార్డులకు 38, బద్వేల్‌లో 40 వార్డులకు 27, పులివెందులలో 40 వార్డులకు 20, తిరుపతి కార్పొరేషన్‌లో 66 డివిజన్లకు 47చోట్ల వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
హింస వారే చేసి.. బాధితులుగా డ్రామాలు..
మైదుకూరు మున్సిపాలిటీలో నామినేషన్ పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు చించేయడంతో అక్కడ ఎన్నికను ఇప్పటికే వాయిదా వేశారు. కమలాపురం, యర్రగుంట్ల, గుత్తి,పిడుగురాళ్ల, గురజాల, దాచేపల్లి మున్సిపాలిటీల్లో వైసీపీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రాలేదు. పుంగనూరు, దర్శి, రాయచోటి, పులివెందుల, కడప స్థానిక సంస్థల్లో వైసీపీ దాడులు, దౌర్జన్యాలకు తెగబడింది. పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డి నేతృత్వంలో దాడులకు తెగబడ్డారు. రాయచోటిలో పంజాబ్ నుంచి మారణాయుధాలతో కూడిన అంతరాష్ట్ర ముఠాలను దించారు. దర్శిలో ఎస్‌ఐ తల పగలగొట్టారు. పులివెందులలో ఎంపీ అవినాశ్‌రెడ్డి సారథ్యంలో పోలీసులపై రాళ ్లదాడికి తెగబడ్డారు. దౌర్జన్యాలు చేసి... పైగా తామే బాధితులమని వైసీపీ గగ్గోలు పెట్టడం చిత్రంగా ఉందని, ఓటమి భయంతోనే కోర్టులకు వెళ్లి డ్రామాలు ఆడుతోందని టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి.
వైసీపీ వక్రభాష్యాలపై టీడీపీ నేతల భగ్గు
స్థానిక ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు గొడ్డలి పార్టీ కేసులు, వివాదాలు, తప్పుడు ప్రచారాలతో విశ్వప్రయత్నం చేస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఒకవైపు క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు సృష్టిస్తూ.. మరోవైపు అవే ఘటనలను సాకుగా చూపి ఎన్నికలను నిలిపివేయాలని న్యాయస్థానాలను ఆశ్రయించడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. న్యాయస్థానాల తీర్పు ఎలా ఉన్నా, టీడీపీ గౌరవిస్తుందే తప్ప వాటిపై అనవసరమైన వివాదాలు, వక్రభాష్యాలు ప్రచారం చేయదని స్పష్టం చేశారు. గొడ్డలి పార్టీ కుట్రల పట్ల టీడీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాగా, నిజాలు మాట్లాడటం, వాస్తవాలను ఒప్పుకోవడం గొడ్డలి పార్టీ డీఎన్‌ఏలోనే లేదని ఎమ్మెల్సీ వర్ల రామయ్య అన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునూ గొడ్డలి పార్టీ వక్రీకరిస్తుందంటే, ఆ పార్టీకి ప్రజాస్వామ్యమన్నా.. చట్టాలన్నా ఏపాటి గౌరవం ఉందో అర్థమవుతోందన్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలనే కాకుండా సొంత పార్టీ అభ్యర్థులను కూడా గొడ్డలి పార్టీ నేత మభ్యపెడుతున్నారని విమర్శించారు.
ఈ వార్తలనూ చదవండి..