మున్సిపల్ కమిషనర్ పోస్టులకు జోన్లవారీ కేడర్
ABN , Publish Date - Sep 19 , 2026 | 05:13 AM
ఏపీ మున్సిపల్ కమిషనర్ల సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1959కు ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3 పోస్టులను జోన్లవారీగా ఏర్పాటు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సవరణలు జూలై 24 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా పేర్కొంది.
ఆరు జోన్లుగా విభజన.. ప్రభుత్వం ఉత్తర్వులు
అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ఏపీ మున్సిపల్ కమిషనర్ల సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1959కు ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3 పోస్టులను జోన్లవారీగా ఏర్పాటు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సవరణలు జూలై 24 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా పేర్కొంది. దీనిద్వారా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3 పోస్టులకు నియామక యూనిట్‌గా జోన్‌ను నిర్ణయించారు. జిల్లాలను ఆరుజోన్లుగా విభజించారు. జోన్-1లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి జిల్లాలు ఉంటాయి. జోన్-2లో అల్లూరి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, జోన్-3లో పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు ఉంటాయి. జోన్-4లో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఉన్నాయి. జోన్-5లో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలు, జోన్-6లో నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాలను చేర్చారు. ఈ జోన్లలో ప్రత్యక్ష నియామకం, తొలగింపు, సీనియారిటీ, పదోన్నతి, బదిలీ తదితర సర్వీసు అంశాలకు ప్రత్యేక యూనిట్లు ఉంటాయి. ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీచేసే పోస్టుల్లో స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మున్సిపల్ కమిషనర్ సర్వీ్‌సలో దిగువ కేటగిరీ నుంచి తదుపరి ఉన్నత కేటగిరీకి పదోన్నతి లేదా బదిలీ ద్వారా నియామకం పొందాలంటే సంబంధిత దిగువ కేటగిరీలో కనీసం రెండేళ్లు సర్వీసు పూర్తి చేసి ఉండాలి. ఈ నిబంధనను కొత్తగా రూల్-13గా చేర్చారు. ప్రభుత్వం జారీచేసిన ఈ సవరణల నోటిఫికేషన్‌ను గెజిట్‌లో ప్రచురించనున్నారు.
సర్వీస్ రూల్స్‌లో సవరణలు
ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ రూల్స్‌లో కూడా ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. ఆ మేరకు మున్సిపల్‌శాఖ శుక్రవారం మరో సవరణ ఉత్తర్వులు జారీచేసింది. సర్వీసు రూల్స్‌లోని రూల్-6ను ప్రభుత్వం సవరించింది. రూల్-10లోని పట్టికను కూడా ప్రభుత్వం మార్చింది. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-1, గ్రేడ్-2 పోస్టులకు నియామక యూనిట్‌గా మల్టీజోన్‌ను నిర్ణయించారు.
పదోన్నతికి రెండేళ్ల సర్వీస్ తప్పనిసరి
బీసీ సంక్షేమశాఖ సబార్డినేట్ సర్వీసు రూల్స్-1996లో రాష్ట్రప్రభుత్వం కీలక సవరణలు చేసింది. ఆ సవరించిన నిబంధనలు 2026 జూలై 15 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా పరిగణించనున్నట్లు బీసీ సంక్షేమశాఖ శుక్రవారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. రూల్-8లో సవరణ ప్రకారం దిగువ కేటగిరీ, క్లాస్ లేదా గ్రేడ్ నుంచి తదుపరి ఉన్నత కేటగిరీ, క్లాస్ లేదా గ్రేడ్‌కు పదోన్నతి లేదా బదిలీ ద్వారా నియామకం పొందాలంటే సంబంధిత దిగువ కేటగిరీలో కనీసం రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి.
ఈ వార్తలనూ చదవండి...