Share News

టీడీపీతోనే బీసీలకు సాధికారత

ABN , Publish Date - Oct 11 , 2026 | 03:06 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీనవర్గాలకు సముచిత రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధానలక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు.

టీడీపీతోనే బీసీలకు సాధికారత

  • జగన్‌ వచ్చాక 24 శాతానికి తగ్గించారు

  • బీసీలు 17 వేల పదవులు నష్టపోయారు

  • 34 శాతం కంటే ఎక్కువే ఇస్తాం: మంత్రులు

అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీనవర్గాలకు సముచిత రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధానలక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. బీసీల రాజకీయ సాధికారతకు గతంలో ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయకత్వాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. శనివారం మంత్రిమండలి సమావేశం అనంతరం మంత్రులు డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, సత్యకుమార్‌ యాదవ్‌, కొలుసు పార్థసారథి, ఎస్‌.సవిత, గుమ్మిడి సంధ్యారాణి, వంగలపూడి అనిత తదితరులతో కలిసి సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలు పార్టీకి అండగా నిలిచారని అన్నారు. 1987లో అప్పటి సీఎం ఎన్టీఆర్‌ బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు.

అనంతరం 1995లో పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణలు చేసి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచారని పేర్కొన్నారు. తదనంతరం వచ్చిన ప్రభుత్వాలు ఈ రిజర్వేషన్ల ఆధారంగానే స్థానిక ఎన్నికలు నిర్వహించాయని తెలిపారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించిందని విమర్శించారు. దీనివల్ల వివిధ స్థాయిల్లో సుమారు 17 వేల రాజకీయ పదవులను బీసీలు కోల్పోయారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పునరుద్ధరించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, గతంలో ఉన్న చట్టపరమైన నిబంధనల ఆధారంగా ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు. అయితే న్యాయస్థానాల్లో ఎదురైన అభ్యంతరాల నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించి చట్టబద్ధంగా బీసీలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు.


మిశ్రా కమిషన్‌ సిఫారసుల ప్రకారం స్థానిక సంస్థల స్వభావాన్ని బట్టి వేర్వేరు యూనిట్లు ప్రాతిపదికగా రిజర్వేషన్లు నిర్ణయించినట్లు తెలిపారు. స్థానిక సంస్థలన్నింటికీ కలిపి బీసీలకు సగటున 28.18 శాతం రిజర్వేషన్లు లభిస్తున్నాయని తెలిపారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండేందుకు 34 శాతం కంటే తక్కువ రిజర్వేషన్లు ఉన్న చోట్ల కూటమి పార్టీలు పార్టీపరంగా 34 శాతానికి పైగా అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నాయని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మంత్రి డోలా మాట్లాడుతూ.. స్థానిక యూనిట్‌లోని జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను నిర్ణయించినట్లు చెప్పారు. మంత్రి సత్యకుమార్‌ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24శాతానికి ఎందుకు తగ్గించారో వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీసీలకు న్యాయంచేసే విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటుందని మంత్రులు స్పష్టం చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం

జయహో బీసీ

Updated Date - Oct 11 , 2026 | 03:12 AM