ఉపాధ్యాయుల జోలికొస్తే వదలం!
ABN , Publish Date - Sep 23 , 2026 | 04:31 AM
‘మా ఉపాధ్యాయుల జోలికొస్తే దబిడి దిబిడే. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దాడిలో పాల్గొన్న రౌడీ బ్యాచ్‌లో ఏ ఒక్కరినీ వదలిపెట్టం. రాష్ట్రంలోనే కాదు, అండమాన్‌లో ఉన్నా, ఆస్ర్టేలియాకు వెళ్లినా పట్టుకొచ్చి జైల్లో వేస్తాం’ అని మంత్రి లోకేశ్ హెచ్చరించారు.
ఆ రౌడీ బ్యాచ్‌లో ఎవరినీ వదిలిపెట్టం: లోకేశ్
అండమాన్‌లో ఉన్నా.. ఆస్ర్టేలియా వెళ్లినా పట్టుకొచ్చి జైల్లో వేస్తాం
అబద్ధానికి ప్యాంటు, షర్టు వేస్తే అది జగనే
డీఎస్సీపై చర్చకు నేను రెడీ.. ఆయన సిద్ధమా?
గొడ్డలితో బతికినవాళ్లు గొడ్డలితోనే పోతారు
పాఠాలు చెప్పే టీచర్లపై ఎందుకంత కక్ష?
అసభ్యంగా మాట్లాడి కోడిగుడ్లు వేస్తారా?
మీ తల్లిదండ్రులు నేర్పించింది ఇదేనా?
రాప్తాడు సభలో మంత్రి లోకేశ్ మండిపాటు
ఉపాధ్యాయులపై కోడిగుడ్లు వేస్తారా? అసభ్యంగా మాట్లాడతారా? అసలు మీరెక్కడ చదివారు? ఇదేనా ఇంట్లో మీ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కృతి? ఇదేనా ఉపాధ్యాయులకు మీరిచ్చే గౌరవం?అబద్ధానికి ప్యాంటు షర్టు వేస్తే జగన్. నిజం చెబితే తల వెయ్యి వక్కలవుతుందని ఆయనకు శాపం ఉంది. అందుకే నిజాలు మాట్లాడరు.- మంత్రిలోకేశ్
అనంతపురం, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘మా ఉపాధ్యాయుల జోలికొస్తే దబిడి దిబిడే. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దాడిలో పాల్గొన్న రౌడీ బ్యాచ్‌లో ఏ ఒక్కరినీ వదలిపెట్టం. రాష్ట్రంలోనే కాదు, అండమాన్‌లో ఉన్నా, ఆస్ర్టేలియాకు వెళ్లినా పట్టుకొచ్చి జైల్లో వేస్తాం’ అని మంత్రి లోకేశ్ హెచ్చరించారు. మంగళవారం ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన రాప్తాడులో ఎమ్మెల్యే పరిటాల సునీత, టీడీపీ ధర్మవరం ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్, పరిటాల రవీంద్రల కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు. ఆ తర్వాత జరిగిన సభ, కార్యకర్తల సమావేశంలో లోకేశ్ ప్రసంగించారు. ‘గొడ్డలితో బతికినవాళ్లు గొడ్డలితోనే పోతారు. పాఠాలు చెప్పే టీచర్లపై ఎలా దాడి చేశారో చూశాం. అయ్యా జగన్ .. ఎందుకు మా ఉపాధ్యాయులంటే నీకు అంత కక్ష ..? డీఎస్సీపై చర్చకు సిద్ధమని నేను ఎన్నోసార్లు చెప్పాను. నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా జగన్‌రెడ్డీ’ అని మరోసారి సవాల్ విసిరారు. ఆయన మాదిరిగా ఇతర దేశాలు, రాష్ర్టాలకు వెళ్లాలంటే తమకు కోర్టు అనుమతి అవసరం లేదన్నారు. జగన్ పెట్టిన కేసులు దొంగ కేసులని ఏకంగా సుప్రీంకోర్టే తేల్చింద ని చెప్పారు. ‘ఉపాధ్యాయులపై దాడికి రౌడీమూకలను పంపారు. మొన్నటివరకు మన పార్టీలో వంగి, వంగి ఉన్నవారు.. ఇప్పుడు అక్కడకు వెళ్లి కాలరెగరేస్తున్నారు. వదిలిపెట్టను భయ్యా..! రెడ్‌బుక్‌కు కట్టుబడి ఉన్నా’ అని తేల్చిచెప్పారు.
ఆ ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ అయినా వేశారా..?
జగన్ ఐదేళ్ల హయాంలో ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించలేదని లోకేశ్ గుర్తుచేశారు. ‘ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు.. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. 2019 ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని జగన్ నెరవేర్చలేదు. సీఎం చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే చేశా రు. దాన్ని ముందుకు సాగనివ్వకుండా చేసేందుకు వైసీపీ నాయకులు 300కిపైగా కేసులు వేశారు. 150 రోజుల్లో 16 వేల టీచర్ పోస్టులు భర్తీచేశాం. డీఎస్సీ ని ఎక్కడా కోర్టు తప్పుపట్టలేదు. ఏడాది తర్వాత ఇప్పుడొచ్చి అవినీతి జరిగిందని అంటున్నారు’ అని విమర్శించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయన్నారు. ‘ఎన్నికలు.. ఎన్నికలే.. తగ్గేదేలే. కష్టపడాలి.. పనిచేయాలి. 2024 ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో 94 శాతం స్థానాలు కైవసం చేసుకున్నాం. స్థానిక ఎన్నికల్లో 94 శాతం కంటే ఎక్కువ ఫలితాలు సాధిద్దాం. కార్యకర్తలకు ఒకటే చెబుతున్నా.. కష్టపడదాం.. ప్రజలకు సేవచేద్దాం. మనది పెద్ద కుటుంబం. కోటీ ఆరు లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు పవనన్న మన కుటుంబ సభ్యుడయ్యారు. బీజేపీ కూడా మన కుటుంబంలో చేరింది. 3 పార్టీలూ ఏపీని ముందుకు తీసుకెళ్తున్నాయి. సమస్యలేవైనా ఉంటే 4 గోడల మధ్య కూర్చుని పరిష్కరించుకుందాం. నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి అందరూ కట్టుబడి ఉండాలి.’ అన్నారు. ‘ఈ రోజు మనం వేదికపై ఉన్నామంటే కారణం వేదిక కింద ఉన్న టీడీపీ కార్యకర్తల త్యాగం. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా, టీడీపీకి కాపలాకాసిన కార్యకర్తగా ఇక్కడకు వచ్చాను’ అని లోకేశ్ చెప్పారు.
సిద్ధాంతం కోసం పోరాడిన పరిటాల రవి..
‘నమ్మిన సిద్ధాంతం కోసం తుదివరకు పోరాడిన వ్యక్తి పరిటాల రవి. ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక అభివృద్ధి పనులు చేశారు. సీమలో మహిళలు బయట తిరగాలంటే బయపడే పరిస్థితి ఉండేది. దానికి ఫుల్‌స్టాప్ పెట్టిన నాయకుడు మన పరిటాల’ అని లోకేశ్ చెప్పారు. ‘రాప్తాడు ప్రజలు చాలా మంచోళ్లు. యువగళం పాదయాత్రలో వీళ్లెవరూ నా చేతులను గీరలేదు. ధర్మవరంలో అయితే మొత్తం గీరేశారు..’ అని లోకేశ్ సరదాగా అన్నారు. 2019-24 మధ్య పడిన కష్టాలను పార్టీ శ్రేణులు గుర్తుచేసుకోవాలని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి...
పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..
సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం