చూస్తుండగానే.. అల మింగేసింది
ABN , Publish Date - Sep 22 , 2026 | 12:36 AM
Fisherman's death వినాయకచవితి ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. నిమజన్సోతవంలో భాగంగా.. అప్పటివరకూ వినాయకుడి విగ్రహం ఊరేగింపు సరదాగా సాగింది. సముద్రంలో విగ్రహాన్ని నిమజ్జనం చేసి వస్తున్న సమయంలో అలల ఉధృతి రూపంలో ఓ మత్స్యకారుడిని మృత్యువు కబళించింది.
కెరటాల ఉధృతికి మత్స్యకారుడి మృతి
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
డోకులపాడులో విషాదం
వినాయక నిమజ్జనం.. సంద్రం వద్ద సందడిగా ఉంది. విగ్రహాన్ని నీటిలో విడిచే సమయం.. పెద్ద అల ఒడ్డుకు వచ్చింది. అంతే అందరూ చెల్లాచెదురయ్యారు. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. కాసేపటికి నిర్జీవంగా తేలాడు.
వజ్రపుకొత్తూరు, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): వినాయకచవితి ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. నిమజన్సోతవంలో భాగంగా.. అప్పటివరకూ వినాయకుడి విగ్రహం ఊరేగింపు సరదాగా సాగింది. సముద్రంలో విగ్రహాన్ని నిమజ్జనం చేసి వస్తున్న సమయంలో అలల ఉధృతి రూపంలో ఓ మత్స్యకారుడిని మృత్యువు కబళించింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల్లో తీరని విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. వజ్రపుకొత్తూరు మండలం డోకులపాడు గ్రామానికి చెందిన దుమ్ము కూర్మారావు(42) ఆదివారం రాత్రి వినాయక విగ్రహం నిమజ్జనోత్సవానికి వెళ్లి.. సముద్రంలో అలలు ఉధృతికి చిక్కుకుని మృతిచెందారు. ఆదివారం రాత్రి వినాయకచవితి ఉత్సవాలు గ్రామస్థులంతా ఘనంగా నిర్వహించారు. నిమజ్జనం కోసం విగ్రహాన్ని డోకులపాడు సముద్రతీరానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. రాత్రి 11.30 గంటల సమయంలో విగ్రహాన్ని నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా సముద్రంలో అలల ఉధృతికి కొంతమంది చెల్లాచెదురయ్యారు. వారంతా కష్టపడి ఒడ్డుకు చేరుకున్నారు. కానీ, కూర్మారావు ఆచూకీ లభ్యం కాలేదు. ఆయన కోసం గాలించగా.. అరగంట తర్వాత కూర్మారావు విగతజీవిగా ఒడ్డుకు కొట్టుకువచ్చాడు. స్థానికులు సపర్యలు చేసి.. పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు రోదించారు. కూర్మారావుకు భార్య కుమారితోపాటు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. సముద్రంలో చేపల వేట సాగిస్తూ.. కుటుంబాన్ని పోషించేవాడు. ఇంటి పెద్ద మృతి చెందడంతో తమకు ఇక దిక్కెవరంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో తోటి మత్స్యకారులంతా విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెడ్‌కానిస్టేబుల్ వైకుంఠరావు తెలిపారు.