సమరానికి సై!
ABN , Publish Date - Oct 11 , 2026 | 03:01 AM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన శనివారం క్యాబినెట్ ప్రత్యేకంగా సమావేశమైంది.
14న మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్
19న మండల, జడ్పీ ఎన్నికల షెడ్యూల్
వచ్చే నెలలో పంచాయతీ పోరు
3 దశల్లో నిర్వహణకు కసరత్తు
13న గుర్తింపు పొందిన 20 రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ సమావేశం
అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన శనివారం క్యాబినెట్ ప్రత్యేకంగా సమావేశమైంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు నిర్ధారించేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటైన స్వతంత్ర కమిషన్ చేసిన సిఫారసులను మంత్రివర్గం ఆమోదించింది. గ్రామాల్లో వార్డు సభ్యుల నుంచి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్‌పర్సన్లు, మున్సిపల్ వార్డు సభ్యులు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, మేయర్ల వరకూ బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసింది. మరోవైపు ఈ నెల 13న రాష్ట్రంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశమై స్థానిక ఎన్నికల నిర్వహణపై చర్చించనుంది. ఈ భేటీ అనంతరం 14న మున్సిపల్, 19న ప్రాదేశిక ఎన్నికలకు నోటిఫికేషన్‌తో పాటు షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. నవంబరులో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఎన్నికల సంఘం సిద్ధం
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. 13న అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమైన అనంతరం 14న మున్సిపల్ ఎన్నికలకు, 19న జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్, షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ నెలాఖరు నాటికి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియను ముగించాలని నిర్ణయించింది. అలాగే నవంబరు 10 నుంచి 15వ తేదీ మధ్యలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్, షెడ్యూల్ విడుదల కానుంది. పంచాయతీలకు మూడు రోజుల వ్యవధిలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ నిర్ణయించింది. నవంబరు చివరి నాటికి మొత్తం పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. డిసెంబరు మొదటి నుంచి రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థలకు కొత్త పాలక వర్గాలు ఏర్పాటు కానున్నాయి.
ఈ షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో దాదాపు రెండు నెలల పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లు, ఇతర అంశాలపై వివరించేందుకు 13న గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలను రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశానికి ఆహ్వానించింది. విజయవాడలోని ఎస్‌ఈసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో 20 పార్టీలకు గుర్తింపు ఉండటంతో ఆయా పార్టీల అధినేతలకు ఆహ్వానపత్రాలను ఎస్‌ఈసీ అందించింది. పార్టీ అధ్యక్షులు లేదా పార్టీ గుర్తించిన ప్రతినిధులు సమావేశంలో పాల్గొనేందుకు వెసులుబాటు కల్పించింది.
ఈ వార్తలనూ చదవండి:
ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం