స్థానికానికి సై.. బీసీ కోటా పెంపునకు నై
ABN , Publish Date - Oct 02 , 2026 | 04:10 AM
నిర్దిష్ట గడువులోగా ఎన్నికలు నిర్వహించాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ), రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ఆరు వారాల్లోపు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించండి.
వార్డుల పునర్విభజన ప్రక్రియలో జోక్యం చేసుకోం
హైకోర్టు సంచలన తీర్పు
6 వారాల్లోపు పంచాయతీలు, పట్టణ సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రారంభించండి
ఎన్నికల నిర్వహణకు సర్ అడ్డంకి కాదు
ఎస్‌ఈసీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ జీవోల రద్దు
రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయి
ఇది సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధం: హైకోర్టు
నిర్దిష్ట గడువులోగా ఎన్నికలు నిర్వహించాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ), రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ఆరు వారాల్లోపు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించండి.
కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అడ్డంకి కాదు. ఈ ఏడాది జనవరి 1నాటికి అమల్లో ఉన్న ఓటర్ల జాబితాపై సర్ ప్రక్రియ ఎలాంటి ప్రభావం చూపబోదు. సర్ కారణంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేయడానికి వీల్లేదు.
- ధర్మాసనం
స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించిన 34 శాతం రిజర్వేషన్‌తో కలిపి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయి. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం. బీసీ రిజర్వేషన్ల కోటా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కొట్టివేస్తున్నాం. సుప్రీం తీర్పునకు అనుగుణంగా రిజర్వేషన్ల కల్పన అంశాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలి.
- హైకోర్టు సీజే జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం
అమరావతి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ‘సర్’ కారణంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అయితే స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోటా పెంచడాన్ని తిరస్కరించింది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం ఇచ్చిన రెండు జీవోలను కొట్టివేసింది. గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లాగుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియను నేటి(గురువారం) నుంచి సాధ్యమైనంత త్వరగా ఆరు వారాల్లోపు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎస్‌ఈసీని ఆదేశించింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల పదవీకాలం ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌తో ముగిసిందని గుర్తు చేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. వీటితో కలిపి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయని, ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని పేర్కొంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఈ ఏడాది ఆగస్టు 20న జారీ చేసిన జీవో 105, పురపాలకశాఖ ఆగస్టు 19న జారీ చేసిన జీవో 1065లు చట్టం ముందు నిలబడవని, వాటిని కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. వికాశ్ కిషన్‌రావ్ గవాలి కేసులో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి బీసీ జనగణన, వారి స్థితిగతులపై డేటా సేకరణ ప్రక్రియను పూర్తి చేసి జనహిత్ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా 50శాతానికి మించి రిజర్వేషన్ల కల్పన అంశాన్ని పునఃపరిశీలన చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది. జీవోలను సవాల్ చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను డిస్పోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఆ డేటా ప్రాతిపదిక కాకూడదు
‘సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌తో కలిపి 50 శాతం పరిమితిని దాటి రిజర్వేషన్లు ఖరారు చేయడం చెల్లదు. వికాశ్ కిషన్‌రావ్ గవాలి కేసులో సుప్రీంకోర్టు చెప్పినట్లు బీసీలకు రిజర్వేషన్ ఖరారుకు ముందు వారి వెనుకబాటు, పరిణామాలపై అధ్యయనం చేసి శాస్త్రీయ సమాచారం సేకరణకు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి. రిజర్వేషన్ పరిమితి 50 శాతం దాటకూడదనే నిబంధన లేదని జన్హిత్ అభియాన్ కేసులో సర్వోన్నత న్యాయస్థానం పేర్కొనప్పటికీ.. ఆ పరిమితి దాటాలంటే శాస్త్రీయ డేటా ఆధారంగా మాత్రమే సాధ్యమౌతుందని స్పష్టం చేసింది. ప్రస్తుత కేసులో సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు నిర్ణయించింది. బీసీల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు రాష్ట్రం నియమించిన ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ సైతం సమగ్ర కుటుంబ సర్వే డేటాపైనే ఆధారపడింది. ఆ కమిషన్ నివేదిక ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. ఆమోదం పొందలేదు. ఈ నేపథ్యంలో బీసీలకు 34శాతం రిజర్వేషన్ ఖరారు చేసేందుకు సమగ్ర కుటుంబ సర్వే డేటా ప్రాతిపదిక కాకూడదు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించాలంటే సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా ప్రస్తుత కేసులో ఎలాంటి శాస్త్రీయ ఎంపరికల్ డేటా అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంచాయతీరాజ్, పురపాలక శాఖలు ఇచ్చిన జీవోలను కొట్టివేస్తున్నాం’ అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది.
వాయిదా వేయడానికి వీల్లేదు
సర్ కారణంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. 2026 జనవరి 1నాటికి అందుబాటులో ఉన్న అసెంబ్లీ ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. అయితే తుది ఓటర్ల జాబితా ప్రచురణ విషయంలో పంచాయతీరాజ్, పురపాలకశాఖ చట్టాల్లోని సెక్షన్ 11, మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 12లోని నిబంధనలు పాటించాలని ఎస్‌ఈసీకి స్పష్టం చేసింది. సర్ ప్రక్రియ ముగిసి, తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాతే వార్డుల ఓటర్ల జాబితాను తయారు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి వేసిన పిటిషన్‌ను పరిష్కరించింది. వార్డుల పునర్విభజన ప్రక్రియలో జోక్యానికి నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లను ధర్మాసనం కొట్టివేసింది. వార్డులు పునర్విభజన చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. ‘1948 జనగణన చట్టం, 1990 జనగణన నిబంధనలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పునర్విభజన ప్రక్రియను చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరోధించలేవు. ఈ నేపథ్యంలో సెన్సస్ కమిషనర్ 2025 ఆగస్టు 13న జారీ చేసిన సర్క్యులర్ ద్వారా పరిపాలన యూనిట్ల సరిహద్దులను ఫ్రీజ్ చేసినప్పటికీ.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన ప్రక్రియకు అడ్డంకి కాదు’ అని పేర్కొంది.
వ్యాజ్యాలు కొట్టివేత
బీసీ జనగణన పూర్తి చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు చర్యలు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు దాఖలు చేసిన పిల్‌ను ధర్మాసనం కొట్టివేసింది. పిల్ విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది.. బీసీ స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా సారథ్యంలోని ఏకసభ్య కమిషన్(డెడికేటెడ్ కమిషన్‌ను) నియమిస్తూ ఇచ్చిన జీవోలు చెల్లుబాటు కావని వాదించారు. డెడికేటెడ్ కమిషన్ నియామకాన్ని సవాల్ చేస్తూ పిల్‌లో ఎలాంటి ప్లీడింగ్స్ లేనందున ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని, పిల్‌ను కొట్టివేస్తున్నామని ధర్మాసనం ప్రకటించింది.
సర్పంచ్ ఎన్నికల్లో బీసీలను ఉపవర్గీకరించి రిజర్వేషన్లు నిర్ణయించేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. విజయనగరం జిల్లాకు చెందిన దుర్గా ప్రసాద్ ఈ పిల్ వేశారు.
పదవీ కాలం ముగిసిన గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారులను పక్కనపెట్టి అప్పటివరకు సేవలు అందించిన సర్పంచ్‌లు, చైర్‌పర్సన్‌లనే కొనసాగించాలని దాఖలైన వ్యాజ్యాలను ధర్మాసనం డిస్పోజ్ చేసింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం పదవీ కాలం ముగిసిన తరువాత పదవుల్లో కొనసాగడానికి సర్పంచ్‌లు, చైర్‌పర్సన్‌లకు ఎటువంటి హక్కులేదని తేల్చిచెప్పింది. ప్రకాశం జిల్లాకు చెందిన పులిచర్ల లక్షమ్మ, ఎస్తేరమ్మ వేర్వేరుగా ఈ పిటిషన్లు వేశారు.
శ్రీకాకుళం, తూర్పు-పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని పలు గ్రామాలను సమీపంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ 2021 జూన్ 9న తీసుకొచ్చిన ఏపీ మున్సిపాలిటీ(సవరణ)చట్టాన్ని (యాక్ట్ 5/2021) సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను ధర్మాసనం కొట్టివేసింది. ‘సమీప మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం చేసిన చట్ట సవరణ రాజ్యాంగ నిబంధనలు, అధికరణ 243(క్యూ)కి విరుద్ధంగా లేదు’ అని పేర్కొంది.
గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంచాయతీరాజ్, పురపాలక శాఖలు జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ న్యాయవాది తాండవ యోగేష్, పి.వెంకట నరసింహశర్మ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిని డిస్పోజ్ చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. రాష్ట్రంలోని 13,325 గ్రామ పంచాయతీలు, 123 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది యోగేష్ మరో పిల్ వేశారు.
వ్యాజ్యాలన్నింటిపై ఇటీవల ధర్మాసనం తుది విచారణ జరిపింది. వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం గురువారం నిర్ణయం వెల్లడించింది.
ఈ వార్తలనూ చదవండి:
వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు