చిరుద్యోగుల సొమ్మూ స్వాహా!
ABN , Publish Date - Sep 20 , 2026 | 03:36 AM
మద్య నిషేధం.. 2019 ఎన్నికల ముందు జగన్‌కు ఆయుధం. అధికారంలోకి వచ్చాక అదే పెద్ద ఆదాయం. మద్యం ముడుపులతో మూడున్నర వేల కోట్ల దోపిడీ. డిపోల నుంచి షాపులకు రవాణాలో మరో 195 కోట్లు స్వాహా.
మద్యం స్కామ్‌లో మరో అక్రమం
ఎంపీ మిథున్ రెడ్డి, వాసుదేవ రెడ్డికి భారీగా లబ్ధి
దుకాణాల్లోని సిబ్బంది జీతాల్లో 400 కోట్లు స్వాహా
9 వేల మంది నియామకం.. 11 వేల మందికి జీతాలు
రికార్డుల్లో జీతం 20-25 వేలు.. చెల్లింపు 13-16 వేలే
‘రెడ్డి అండ్ రెడ్డి’ పేరుతో రాయచోటికి చెందిన
పెద్దిరెడ్డి అనుచరుడి ద్వారా భారీ స్కామ్
ఈఎ్‌సఐ, పీఎఫ్, జీఎస్టీ ఎగవేసి మరో 100 కోట్లు
కేంద్ర సంస్థల హెచ్చరికతో ‘సిట్’ ఆరా
కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్ సహా డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసినట్టు గుర్తింపు
స్కామ్‌ల గురించి వినుంటారు! కానీ స్కామ్‌లో స్కామ్‌ల గురించి వినడం చాలా అరుదు! గత జగన్ ప్రభుత్వం ఈ ‘ఘనత’ కూడా సొంతం చేసుకుంది. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిన సంగతి తెలిసిందే. ఇదే స్కామ్‌లో మద్యం రవాణాకు సంబంధించిన మరో స్కామ్ బయటపడింది. మద్యం దుకాణాల సిబ్బంది జీతాల్లో 400 కోట్లు స్వాహా చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
నాడు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేయడానికి 9 వేలమంది సిబ్బందిని నియమించారు. అయితే 11-12 వేలమంది పనిచేస్తున్నట్టుగా అదనంగా జీతాలు తీసుకున్నారు. ఒక్కొక్కరికి 20-25 వేల చొప్పున జీతాలు ఇస్తున్నట్టుగా ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుని, 13-16 వేలు మాత్రమే చెల్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్ ద్వారా దోచుకున్న సొమ్ములో సింహభాగం ఎంపీ మిథున్ రెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అందుకున్నట్టు సమాచారం.
(అమరావతి-ఆంధ్రజ్యోతి): మద్య నిషేధం.. 2019 ఎన్నికల ముందు జగన్‌కు ఆయుధం. అధికారంలోకి వచ్చాక అదే పెద్ద ఆదాయం. మద్యం ముడుపులతో మూడున్నర వేల కోట్ల దోపిడీ. డిపోల నుంచి షాపులకు రవాణాలో మరో 195 కోట్లు స్వాహా. అంతేకాదు నాడు ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాల పేరిట ఏకంగా 400 కోట్లు దోచుకున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. వైసీపీ హయాంలోని లిక్కర్ స్కామ్‌లో రోజుకో కొత్త తరహా మోసం వెలుగులోకి వస్తుండటంతో దర్యాప్తు అధికారులే విస్తుపోతున్నారు. రాష్ట్ర సీఐడీ పోలీసులే గాక కేంద్ర సంస్థలు సైతం జగన్ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో కోణాల్ని ఏపీ సిట్‌కు ఉప్పందిస్తూ అప్రమత్తం చేశాయి. మద్యం దుకాణాల సిబ్బంది జీతాల కోసం నాలుగేళ్లలో రూ.1000 కోట్లు ఖర్చు చేసిన వైసీపీ ప్రభుత్వంలో ‘రెడ్డి అండ్ రెడ్డి’ పేరుతో పెద్దిరెడ్డి అనుచరుడు, రాయచోటికి చెందిన వ్యక్తి సాగించిన దోపిడీ పర్వం వెలుగులోకి వచ్చింది. మద్యం షాపుల్లో అతి తక్కువ జీతానికి పనిచేసిన చిరుద్యోగుల్ని దోచుకున్న ఈ కొత్త కుంభకోణంపై సిట్ అధికారులు లోతుగా ఆరా తీశారు. నిందితులు ఆధారాలన్నీ ధ్వంసం చేసినట్టు గుర్తించారు.
చిరుద్యోగులకు మోసం
2019లో అధికారంలోకి వచ్చిన జగన్ మద్యపాన నిషేధం హామీపై మడమ తిప్పారు. ప్రభుత్వం ద్వారా లిక్కర్ షాపులు ఏర్పాటు చేసి, అవుట్ సోర్సింగ్ సిబ్బందితో విక్రయాలు చేయించారు. సిబ్బంది నియామకం కోసం రాయచోటిలో పెద్దిరెడ్డి అనుచరుడిగా చలామణి అయ్యే వ్యక్తికి చెందిన ‘రెడ్డి అండ్ రెడ్డి’ మ్యాన్ పవర్ ఏజెన్సీకి కాంట్రాక్టు ఇచ్చారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్‌లో కార్యాలయం ఏర్పాటు చేసిన ఆ వ్యక్తి తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్ పక్కనే రూ.7 కోట్లు విలువ చేసే భారీ విల్లాలో ఉండేవారు. ఆ ఏజెన్సీ ద్వారా రాష్ట్రంలోని 2934 షాపుల్లో పనిచేయడానికి తొమ్మిది వేల మందిని నియమించారు. అయితే ప్రతి నెలా 11 వేల నుంచి 12 వేల మంది వరకూ జీతాలు ఇచ్చినట్టుగా రికార్డులు చూపి, అదనంగా 2, 3 వేల మంది పేరుతో జీతాలు తీసుకున్నారు. అంతేగాక చెల్లింపుల్లోనూ భారీగా కోత విధించారు. ప్రభుత్వం నుంచి జీతాల పేరిట ఒక్కొక్కరికి రూ.20 వేలు, రూ.25 వేలు తీసుకుని, పనిచేసే వాళ్లకు రూ.13 వేల నుంచి రూ.16 వేలు మాత్రమే చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏటా ప్రభుత్వం నుంచి రూ.250 కోట్ల నుంచి రూ.260 కోట్ల వరకూ తీసుకున్న ఆ ఏజెన్సీ సుమారు 40 శాతం వరకూ స్వాహా చేసింది. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి ఈ సొమ్ములో సింహభాగం అందుకున్నట్లు సమాచారం. మద్యం షాపుల్లో పనిచేసిన చిరుద్యోగులకు చెల్లించాల్సిన ఈఎస్ఐ, పీఎఫ్ వంటివి కూడా కలిపి మరో 100 కోట్లు స్వాహా చేసినట్లు తెలిసింది. ఇలా వందల కోట్లు దారి మళ్లించినట్టు ఈ కుంభకోణంలో కేంద్ర ప్రభుత్వాన్ని సైతం లిక్కర్ గ్యాంగ్ మోసగించింది.
జీఎస్టీ ఎగవేతతో వెలుగులోకి..
మద్యం కుంభకోణం దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు మద్యం సీసాల రవాణాలోనూ కీలక గుట్టు తేల్చారు. రవాణా కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ.400 కోట్లు చెల్లించగా, ఇందులో రూ.195 కోట్లు స్వాహా చేసినట్టు గుర్తించారు. ఇదే సమయంలో కేంద్ర సంస్థల నుంచి సిట్‌కు కీలక సమాచారం అందింది. జగన్ ప్రభుత్వంలో ఏర్పాటైన మద్యం షాపుల్లో పనిచేసిన సిబ్బందికి జీతాల చెల్లింపులో అక్రమాలు జరిగాయని, సేవల పేరిట ప్రభుత్వం నుంచి తీసుకున్న సొమ్ముకు జీఎస్‌టీ చెల్లించలేదని, ఆరా తీయగా మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చాయని ఉప్పందించింది. సమాచారం అందుకున్న సిట్ అధికారులు ‘రెడ్డి అండ్ రెడ్డి’ ఏజెన్సీ యజమానిని పిలిచి ప్రశ్నించారు.
నాలుగేళ్లలో ప్రభుత్వం నుంచి జీతాల పేరుతో రూ. వెయ్యి కోట్లు తీసుకున్న వివరాలు, చూపించిన మొత్తం కన్నా తక్కువ చెల్లించి అందులో 40 శాతం వరకూ స్వాహా చేయడం, సిబ్బంది వాస్తవ సంఖ్య, పే రోల్ రికార్డులు, బ్యాంకు ఖాతాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీ చెల్లింపులు, ప్రతి నెలా నిర్వహించిన లావాదేవీల గురించి అడిగారు. మద్యం షాపుల్లో పనిచేసే మ్యాన్ పవర్ కాంట్రాక్టు కోసం తాను ప్రయత్నం చేయలేదని, ఎంపీ మిథున్ రెడ్డి, వాసుదేవ రెడ్డి తనను ముందుంచి మొత్తం వ్యవహారం నడిపించారని రెడ్డి అండ్ రెడ్డి ఏజెన్సీ యజమాని చెప్పారు. అయితే సిట్ అధికారులు అడిగిన డాక్యుమెంట్లు చూపించలేదు. నోటీసు ఇచ్చి.. మరోవైపు బెంజ్ సర్కిల్‌లోని ఆ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఎలాంటి ఆఫీసు లేదని, ప్రభుత్వం మారగానే మూసేశారని తెలిసింది. దీంతో సిట్ అధికారులు రెడ్డి అండ్ రెడ్డి ఏజెన్సీ యజమానికి నోటీసు ఇచ్చారు. తాము అడిగిన ప్రతి డాక్యుమెంటు తీసుకుని రావాలంటూ పేర్కొన్నారు. అప్పటికే జీఎస్టీ అధికారుల నుంచి నోటీసులపై నోటీసులు అందుకున్న ఏజెన్సీ యజమాని.. మిథున్ రెడ్డి, వాసుదేవ రెడ్డి బామ్మర్ది వద్దకెళ్లి తనను సిట్ ఇబ్బందులకు గురి చేస్తోందని వాపోయినట్లు తెలిసింది.
జీఎస్టీ పేరిట రూ.4 కోట్లు వసూలు చేసి..
రూ.30 కోట్ల వరకూ చెల్లించాల్సిన జీఎస్టీ కట్టకపోవడంతోనే తన మెడకు చుట్టుకుందని, కొంత మొత్తం జీఎస్టీ చెల్లించాలంటూ మిథున్ నుంచి రూ.2 కోట్లు, వాసుదేవ రెడ్డి బామ్మర్ది నుంచి రూ.కోటి, మరో వ్యక్తి నుంచి ఇంకో కోటి రెడ్డి అండ్ రెడ్డి ఏజెన్సీ యజమాని తీసుకున్నట్టు తెలిసింది. అయితే ఆ సొమ్ము వాడేసికున్నట్లు సమాచారం. దీనిపై డబ్బులిచ్చిన వ్యక్తులు నిలదీయగా.. ‘మీ పేరు సిట్‌కు చెబితే మీరు ఇబ్బంది పడతారు. ఈ డబ్బు అడగొద్దు’ అంటూ పెద్దిరెడ్డి అనుచరుడు చెప్పినట్టు తెలిసింది.
మూడో స్కామ్‌పై కేంద్ర సంస్థల ఆరా!
వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మూడున్నర వేల కోట్ల మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్‌పై ఆధారాలు సేకరించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మద్యం రవాణా స్కామ్‌లోనూ రూ.195 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు తేల్చింది. ఇందులో అరెస్టులు మొదలుపెట్టిన ఈడీ వైసీపీ నేతల్ని వరుసగా జైలుకు పంపుతోంది. తాజాగా మరో స్కామ్ వెలుగులోకి రావడంతో జీఎస్టీ అధికారులు ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తారు? పీఎఫ్ సంస్థ ఏమి చేస్తోందో? విచారణలో తేలాల్సి ఉంది. ఇదే సమయంలో సిట్ మరింత లోతుగా ఆరా తీసి దాదాపు పదివేల మంది చిరుద్యోగుల్ని మోసం చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఈ వార్తలనూ చదవండి...
కుప్పం బ్రాంచ్ కెనాల్ పరిధి పెంపు