డిజిటల్ వ్యవసాయంలో దిక్సూచి ఏపీ
ABN , Publish Date - Sep 19 , 2026 | 04:19 AM
రాష్ట్రంలో సాగు వ్యయాన్ని తగ్గించి, రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో సాంకేతికతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో వ్యవసాయ రంగానికి అనుసంధానం అయ్యేలా వినూత్న సంస్కరణలను అమలు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.
రైతుల ఆదాయాన్ని పెంచేలా వినూత్న సంస్కరణలు
ప్రకృతి ఎంత సవాల్ విసిరినా రైతును ఒంటరిగా వదలం
దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సులో అచ్చెన్న
అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సాగు వ్యయాన్ని తగ్గించి, రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో సాంకేతికతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో వ్యవసాయ రంగానికి అనుసంధానం అయ్యేలా వినూత్న సంస్కరణలను అమలు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. డిజిటల్ వ్యవసాయ రంగంలో ఏపీ దేశానికే దిక్సూచిగా నిలిచిందని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయశాఖ మంత్రుల సదస్సులో అచ్చెన్నాయుడు ప్రసంగించారు. ‘రైతులే స్వయంగా ఈ-క్రాప్ నమోదు చేసుకునేలా చర్యలు తీసుకున్నాం. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌లో అగ్రిస్టాక్ అమలులో ఏపీ ప్రగతి సాధించింది. పీఎం కిసాన్ లబ్ధిదారుల్లో 52.08లక్షల మంది రైతులకు ఫార్మర్ ఐడీలు సృష్టించాం. డిజిటల్ సర్వే ద్వారా 68లక్షల మంది రైతులకు చెందిన 97లక్షల ఎకరాల పంట విస్తీర్ణాన్ని నమోదుచేశాం. ఈ డేటాను పంట విస్తీర్ణం, దిగుబడి అంచనాలకు వినియోగిస్తాం. ఏపీఏఐఎంఎస్-2.0 యాప్ ద్వారా ఎరువుల అక్రమాలకు అడ్డుకట్ట పడింది. 22శాతం ఎరువులు ఆదా అయ్యాయి. 24.69లక్షల మంది రైతులు ఈ యాప్‌ద్వారా ఎరువులు కొనుగోలుచేశారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ పప్పుధాన్యాల సాగులో 99శాతం లక్ష్యాన్ని సాధించాం. వర్షాభావం నేపథ్యంలో కంటింజెన్సీ ప్లాను కింద రూ.200 కోట్లతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు 80శాతం రాయితీపై విత్తనాల సరఫరా చేస్తున్నాం. పంటలబీమా కోసం 44లక్షల దరఖాస్తులు రాగా, రూ.16వేల కోట్ల బీమా కల్పిస్తున్నాం. రూ.లక్ష కోట్ల అంచనాతో రాయలసీమను ఉద్యాన హబ్‌గా మార్చే ప్రణాళికలు సిద్ధం చేశాం. రాష్ట్రవ్యాప్తంగా 115 రైతుబజార్లను క్రియాశీలం చేశాం. ప్రకృతి ఎంత సవాల్ విసిరినా రైతును ఒంటరిగా వదిలే ప్రసక్తే లేదు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి సవాల్‌ను అధిగమించి, వ్యవసాయాన్ని బలోపేతం చేసి, రైతుల ఆదాయం పెంచేలా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని’ చెప్పారు. ఏపీకి సహకరిస్తున్నందుకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు అచ్చెన్న కృతజ్ఞతలు తెలిపారు.
ఎల్‌నినోపై జగన్‌వి అబద్ధాల డ్రామాలు
ఎల్‌నినోను ఎదుర్కొనేలా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతుంటే.. జగన్ అవాస్తవాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం దుర్మార్గం అని మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ది ఎల్‌నినో బాధ కాదు.. పచ్చి అబద్ధాల నినో డ్రామా.. అని మండిపడ్డారు. ‘ఎల్‌నినో నేపథ్యంలో పంటలు కాపాడేందుకు శాస్త్రీయ దృక్పథంతో సమగ్ర కార్యాచరణ చేపట్టాం. జూన్-ఆగస్టు మధ్య రాష్ట్రంలో 51.2శాతం వానలోటు ఉండగా, దేశవ్యాప్తంగా ఇది 13శాతమే. పంటనష్టం తర్వాత స్పందించడం కన్నా.. శాస్త్రీయ సమాచారం, శాటిలైట్ పర్యవేక్షణ, జలాశయాల నీటి నిల్వలు, నేల తేమ, పంటల స్థితి, సాగు పురోగతిని ఎప్పటికప్పుడు రైతుసేవా కేంద్రం స్థాయిలో విశ్లేషిస్తున్నాం. వర్షాభావం నేపథ్యంలో 17లక్షల మంది రైతులు స్వచ్ఛందంగా పీఎండీఎస్ పద్ధతుల వైపు మొగ్గు చూపారు. మార్కెట్ ఇంటర్వెన్షన్‌కు రూ.800కోట్లు కూటమి ప్రభుత్వం ఖర్చు చేసింది. పంటల బీమాతో రైతులకు రక్షణగా నిలుస్తున్నాం’ అని వివరించారు.
ఈ వార్తలనూ చదవండి...