Share News

విత్తు పడింది కానీ...!

ABN , Publish Date - Aug 30 , 2026 | 04:31 AM

ఎల్‌నినో కారణంగా.. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం 50 లక్షల ఎకరాలు దాటింది. ఇందులో సగం

విత్తు పడింది కానీ...!

  • సీజన్‌ లక్ష్యంలో 66శాతం సాగులోకి

  • పంట దిగుబడిపైనే అనుమానాలు

  • ఇప్పటికే 51.3 శాతం వానలోటు

  • అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి

  • 580.1కిగాను కురిసింది 194.1 మిల్లీ మీటర్లే

  • జలాశయాల్లో గతేడాది 727.. నేడు 514 టీఎంసీలే

  • ఎల్‌నినో ప్రభావంతో ఇకపై వర్షాలు అనుమానమే!

అమరావతి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో కారణంగా.. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం 50 లక్షల ఎకరాలు దాటింది. ఇందులో సగం... వరి సాగే ఉంది. అయితే పంట దిగుబడి పైనే రైతుల్లో ఆందోళన నెలకొంది. కాలువలు, బోర్ల కింద రైతులు అధికంగా వరి సాగు చేశారు. ఇప్పటికైతే ఫర్వాలేదు కానీ.. ఇకపై కాల్వల శివారు భూములకు నీరందుతుందో లేదోనన్న ఆందోళన రైతుల్లో ఉంది. వర్షాభావ పరిస్థితులు, ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో బోరు బావుల కింద వేసిన పంటలకు సీజన్‌ పూర్తయ్యేవరకూ నీరందుతుందో లేదోనన్న ఆందోళన కూడా ఉంది. మొత్తం విస్తీర్ణంలో ఇప్పటివరకు 79 శాతం భూమిలో విత్తనం పడగా, సీజన్‌ లక్ష్యంలో 66శాతం విస్తీర్ణం సాగులోకి వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటివరకు సాధారణం కన్నా 51.2 శాతం వర్షపాతం తగ్గింది. మొత్తం 28 జిల్లాలూ వానలోటునే ఉన్నాయి. ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు అతిభారీ లోటులో ఉండగా, మిగతా 25 జిల్లాలు తీవ్ర లోటులో ఉన్నాయి. ఈ సీజన్‌లో సాధారణ వర్షపాతం 580.1 మిల్లీమీటర్లు కాగా, జూన్‌1 నుంచి ఆగస్టు 26 నాటికి కేవలం 194.1 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. రాష్ట్రంలోని జలాశయాల్లో గతేడాది ఇదే సమయానికి 727 టీఎంసీల నీరు ఉండగా, ప్రస్తుతం 514 టీఎంసీలే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావం నెలకొని, చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి.


అయినా సీజన్‌ మొత్తంగా 77.1 లక్షల ఎకరాల్లో పంటలు సాగవ్వాల్సి ఉండగా, ఇప్పటికే 50.90 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. ఇందులో వరి సాగు 37.85లక్షల ఎకరాలకుగాను, సుమారు 26 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. పత్తి 9.92 (77శాతం), వేరుశనగ 3.43 (35శాతం), పప్పు ధాన్యాలు 6.66 (77శాతం) లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. చిరుధాన్యాల పంటలు 3.5 ఎకరాల్లోనే పడ్డాయి. అయితే జనుము 134శాతం, సోయాబీన్‌ 127శాతం, పెసలు 104శాతం విత్తనం పడింది. మొత్తం ఆహార ధాన్యాలు 52లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా, 36.0 లక్షల ఎకరాల్లోనే సాగులోకి వచ్చాయి. ఖరీఫ్‌ సీజన్‌ దాదాపు మూడు నెలలు అయిపోయినందున ఇక వర్షాధారంగా తప్ప.. పంటల సాగు పెరిగే అవకాశం తక్కువేనని అధికారులు చెప్తున్నారు. వరి నాట్లకు నీరందే పరిస్థితి లేనందున ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కోరింది. దీంతో బోర్లు ఉన్న రైతులు వరి సాగు చేస్తూనే ఉన్నారు. ఇక మిరప సాగుకు ఈ సీజన్‌లో అవకాశాలు కష్టమే. కాలువ నీటికి గ్యారెంటీ లేకపోవడంతో రైతులు మిర్చి సాగు తగ్గించే యోచనలో ఉన్నారు. మొత్తంగా ఖరీఫ్‌ పంటలకు ఇంకో నెల రోజులు నీటి తడులు అవసరం ఉంది. కానీ రానున్న మూడు నెలలు ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. కాగా జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలను సాగునీటి కన్నా.. తాగునీటి అవసరాలకు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓవైపు వర్షాభావం, మరోవైపు ఎండ తీవ్రత వల్ల పొడి వాతావరణం కొనసాగుతున్నందున రానున్న రబీ సాగుకు నీటి గండం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Also Read:

సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్‌

గత ప్రభుత్వానికి నరకడం తప్ప.. నాటే ఆలోచనే రాలేదు: నాగబాబు

Updated Date - Aug 30 , 2026 | 05:54 AM