Share News

‘కడప’ కోటకూ బీటలు!

ABN , Publish Date - Nov 04 , 2026 | 01:59 AM

‘పుర’ పోరులో వైసీపీ చిరునామా గల్లంతైంది. జగన్‌ సొంత అడ్డా కడప జిల్లా మొత్తం ‘కూటమి’ పరమైంది. ఆయన సొంత గడ్డ పులివెందుల కూడా ‘వైఎస్‌’ కుటుంబం చేతి నుంచి తొలిసారి జారిపోయింది.

‘కడప’ కోటకూ బీటలు!

  • పుర పోరులో జగన్‌కు షాక్‌లు

  • జిల్లాలోని స్థానాలన్నీ కూటమి పరం

  • సొంత గడ్డ పులివెందులలోనూ పరాజయం

  • తొలిసారిగా పుసుపు జెండా రెపరెపలు

  • కూటమి జోరుకు చిరునామా గల్లంతు

  • 2016లో చిన్నాన్న వివేకాను, ఇప్పుడు చిన్నమ్మ ప్రమీలను కూడా గెలిపించలేని దైన్యం

‘పుర’ పోరులో వైసీపీ చిరునామా గల్లంతైంది. జగన్‌ సొంత అడ్డా కడప జిల్లా మొత్తం ‘కూటమి’ పరమైంది. ఆయన సొంత గడ్డ పులివెందుల కూడా ‘వైఎస్‌’ కుటుంబం చేతి నుంచి తొలిసారి జారిపోయింది. రాష్ట్రంలో ఒక కార్పొరేషన్‌, ఎనిమిది మునిసిపాలిటీలు ఉన్న ఏకైక జిల్లా... కడప! ఇప్పుడు ఇవన్నీ కూటమికే సొంతమయ్యాయి. ఇది ఒకరకంగా ఊచకోతే! కడప కార్పొరేషన్‌ మేయర్‌ పీఠంతోపాటు రాజంపేట, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కమలాపురం, ఎర్రగుంట్ల, పులివెందుల, జమ్మలమడుగు మున్సిపల్‌ పీఠాలు కూటమి దక్కించుకుని క్లీన్‌ స్వీప్‌ చేసింది. వీటిలో రాజంపేట, బద్వేలు, మైదుకూరు, కమలాపురం, ప్రొద్దుటూరు చైర్‌పర్సన్‌ స్థానాలను టీడీపీ... ఎర్రగుంట్ల మున్సిపాలిటీని బీజేపీకి ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు జరిగిన పులివెందుల, జమ్మలమడుగు మునిసిపాలిటీల్లో టీడీపీ అభ్యర్థులు ‘అధిపతులు’గా గెలిచారు. కడప కార్పొరేషన్‌లోనూ టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత కడప మున్సిపల్‌ పీఠంపై పసుపు జెండా రెపరెపలాడనుంది. ఇక... రాజంపేట, జమ్మలమడుగు, కమలాపురం, ఎర్రగుంట్ల మునిసిపల్‌ స్థానాలూ తొలిసారిగా టీడీపీ ఖాతాలో పడటం విశేషం.


కూలిన వైఎస్‌ కోట...

కడప జిల్లా రాజకీయంగా వైఎస్‌ కుటుంబానికి కంచుకోట. వైఎస్‌ సీఎం అయిన 2004 నుంచి ఏ ఎన్నికలు జరిగినా అదే పరిస్థితి. అయితే... 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తొలిసారిగా ‘ఫ్యాన్‌’ రెక్క లు విరిచేసింది. కడప పార్లమెంటు పరిధిలో 5 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. గత ఏడాది పులివెందుల జడ్పీటీసీ, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ వైసీపీ ఓటమిపాలైంది. ఇప్పుడు మునిసిపల్‌ ఫలితాల్లోనూ అదే జరిగింది. ఇక వైఎస్‌ అంటే పులివెందుల... పులివెందుల అంటే వైఎస్‌ కుటుంబం! అక్కడ వార్‌ ఎప్పు డూ వన్‌సైడే! 1978లో వైఎస్‌ కుటుంబం పులివెందుల రాజకీయాల్లోకి అడుగుపెట్టింది.

అప్పటి నుంచి ఇప్పటిదాకా వార్డు మెంబరు నుంచి పార్లమెంటు వరకు... ఎవరైనా సరే, వైఎస్‌ కుటుంబం అండ ఉన్నవారిదే గెలుపు. 2005లో పులివెందుల మున్సిపాలిటీగా అవతరించింది. తొలి చైర్‌పర్సన్‌ కాంగ్రెస్‌ నుంచి గెలుపొందగా... తర్వాత వైసీపీనే గెలుస్తూ వస్తోంది. ఇప్పుడు తొలిసారిగా పులివెందుల మునిసిపాలిటీపై పసుపు జెండా ఎగిరింది. మున్సిపాలిటీలో 20 వార్డులను కూటమి ఏకగ్రీవం చేసుకుంది. ఇది జగన్‌కు పెద్దషాక్‌! పులివెందుల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల్లో ప్రతి రౌండులోనూ టీడీపీ అభ్యర్థి తూగుట్ల గీతాకుమారి.. తన ప్రత్యర్థి జగన్‌ చిన్నమ్మ అయిన ప్రమీలపై ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.

2016లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగిన సొంత చిన్నాన్న వైఎస్‌ వివేకానంద రెడ్డిని జగన్‌ గెలిపించుకోలేకపోయారు. ఇప్పుడు... పులివెందుల మునిసిపల్‌ పోరులో చిన్నమ్మ వరుస అయ్యే ప్రమీలనూ గెలిపించుకోలేకపోయారు. పులివెందుల మున్సిపాలిటీలో మొత్తం 40వార్డులుండగా... వైసీపీకి దక్కింది 3 మాత్రమే. పెద్దిరెడ్డి అడ్డా పుంగనూరులో... మొత్తం 36 వార్డులకుగాను ఒక్క వార్డు కూడా వైసీపీకి దక్కలేదు.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం

కూటమికే.. పట్టణం

Updated Date - Nov 04 , 2026 | 01:59 AM