స్కాన్ చేస్తేనే లిక్కర్ సేల్
ABN , Publish Date - Nov 25 , 2026 | 03:09 AM
రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం వరుస చర్యలు చేపడుతోంది. మద్యంప్రియుల జేబులు దోచిన గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా...
మద్యం అమ్మకాల్లో సరికొత్త విధానం
సూపర్‌మార్కెట్ల తరహాలో సీసాల స్కానింగ్
స్కాన్ చేయగానే ధర స్పీకర్‌లో వెల్లడి
డిస్టిలరీలు.. డిపోలు.. షాపుల దాకా ట్రాకింగ్
షాపుల్లోని నిల్వలపైనా రియల్‌టైమ్ డేటా
పని వేళల్లోనే మెషీన్లు పనిచేసేలా ఏర్పాటు
అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశం
సూపర్ మార్కెట్లలో స్కాన్ చేసినట్టే, మద్యం షాపుల్లోనూ సీసాలను స్కాన్ చేసిన తర్వాతే అమ్మే విధానం అమల్లోకి రానుంది. గతంలో ఫోన్లతో స్కానింగ్ చేసి సీసాలను అమ్మాలనే నిబంధన పెట్టారు. అయితే అది పూర్తిస్థాయిలో అమలుకాలేదు. ఇకనుంచి కొత్త విధానంలో దుకాణంలో అమ్మిన సీసాలు, నిల్వ లెక్కలపై రియల్ టైమ్ డేటా ప్రభుత్వం తెలుసుకోనుంది. వచ్చే నెల నుంచే ఎక్సైజ్ శాఖ ఈ విధానాన్ని అన్ని మద్యం షాపులకూ వర్తింపజేయనుంది.
(అమరావతి - ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం వరుస చర్యలు చేపడుతోంది. మద్యంప్రియుల జేబులు దోచిన గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా, జవాబుదారీతనాన్ని మరింత పెంచుతూ, మద్యం దుకాణాల్లో స్కానింగ్ విధానాన్ని తీసుకు రానుంది. మద్యం సీసాను స్కాన్ చేసిన తర్వాతే వినియోగదారుకు దుకాణదారు అమ్ముతారు.
అంతేకాదు.. స్కాన్ చేసిన వెంటనే దాని వివరాలు, ధర స్క్రీన్‌పై కనిపిస్తాయి. అలాగే స్కానింగ్ మెషీన్ స్పీకర్‌లోనూ ధర వినిపిస్తుంది. ఇప్పటిదాకా సూపర్ మార్కెట్లలో అందుబాటులో ఉన్న ఈ టెక్నాలజీని ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాలకూ వర్తింపజేయనుంది. రాష్ట్రంలోని అన్ని మద్యం షాపులకూ స్కానింగ్ మెషీన్లు సరఫరా చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దీనికోసం లైసెన్సీలు నెలవారీ అద్దె చెల్లించాలి.
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
మద్యం షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తాయి. స్కానింగ్ మెషీన్లు కూడా ఆ సమయంలో మాత్రమే పనిచేసేలా సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నారు. రాత్రి 10 దాటిన వెంటనే ఆగిపోయే మెషీన్లు తిరిగి ఉదయం 10గంటలకు పనిచేయడం ప్రారంభిస్తాయని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో పనివేళలు దాటిన తర్వాత, ఉదయాన్నే ఇష్టారాజ్యంగా మద్యం అమ్మడానికి అవకాశం ఉండదు. ప్రస్తుతం అనేక మంది లైసెన్సీలు పనివేళలతో సంబంధం లేకుండా నచ్చినట్లు మద్యం అమ్ముతున్నారు.
అనేక చోట్ల ఉదయం 7గంటల నుంచే మద్యం అనధికారికంగా అమ్ముతున్నారు. అయితే ముందుగానే సీసాలు స్కానింగ్ చేసి పెట్టుకుని పనివేళలు దాటిన తర్వాత అమ్మే అవకాశం ఉంది. ఆ అవకాశం ఉన్నప్పటికీ వినియోగదారులు ఏ బ్రాండ్ అడుగుతారో తెలియదు కాబట్టి చాలావరకు పనివేళల ఉల్లంఘనలు తగ్గుతాయని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. అలాగే స్ర్కీన్, స్పీకర్ ద్వారా ధరలు తెలుస్తాయి కాబట్టి ధరల్లో అదనపు వసూళ్లు కూడా తగ్గే వీలుంది. ఒకవేళ ఏదైనా సీసాను స్కాన్ చేయకుండా విక్రయిస్తే దానికి వ్యాపారులు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఉల్లంఘనల స్థాయిని బట్టి జరిమానాలు విధిస్తారు.
ఇక రియల్‌టైమ్ డేటా
స్కానింగ్ విధానం అమల్లోకి వస్తే మద్యం అమ్మకాలకు సంబంధించిన రియల్‌టైమ్ డేటా ప్రభుత్వానికి తెలుస్తుంది. ప్రస్తుతం డిస్టిలరీల్లో మద్యం ఉత్పత్తి, అక్కడినుంచి మద్యం డిపోల్లో నిల్వ వరకు సీసాల ట్రాకింగ్ జరుగుతోంది. డిపో నుంచి ఏ షాపునకు మద్యం వెళ్లిందో కూడా తెలుస్తుంది. కానీ, వ్యాపారులు షాపులో ఉన్న నిల్వలో ఎంత అమ్మారో, ఎంత ఉందో ప్రభుత్వానికి తెలియదు. స్కానింగ్ విధానం వల్ల ఎన్ని కేస్‌లు, ఎన్ని సీసాలు ఏ సమయానికి అమ్మారు... ఆ వ్యాపారి ప్రభుత్వం నుంచి తీసుకున్న స్టాకులో ఎంత అమ్మాడు.. ఇంకా ఎంత మిగిలి ఉందనే వివరాలు తెలిసిపోతాయి. స్టాకులో తేడాలు వస్తే ఎక్కువ మద్యం ఆ షాపులకు ఇవ్వకుండా అధికారులు చర్యలు తీసుకుంటారు.
అద్దెపైనే అనుమానాలు
ఎక్సైజ్ శాఖ ప్రవేశపెడుతున్న విధానం మంచిదే అయినా, ఆ సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్న సంస్థ మెషీన్లకు నిర్ణయించిన ధరపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో 3,736 మద్యం షాపులున్నాయి. ఒక్కో షాపునకు ఒక స్కానింగ్ మెషీన్‌ను ఇస్తారు. ఇప్పటికే ట్రాక్ అండ్ ట్రేస్ ప్రాజెక్టు అమలుచేస్తున్న ఆప్‌స్టెక్ అనే సంస్థ ఈ మెషీన్లు సరఫరా చేస్తుంది. అందుకుగాను నెలకు ఒక్కో షాపు రూ.15వేలు అద్దె కట్టాలని కోరింది. దీనిపై మంగళవారం జరిగిన చర్చల్లో రూ.11 వేలు కట్టేలా ఒక నిర్ణయానికి వచ్చారు. అంటే నెలకు సుమారు రూ.4కోట్లు ఆ కంపెనీ మద్యం షాపుల నుంచి వసూలు చేయనుంది.
గత ప్రభుత్వంలో ప్రభుత్వ మద్యం షాపుల్లో ఇలాంటి స్కానింగ్ మెషీన్లకు నెలకు రూ.5వేలు తీసుకున్నారు. కానీ, అప్పట్లో ఈ విధానం పెద్దగా అమలు కాలేదు. ఇప్పుడు ఆ మెషీన్లకు రెట్టింపు కంటే ఎక్కువ ధరను సదరు సంస్థ డిమాండ్ చేస్తోంది. మెషీన్లు, సాఫ్ట్‌వేర్ సహకారం కోసం ఏడాదికి దాదాపుగా రూ.50 కోట్లు ఆ కంపెనీకి మద్యం వ్యాపారులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత పెద్దమొత్తంలో వ్యాపారుల నుంచి నగదు చెల్లించేలా చేస్తున్నారంటే, దీనిలో ఇంకెవరికైనా లబ్ధి చేకూరుతుందా.... అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా, ఇప్పటికే నష్టాల్లో ఉన్న తమపై ఈ భారం ఏంటని వ్యాపారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘ఇలాంటివి మా నెత్తిన పెడితే ఇక మద్యం వ్యాపారం ఎలా చేయా’లని వాపోతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి