Share News

పాఠ్యపుస్తకాల కాంట్రాక్ట్‌ మళ్లీ వారికే?

ABN , Publish Date - Nov 16 , 2026 | 02:51 AM

వచ్చే విద్యా సంవత్సరానికి ఇంటర్‌ పాఠ్యపుస్తకాల ముద్రణ కాంట్రాక్టు వ్యవహారంలో అధికారుల తీరుపై ఆరోపణలు వస్తున్నాయి. టెండర్లు పిలిచి కాంట్రాక్టు ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోకుండా...

పాఠ్యపుస్తకాల కాంట్రాక్ట్‌ మళ్లీ వారికే?

  • కాంట్రాక్టర్‌ ఎంపికలో ఆ సంస్థలకే ప్రాధాన్యం

  • కంటెంట్‌ లీక్‌ చేసినా పట్టని అధికారులు

  • ఇంటర్‌ సేల్‌ బుక్స్‌ ముద్రణపై ప్రచారం

  • నామినేషన్‌ పద్ధతిలో ఎంపికపై విమర్శలు

  • చిన్న ప్రింటర్లనూ కాపాడాలని డిమాండ్లు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): వచ్చే విద్యా సంవత్సరానికి ఇంటర్‌ పాఠ్యపుస్తకాల ముద్రణ కాంట్రాక్టు వ్యవహారంలో అధికారుల తీరుపై ఆరోపణలు వస్తున్నాయి. టెండర్లు పిలిచి కాంట్రాక్టు ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోకుండా నామినేషన్‌ విధానంలో కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో విక్రయ పుస్తకాల ముద్రణ బాధ్యతను విక్రమ్‌, వీజీఎస్‌ కంపెనీలు దక్కించుకున్నాయి. అయితే వీజీఎస్‌ నుంచి కీలకమైన కంటెంట్‌ లీకైంది. ఫిజిక్స్‌, గణితం సబ్జెక్టుల సాఫ్ట్‌కాపీలు వాట్సప్‌లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఆ సంస్థకు ఇచ్చిన వర్క్‌ ఆర్డర్‌ను రద్దుచేశారు. అప్పటివరకూ ముద్రించిన వాటిని మాత్రమే తీసుకున్నారు. కంటెంట్‌ లీక్‌పై సైబర్‌ క్రైమ్‌లో తెలుగు అకాడమీ కేసు నమోదు చేసింది. ఇప్పుడు వచ్చే విద్యా సంవత్సరానికి గాను మళ్లీ అవే కంపెనీలకు కాంట్రాక్టు ఇస్తున్నారనే ప్రచారం మొదలైంది.

8లక్షల మందికి పుస్తకాలు

రాష్ట్రంలో 10లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌ చదువుతున్నారు. వారిలో ప్రభుత్వ కాలేజీల్లో ఉన్న సుమారు లక్షన్నర మందికి ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తోంది. మిగిలిన 8 లక్షల మందికిపైగా విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను తెలుగు అకాడమీ ద్వారా ఇంటర్‌ విద్యాశాఖ ముద్రిస్తుంది. వాటిని సేల్‌ బుక్స్‌ కింద వెండర్ల ద్వారా విక్రయాలకు అందుబాటులో ఉంచుతారు. ముద్రణ కాంట్రాక్టు విలువ దాదాపు రూ.25 కోట్లు ఉంటుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పేజీకి సుమారు 37 పైసలు చొప్పున ముద్రించారు. అదే రేటుపై తిరిగి అవే కంపెనీలకు కాంట్రాక్టు కట్టబెట్టడానికి కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.


ఉద్దేశపూర్వకంగానే కేసుపై నిర్లక్ష్యం?

సాధారణంగా ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా కంటెంట్‌ లీకైతే సంబంధిత అధికారులు దానిని తీవ్రంగా పరిగణిస్తారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ పాఠ్యపుస్తకాలు పూర్తిగా మారిపోయాయి. కొత్తగా వచ్చిన కంటెంట్‌ వీజీఎస్‌ పబ్లిషర్స్‌ ఈ-మెయిల్‌ ద్వారా లీకైంది. తమ ఈ-మెయిల్‌ హ్యాక్‌ చేశారని ఆ సంస్థ సైబర్‌ క్రైమ్‌ విభాగంలో ఫిర్యాదు చేసింది. అయితే ఎవరి ద్వారా లీకైందో తేల్చే విషయాన్ని తెలుగు అకాడమీ అధికారులు ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి.

కాగా, గతంలో ప్రభుత్వం నుంచి పాఠ్యపుస్తకాల ముద్రణ కోసం తీసుకున్న కంటెంట్‌తో వీజీఎస్‌ స్టడీ మెటీరియల్‌ తయారుచేసుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా అధికారుల తీరుతో తమకు అన్యాయం జరుగుతోందని చిన్న ప్రింటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గైడ్లు ముద్రించే కంపెనీలకు పాఠ్యపుస్తకాల కాంట్రాక్టు ఇవ్వొద్దని వీరు చాలాకాలం నుంచి డిమాండ్‌ చేస్తున్నారు. ఆ కంపెనీలకు టెండర్‌ ఇవ్వబోమని మంత్రి లోకేశ్‌ హామీ ఇచ్చారని, ఆ మేరకు అధికారులు టెండర్లు పిలిచి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. పెద్ద కంపెనీలకు అనుకూలంగా టెండరు నిబంధనలు రూపొందించవద్దని కోరుతున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు

ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!

Updated Date - Nov 16 , 2026 | 02:56 AM