Share News

కోడ్‌ ఉల్లంఘన కేసులో జగన్‌పై చర్యలు నిలిపివేత

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:29 AM

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసులో వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై తదుపరి చర్యలను హైకోర్టు నిలిపివేసింది. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా పులివెందులలో కోడ్‌ను ఉల్లంఘించి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ముందు ధర్నా చేయడంతోపాటు...

కోడ్‌ ఉల్లంఘన కేసులో జగన్‌పై చర్యలు నిలిపివేత

  • మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసులో వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై తదుపరి చర్యలను హైకోర్టు నిలిపివేసింది. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా పులివెందులలో కోడ్‌ను ఉల్లంఘించి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ముందు ధర్నా చేయడంతోపాటు పోలీసులు, అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ పులివెందుల పట్టణ పోలీసులు ఇటీవల జగన్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తదుపరి చర్యలు అన్నింటినీ నిలిపివేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదుదారుడు రఫిక్‌ జాన్‌కు నోటీసులు జారీ చేశారు. కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించారు. విచారణను వాయిదా వేశారు.

మండల విద్యాశాఖ అధికారి రఫిక్‌ జాన్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జగన్‌తోపాటు కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి తదితరులపై పులివెందుల పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ జగన్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అన్నీ ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవేనని జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. ‘కేసులో ఇప్పటికే 13మంది సాక్ష్యులను విచారించాం. వారందరూ పిటిషనర్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారు.

పిటిషనర్‌ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. ర్యాలీగా మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అడ్డుకున్న పోలీసులను తోసివేసి కమిషనర్‌ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించారు. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుంది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ ఇవ్వొద్దని కోరారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 05:32 AM