Share News

జేడీతో అఫిడవిట్‌ వేయించండి

ABN , Publish Date - Nov 26 , 2026 | 06:05 AM

నెల్లూరు జిల్లాలోని భీమవరం గ్రామ పంచాయతీ సర్పంచ్‌ ఎన్నికల్లో తాను దాఖలు చేసిన నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో) ఉద్దేశ పూర్వకంగా తిరస్కరించారని...

జేడీతో అఫిడవిట్‌ వేయించండి

  • ఎస్‌ఈసీకి హైకోర్టు ధర్మాసనం ఆదేశం

  • సర్పంచ్‌ నామినేషన్‌ తిరస్కరణపై విచారణ

అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాలోని భీమవరం గ్రామ పంచాయతీ సర్పంచ్‌ ఎన్నికల్లో తాను దాఖలు చేసిన నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో) ఉద్దేశ పూర్వకంగా తిరస్కరించారని, ఈ విషయంలో ఎన్నికల ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను బొర్రా వెంకటేశ్వరరెడ్డి సవాల్‌ చేశారు. ఈ క్రమంలో ఆయన అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.

నామినేషన్‌ స్వీకరణ అనంతరం ఆర్వో జారీ చేసినట్లు చెబుతున్న అక్నాలడ్జిమెంట్‌ నిర్దిష్ట ఫార్మాట్‌లో లేదని, దానిపై ఉన్న సంతకం తనది కాదని, ముద్రపై కూడా సందేహం ఉందని ఎన్నికల కమిషన్‌ కోర్టుకు వివరించింది. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎస్ఈసీ) జాయింట్‌ డైరెక్టర్‌(జేడీ)తో అఫిడవిట్‌ దాఖలు చేయించాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.


బొర్రా వెంకటేశ్వరరెడ్డి ఈ నెల 19న సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. దానిని ఆమోదిస్తూ రిటర్నింగ్‌ అధికారి రశీదు ఇచ్చారు. కానీ, 21న విడుదల చేసిన ఫాం-6 జాబితాలో వెంకటేశ్వరరెడ్డి పేరును ప్రచురించలేదు. దీనిని సవాల్‌ చేస్తూ వెంకటేశ్వరరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి.. ఈ వివాదంపై ఎన్నికల ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలన్నారు. ఈ ఉత్తర్వులపై వెంకటేశ్వరరెడ్డి ధర్మాసనం ముందు అప్పీల్‌ వేశారు. బుధవారం నాటి విచారణలో వెంకటేశ్వరరెడ్డి తరఫున న్యాయవాది చక్రవర్తి వాదనలు వినిపించారు.

‘‘పిటిషనర్‌తో పాటు నామినేషన్‌ వేసిన శ్రీనివాసులు పేరును మాత్రమే ఫాం-6లో ప్రచురించారు. శ్రీనివాసులు సతీమణి అనూష ప్రభుత్వ ఉద్యోగి. ఆమె ఒత్తిడి మేరకే రిటర్నింగ్‌ అధికారి వెంకటేశ్వరరెడ్డి నామినేషన్‌ తిరస్కరించారు. ఇలాంటి సందర్భాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు.’’ అని వివరించారు. ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది అశ్వనీ కుమార్‌ వాదనలు వినిపించారు.

ఈ వార్తలనూ చదవండి:

యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

Updated Date - Nov 26 , 2026 | 07:08 AM