Share News

డెడికేటెడ్‌ కమిషన్‌ ఏర్పాటు ఉద్దేశమేంటి?

ABN , Publish Date - Sep 17 , 2026 | 04:02 AM

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రా సారథ్యంలో డెడికేటెడ్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తాము పరిశీలించాల్సి ఉందని, వాటిని తమ ముందుంచాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కమిషన్‌ ఏర్పాటు వెనుక ఉద్దేశం ఏంటి? ఏయే అంశాలపై అది అధ్యయనం చేసిందో తదితర వివరాలను కూడా సమర్పించాలని స్పష్టం చేసింది.

డెడికేటెడ్‌ కమిషన్‌ ఏర్పాటు ఉద్దేశమేంటి?

  • ఏయే అంశాలపై అధ్యయనం చేసింది?

  • గణాంకాలు, ఉత్తర్వులను మా ముందుంచండి

  • రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

  • స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం కోటాపై ముగిసిన వాదనలు

  • తీర్పు రిజర్వ్‌ చేసిన ధర్మాసనం

అమరావతి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రా సారథ్యంలో డెడికేటెడ్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తాము పరిశీలించాల్సి ఉందని, వాటిని తమ ముందుంచాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కమిషన్‌ ఏర్పాటు వెనుక ఉద్దేశం ఏంటి? ఏయే అంశాలపై అది అధ్యయనం చేసిందో తదితర వివరాలను కూడా సమర్పించాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ నిర్ణయించామని చెబుతున్న నేపథ్యంలో ఆ గణాంకాలను కోర్టు ముందుంచాలని ఆదేశించింది. 34 శాతం రిజర్వేషన్ల కేటాయింపును సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసా గిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ప్రకటించింది.


పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, 33.33 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్‌, పురపాలక శాఖలు జారీ చేసిన జీవోలు 105, 1065లను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని, వాటిని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేశ్‌ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఇవే జీవోలను సవాల్‌ చేస్తూ కృష్ణా జిల్లాకు చెందిన పెనమకూరు వెంకట నరసింహశర్మ మరో పిల్‌ వేశారు. ఇవి బుధవారం మరోసారి విచారణకు రాగా.. ఆ రెండు శాఖల తరఫున సీనియర్‌ న్యాయవాది దేవదత్‌ కామత్‌ వాదనలు వినిపించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని రాజ్యాంగంలో ఎక్కడా నిర్దేశించలేదని.. స్థానిక పరిస్థితుల ఆధారంగా రిజర్వేషన్‌ కల్పనపై ఆయా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే గణాంకాల ప్రకారం బీసీల జనాభా 50.42 శాతంగా ఉందన్నారు. సమగ్ర కుటుంబ సర్వే, డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదికలోని గణాంకాల ఆధారంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పించామన్నారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటినప్పటికీ ఎన్నికల నిర్వహించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేశారు. అయితే అదనపు రిజర్వేషన్‌ కల్పించడం కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొందన్నారు.

ధర్మాసనం స్పందిస్తూ.. 34 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని తప్పుపడుతూ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత.. తిరిగి ఎలా పునరుద్ధరిస్తారని ప్రశ్నించింది. డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదికను కోర్టు ముందు ఉంచాలని తాము కోరడం లేదని స్పష్టం చేసింది. కమిషన్‌ నివేదికలోని గణాంకాల ఆధారంగా బీసీల రిజర్వేషన్‌ పై నిర్ణయం తీసుకున్నామని చెబుతున్న నేపథ్యంలో ఆ వివరాలను తమ ముందు ఉంచాలని కోరుతున్నామని పేర్కొంది. గణాంకాలను కోర్టుకు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా శాఖ గ్రామ/వార్డు సచివాలయాల సహకారంతో ఇంటింటికీ వెళ్లి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిందని.. ఆ శాఖ సేకరించిన గణాంకాలపై డెడికేటెడ్‌ కమిషన్‌ ఆధారపడిందని వెల్లడించారు.


రిజర్వేషన్లు 50 శాతం మించరాదు: పిటిషనర్‌

న్యాయవాది తాండవ యోగేశ్‌ వాదనలు వినిపిస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పించే రిజర్వేషన్‌ 50శాతానికి మించడానికి వీల్లేదని రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టమైన తీర్పులు ఇచ్చాయన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 50.42 శాతం ఉన్నట్లు తేలినప్పటికీ వారికి 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదని తెలిపారు. ప్రస్తుతం బీసీలకు 34శాతం కోటా ఇవ్వాలన్న నిర్ణయంతో గ్రామీణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌ 61.08కి చేరుతుందని.. న్యాయస్థానాలు గతంలో రద్దు చేసిన విధానాన్ని తిరిగి అమల్లోకి తీసుకురావడం చట్టవిరుద్ధమని చెప్పారు. ‘సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీసీలకు రిజర్వేషన్‌ కల్పన విషయంలో రాష్ట్రప్రభుత్వం ట్రిపుల్‌ టెస్ట్‌ విధానాన్ని అనుసరించాలి. ముందుగా డెడికేటెడ్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలి. స్థానిక సంస్థల్లో బీసీల రాజకీయ స్థితిగతుల పై కమిషన్‌ అధ్యయనం చేయాలి. అంతిమంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50శాతం మించడానికి వీల్లేదు. అయితే రాష్ట్రప్రభుత్వం ట్రిపుల్‌ టెస్ట్‌ విధానాన్ని అనుసరించలేదు. సాధ్యమైనంత త్వరగా స్థానిక ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించండి’ అని కోర్టును కోరారు.


ఈ వార్తలనూ చదవండి:

గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్

ఎక్కువ ధరకు గణేశ్ లడ్డూ వేలం పాడడంపై వివాదం.. వ్యక్తి ఆత్మహత్య

Updated Date - Sep 17 , 2026 | 04:02 AM