విజయవాడలో మూల్యాంకనంపై తీర్మానం చేశారా?
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:54 AM
గ్రూప్-1 జవాబుపత్రాలను విజయవాడలో మూల్యాంకనం చేయాలన్న ప్రతిపాదనను అప్పటి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ బోర్డు ముందు పెట్టారా? ప్రతిపాదనను ఆమోదిస్తూ తీర్మానం ఏమైనా చేశారా?
మూల్యాంకనం ప్రతిపాదనను సవాంగ్ ఏపీపీఎస్సీ బోర్డు ముందు పెట్టారా?
హాయ్‌ల్యాండ్‌లో ప్రక్రియను రద్దు చేస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చారా? రికార్డులు ఉన్నాయా?
స్పష్టత ఇస్తూ అఫిడవిట్ వేయండి
గ్రూప్-1పై కమిషన్‌కు హైకోర్టు ఆదేశం
అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 జవాబుపత్రాలను విజయవాడలో మూల్యాంకనం చేయాలన్న ప్రతిపాదనను అప్పటి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ బోర్డు ముందు పెట్టారా? ప్రతిపాదనను ఆమోదిస్తూ తీర్మానం ఏమైనా చేశారా? హాయ్‌ల్యాండ్‌లో జరిగిన ప్రక్రియను రద్దు చేస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చారా? అందుకు సంబంధించిన రికార్డులు ఏమైనా ఉన్నాయా? తదితర అంశాలపై స్పష్టత ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్-1 జబాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాల విషయంలో దాఖలైన అప్పీళ్లపై బుధవారం కూడా వాదనలు కొనసాగాయి. ఉద్యోగాలకు ఎంపిక కాని అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాది గూడ శివ, న్యాయవాది అన్వేష వాదనలు వినిపించారు. వారి వాదనలు ముగియడంతో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తరఫు రిప్లై వాదనల కోసం విచారణను అక్టోబరు 6కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డి.రమేశ్, జస్టిస్ హరి హరనాథశర్మతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.
హైకోర్టు ఆదేశాలతో సిట్ విచారణ
గ్రూప్-1 జవాబుపత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని నిర్ధారిస్తూ పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించాలని హైకోర్టు సింగిల్ జడ్జి 2024 మార్చి 13న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు, పొందనివారు వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. వాస్తవాలు తేల్చేందుకు సీఐడీ డీజీ నేతృత్వంలో హైకోర్టు సిట్ ఏర్పాటు చేసింది. అక్రమాలు, ఫోర్జరీ ఆరోపణలపై దర్యాప్తు పూర్తి చేసి సిట్ తుది నివేదిక దాఖలు చేసింది. అప్పీళ్లపై ధర్మాసనం తుది విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే.
నిబంధనలు ఉల్లంఘించారు
బుధవారం జరిగిన విచారణలో సీనియర్ న్యాయవాది గూడ శివ, న్యాయవాది ఎస్.అన్వేష వాదనలు వినిపిస్తూ.. ‘గ్రూప్-1 నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం పరీక్ష నిర్వహణ, మూల్యాంకనం ప్రక్రియలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు.. సంబంధిత వ్యక్తులందరికీ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఏపీపీఎస్సీ ఇందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ఏపీపీఎస్సీ బోర్డు తీర్మానం లేకుండానే అప్పటి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ విజయవాడలో మూల్యాంకనం చేయించారు. ఇలా చేయడం ఏపీపీఎస్సీ నిబంధనలకు విరుద్ధం. విజయవాడలో మూల్యాంకనానికి సంబంధించి ఎలాంటి ప్రొసీడింగ్స్ లేవని సిట్ తేల్చింది. ఎంపిక ప్రక్రియలో ఏపీపీఎస్సీ పూర్తిగా రాజీ పడింది. నిబంధనలు ప్రకారం ఎగ్జామినర్లు బ్లూ, బ్లాక్ పెన్ను మాత్రమే వినియోగించాలి. నిబంధనలు ఉల్లంఘించి విభిన్న రంగుల పెన్నులు ఉపయోగించారు. వైట్నర్ సైతం వినియోగించారు. ఓఎంఆర్ వాల్యుయేషన్ స్లిప్పులపై మార్కులు వేసేటప్పుడు ప్రతీ కరెక్షన్ వద్ద ఎగ్జామినర్ సంతకం ఉండాలి. ఆ నిబంధన పాటించలేదు. మొత్తం 57 మంది ఎగ్జామినర్లలో 47 మంది పేర్లు, సెల్‌ఫోన్ నంబర్లు వాట్సప్ ద్వారా బహిర్గతం చేశారు. విజయవాడలో జరిగిన మాన్యువల్ మూల్యాంకనానికి సంబంధించి ఎగ్జిబిట్లను పరీక్షించిన ఫోరెన్సిక్.. 97.55 శాతం దిద్దుబాట్లు ఉన్నట్లు గుర్తించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకొని ప్రక్రియను రద్దు చేయండి’ అని కోరారు.
మీ సూచనలు ఏమిటి?
వాదనలు ముగిసిన అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. కోర్టు ముందు ఉన్న ఆధారాలను పరిశీలిస్తే మార్పులు అన్నీ ఓఎంఆర్ షీట్లపైనే జరిగాయని, జవాబుపత్రాలు అలాగే ఉన్నాయని గుర్తు చేసింది. తాము చేపట్టబోయే తదుపరి కార్యాచరణపై సలహాలు ఇవ్వాలని సీనియర్ న్యాయవాదిని కోరింది. సీనియర్ న్యాయవాది గూడ శివ బదులిస్తూ.. హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి పర్యవేక్షణలో సబ్జెక్ట్ నిపుణులతో జవాబుపత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయించడం లేదా తిరిగి మెయిన్స్ పరీక్ష నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రీ ఎగ్జామినేషన్ అనేది చివరి ఆప్షన్‌గా ఉండాలన్నారు.
ఈ వార్తలనూ చదవండి...
ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’