Share News

చంద్రబాబుపై కేసులు సీబీఐకివ్వాలన్న పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

ABN , Publish Date - Nov 11 , 2026 | 04:41 AM

సీఎం చంద్రబాబు, తదితరులపై నమోదైన కేసుల దర్యాప్తును సీబీఐ, ఈడీకి అప్పగించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది.

చంద్రబాబుపై కేసులు సీబీఐకివ్వాలన్న పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

  • వాదనలు ముగియడంతో హైకోర్టు ఉత్తర్వులు

అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు, తదితరులపై నమోదైన కేసుల దర్యాప్తును సీబీఐ, ఈడీకి అప్పగించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు, తదితరులపై ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, స్కిల్‌, ఫైబర్‌ గ్రిడ్‌, రాజధాని అసైన్డ్‌ భూములు, మద్యం, ఉచిత ఇసుక పాలసీల విషయంలో సీఐడీ నమోదు చేసిన పలు కేసుల దర్యాప్తును సీబీఐ, ఈడీకి అప్పగించేలా ఆదేశించాలని కోరుతూ పాత్రికేయుడు బాలగంగాధర తిలక్‌ 2024లో హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు.

దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకొని సీజ్‌ చేసిన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను సంబంధిత వ్య క్తులకు తిరిగి ఇవ్వకుండా విజయవాడ ఏసీబీ కోర్టును ఆదేశించాలని కోరుతూ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు స్కిల్‌ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మరో పిల్‌ వేశారు. ఈ పిల్స్‌పై ఇటీవల ధర్మాసనం తుది విచారణ జరిపింది. ఇరువైపుల వాదనలు ముగిశాయి. అయితే కేసుల సమాచారాన్ని పట్టిక రూపంలో తమ ముందు ఉంచాలని సీఐడీ తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసిన విషయం తెలిసిందే.


ఈ పిటిషన్లు మంగళవారం విచారణకు రాగా సీఐడీ తరఫు న్యాయవాది అనురాగ్‌ అహ్లువాలియా స్పందిస్తూ.. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేసుల వివరాలు అన్నింటినీ పట్టిక రూపంలో కోర్టు ముందు ఉంచామన్నా రు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి తప్ప ఇతరులు ఎవరూ ప్రొటెస్ట్‌ పిటిషన్‌ దాఖలు చేయలేదన్నారు. ఈ కేసులతో సంబంధం లేని థర్డ్‌ పార్టీ వ్యక్తులు ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన ఫైనల్‌ రిపోర్ట్‌, కేసుల మూసివేత ఉత్తర్వుల ప్రతులను ఇప్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు వేశారన్నారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. కేసుల ఉపసంహరణకు ఎన్‌వోసీలు ఇచ్చిన వారిలో నలుగురు ప్రభుత్వాధికారులే ఉన్నారన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 04:42 AM