పులివెందులలో రీపోలింగ్‌పై.. సీపీ పిటిషన్ కొట్టివేత
ABN , Publish Date - Nov 04 , 2026 | 02:04 AM
పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో రీపోలింగ్ నిర్వహించాలని, ఓట్ల లెక్కింపును నిలిపివేసేలా ఆదేశించాలని కోరుతూ వైసీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీల, ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి వేసిన అనుబంధ పిటిషన్లను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది.
ప్రత్యామ్నాయాలను ఆశ్రయించాలని హైకోర్టు సూచన
అన్ని వార్డుల్లో రీపోలింగ్ జరపాలన్న ఎస్ ప్రమీల, అవినాశ్ పిటిషన్లు కొట్టివేత
అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) నిర్ణయించిన 4 వార్డుల్లోనే కాకుండా.. మొత్తం పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో రీపోలింగ్ నిర్వహించాలని, ఓట్ల లెక్కింపును నిలిపివేసేలా ఆదేశించాలని కోరుతూ వైసీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీల, ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి వేసిన అనుబంధ పిటిషన్లను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. చట్టపరమైన ప్రత్యామ్నాయాలను ఆశ్రయించాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మండవ కిరణ్మయి మంగళవారం ఉదయం 7.30 గంటలకు తీర్పు వెలువరించారు. కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తగిన ముందస్తు రక్షణ చర్యలు తీసుకునేలా ఎస్‌ఈసీని ఆదేశించాలని కోరుతూ ప్రమీల, అవినాశ్‌రెడ్డి హైకోర్టులో అత్యవసరంగా అనుబంధ పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
అధికార పార్టీ నేతలు బూత్‌లు ఆక్రమించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, సీసీటీవీ ఫుటేజ్, వెబ్ కాస్టింగ్, ఇతర ఆధారాలను పరిగణనలోకి తీసుకుని ఎస్‌ఈసీ నిర్ణయించిన 4 వార్డుల్లోనే కాకుండా మిగతా వార్డులన్నింటిలో రీపోలింగ్ నిర్వహించేలా ఎస్‌ఈసీని ఆదేశించాలని, కౌంటింగ్ ప్రక్రియను నిలుపుదల చేసేలా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. వీటిపై సోమవారం విచారణ జరిగింది. ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది అశ్వినీకుమార్ వాదనలు వినిపించారు. పులివెందులలో 1న పోలింగ్ ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్‌పీ నుండి ఎస్‌ఈసీ నివేదిక తెప్పించుకుందని.. రిపోర్టులను పరిశీలించిన తర్వాతే నాలుగు వార్డుల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎస్‌ఈసీ నిర్ణయించిందన్నారు.
సోమవారం జరిగిన రీపోలింగ్‌లో ఎలాంటి ఫిర్యాదులూ అందలేదని తెలిపారు. పిటిషనర్లకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఎన్నికల ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలి తప్ప హైకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదన్నారు. ఈ విషయంలో ఇదే హైకోర్టులోని ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చిందని తెలిపారు. సోమవారం వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి అనుబంధ పిటిషన్లను కొట్టివేస్తూ మంగళవారం ఉదయం నిర్ణయం వెల్లడించారు.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం