పిటిషనర్ల భూములపై యథాతథ స్థితి పాటించండి
ABN , Publish Date - Oct 11 , 2026 | 03:43 AM
ఇండోసోల్ ప్రాజెక్ట్ కోసం సేకరిస్తున్న భూముల్లో పిటిషనర్లకు చెందినవాటిపై తదుపరి విచారణ వరకు యథాతథస్థితి పాటించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.
అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ఇండోసోల్ ప్రాజెక్ట్ కోసం సేకరిస్తున్న భూముల్లో పిటిషనర్లకు చెందినవాటిపై తదుపరి విచారణ వరకు యథాతథస్థితి పాటించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ గిరిధర్‌తో కూడిన ధర్మాసనం శనివారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ప్రకాశం జిల్లా, ఉలవపాడు మండలం, కరేడు గ్రామం పరిధిలో ఇండోసోల్ సోలార్ ప్రాజెక్ట్ భూముల సేకరణ విషయంలో అధికారులు చట్టనిబంధనలు అనుసరించడంతోపాటు..
భూసేకరణ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలని కోరుతూ కరేడు గ్రామానికి చెందిన 63మంది రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. భూసేకరణ చట్టంలోని సెక్షన్ 15(2) నిబంధనలను అధికారులు ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. భూసేకరణ ప్రొసీడింగ్స్‌లో జోక్యానికి నిరాకరించారు. భూసేకరణలో తదుపరి ప్రక్రియను కొనసాగించుకోవచ్చని, అయితే చట్టనిబంధనలకు లోబడి వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ 45మంది రైతులు ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు. అప్పీల్ శనివారం విచారణకు రాగా ఎస్‌జీపీ ప్రణతి స్పందిస్తూ.. భూసేకరణకు సంబంధించి అదనపు వివరాలు కోర్టు ముందుంచేందుకు సమయం ఇవ్వాలని కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించి విచారణను వాయిదా వేసింది.
ఈ వార్తలనూ చదవండి:
ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం
దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!