Share News

గ్రూప్‌-1 అక్రమాలపై తుది విచారణ నేటికి వాయిదా

ABN , Publish Date - Sep 29 , 2026 | 04:28 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్‌-1 జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలు, ఫోర్జరీ ఆరోపణలకు సంబంధించి దాఖలైన అప్పీళ్లపై హైకోర్టు సోమవారం తుది విచారణను ప్రారంభించింది.

 గ్రూప్‌-1 అక్రమాలపై తుది విచారణ నేటికి వాయిదా

  • ఉద్యోగాలకు ఎంపికైనవారి తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాదులు

  • హాయ్‌ల్యాండ్‌లో నిబంధనలు పాటించనందునే తిరిగి విజయవాడలో మూల్యాంకనం : న్యాయవాదులు

అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్‌-1 జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలు, ఫోర్జరీ ఆరోపణలకు సంబంధించి దాఖలైన అప్పీళ్లపై హైకోర్టు సోమవారం తుది విచారణను ప్రారంభించింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తరఫున సీనియర్‌ న్యాయవాదులు సీవీ మోహన్‌రెడ్డి, సురేంద్రరావు వాదనలు వినిపిస్తూ సిట్‌ నివేదిక ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అనుకూలంగా ఉందన్నారు. పరీక్ష నిర్వహణ, జవాబుపత్రాల మూల్యాంకనం ప్రక్రియలో అవకతవకలు జరిగాయని మాత్రమే సిట్‌ చెప్పిందని, అక్రమాలు జరిగినట్లు ఎక్కడా నిర్ధారించలేదని వాదించారు. అభ్యర్థుల ఎంపికలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సిట్‌ చెప్పలేదన్నారు.

హాయ్‌ల్యాండ్‌లో జరిగిన మూల్యాంకనంలో నిబంధనలు పాటించనందునే విజయవాడలో మూల్యాంకనం చేయాలని ఏపీపీఎస్సీ నిర్ణయించిందని తెలిపారు. సోమవారం కోర్టు సమయం ముగియడంతో అప్పీళ్లపై విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేష్‌, జస్టిస్‌ హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. గ్రూప్‌-1 జవాబుపత్రాల మాన్యువల్‌ మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని నిర్ధారిస్తూ.. పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి 2024 మార్చిలో 13న తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీపీఎస్సీ, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు, ఎంపిక కానివారు వేర్వేరుగా ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. వాస్తవాలు తేల్చేందుకు సీఐడీ డీజీ నేతృత్వంలో హైకోర్టు సిట్‌ను ఏర్పాటు చేయగా.. సిట్‌ దర్యాప్తును పూర్తి చేసి తుది నివేదికను దాఖలు చేసింది.

ఈ వార్తలనూ చదవండి...

పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ

పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..

Updated Date - Sep 29 , 2026 | 04:28 AM