Share News

ఏజెంట్‌గా ధర్మానను అడ్డుకోవద్దు

ABN , Publish Date - Nov 28 , 2026 | 01:16 AM

శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా ఏజెంట్‌గా వ్యవహరించకుండా ధర్మాన ప్రసాదరావును అడ్డుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

ఏజెంట్‌గా ధర్మానను అడ్డుకోవద్దు

  • పోలీసులకు హైకోర్టు స్పష్టీకరణ

అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా ఏజెంట్‌గా వ్యవహరించకుండా ధర్మాన ప్రసాదరావును అడ్డుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, తదనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎస్ఈసీ) ఇచ్చిన సర్క్యులర్‌కు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేసింది. పిటిషన్‌ను డిస్పోజ్‌ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం. కిరణ్మయి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెల 26న జరిగిన శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీ మేయర్‌ అభ్యర్థి గుండా లక్ష్మిదేవికి ఎన్నికల ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న తనను ఎలాంటి కారణం లేకుండా పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారని, ప్రధాన ఎన్నికల ఏజెంట్‌ అయిన తనకు ఈ నెల 30న ఓట్ల లెక్కింపు రోజున ఆంక్షలు విధించకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వైసీపీ మాజీ మం త్రి ధర్మాన ప్రసాదరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

పిటిషనర్‌ తరఫున న్యాయవాది బేతి మనోజ్‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ మేయర్‌ అభ్యర్థి తరఫున పోలింగ్‌ ఏజెంట్‌గా నియమితులయ్యారన్నారు. ఓట్ల లెక్కింపు రోజున తిరిగి ఆయన్ను నిర్బంధించే అవకాశం ఉందన్నారు. పిటిషనర్‌కు రక్షణ కల్పించాలని కోరారు. పోలీసుల తరఫున సహాయ ప్రభుత్వ న్యాయవాది అజయ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ..

ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా పిటిషనర్‌ను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారని వివరించారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. పిటిషనర్‌ పోలింగ్‌ ఏజెంట్‌గా నియమితులైనట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఆధారాలు అన్నీ అఫిడవిట్‌కు జత చేశామని న్యాయవాది బదులిచ్చారు. వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి.. ఎన్నికల ప్రక్రియలో ఏజెంట్లను అనుమతించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా పిటిషనర్‌ను అడ్డుకోవద్దని, ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని పోలీసులను ఆదేశించారు.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 01:22 AM