Share News

ఆక్సిజన్‌ ఏం చేస్తున్నారు..?

ABN , Publish Date - Aug 04 , 2026 | 09:03 AM

కొవిడ్‌- 19 నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్‌ సరఫరా కోసం దాదాపు రూ. 105 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన పీఎ్‌సఏ (ప్రెసర్‌ స్వింగ్‌ అడ్సార్‌ప్షన్‌) ప్లాంట్లు నిరుపయోగంగా ఎందుకు మారాయని అధికారులను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ప్రశ్నించారు.

ఆక్సిజన్‌ ఏం చేస్తున్నారు..?
Satya Kumar Yadav

  • కొనుగోళ్లు భారీగా ఎందుకు పెరిగాయి?

  • ఆరోగ్య శాఖ సమీక్షలో మంత్రి సత్యకుమార్‌


అమరావతి (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌- 19 నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్‌ సరఫరా కోసం దాదాపు రూ. 105 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన పీఎస్ఏ (ప్రెసర్‌ స్వింగ్‌ అడ్సార్‌ప్షన్‌) ప్లాంట్లు నిరుపయోగంగా ఎందుకు మారాయని అధికారులను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో పీఎస్ఏ ప్లాంట్లు, అధిక మోతాదులో ఎల్‌ఎంవో (లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌) కొనుగోళ్ల అంశాలపై సోమవారం మంగళగిరిలోని ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్‌ఎంవో కొనుగోళ్లకు సంబంధించి వాస్తవ డిమాండ్‌తో పాటు సరఫరాపై రెండు వారాల్లో సమగ్రంగా ఆడిట్‌ నిర్వహించాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ఆక్సిజన్‌ సరఫరాలో లోపాలను గుర్తించడంతో పాటు సవరణ చర్యలను చేపట్టాలన్నారు. వీటిని రెండు నెలల పాటు ఎనిమిది ప్రభుత్వాసుపత్రుల్లో అమలు చేసి అక్టోబరు 15లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. తద్వారా ఎల్‌ఎంవో డిమాండ్‌, సరఫరాలోని వ్యత్యాసాన్ని గుర్తించి ఆక్సిజన్‌ కొనుగోళ్ల ఖర్చును వీలైనంత వరకు తగ్గించవచ్చన్నారు. కోవిడ్‌ - 19 తీవ్రంగా ఉన్న 2020-21, 2021-22 సంవత్సరాల్లో రూ. 965.43 కోట్ల మేర బోధనాసుపత్రుల్లో ఎల్‌ఎంవో కొనుగోలు చేశారని చెప్పారు. అంతకుముందు 2016-20 మధ్య కేవలం రూ. 60.51 కోట్లు వ్యయం చేశారని, కొవిడ్‌ తర్వాత 2022-26 మధ్య నాలుగేళ్ల కాలంలో ఎల్‌ఎంవో కొనుగోలుకు రూ. 180.82 కోట్లు వ్యయమైందని మంత్రి చెప్పారు. గత నాలుగేళ్లలో కొత్త బోధనాసుపత్రులు, కొత్త ఆసుపత్రులు రావడం, పడకలు పెరగడం కొనుగోళ్లలో పెరుగుదలకు కొంత మేరకు కారణమైనప్పటికీ అధికారులు చెప్పిన ఆక్సిజన్‌ డిమాండ్‌, వాస్తవ సరఫరాకు మధ్య భారీ అంతరం కనిపిస్తోందని అన్నారు. వీటి పరిశీలనకు అనంతపురం, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం బోధనాసుపత్రులతో పాటు రెండు జిల్లా, రెండు ఏరియా ఆసుపత్రులను ఎంపిక చేయాలని ఆదేశించారు. పాత్‌ సంస్థ ఈ అధ్యయనాన్ని చేపడుతుందన్నారు.


162 పీఎస్‌ఏ ప్లాంట్లలో 161 నిరుపయోగం..

కొవిడ్‌-19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సాయంతో డీఎంఈ పరిధిలో 62 ఆసుపత్రుల్లో, సెకండరీ హెల్త్‌ పరిధిలో 100 పీఎస్‌ఏ ప్లాంట్లను ఏర్పాటు చేశారని అధికారులు వివరించారు. అయితే ఈ ప్లాంట్ల ద్వారా తయారయ్యే ఆక్సిజన్‌ ప్యూరిటీ నిర్వహణ, నియంత్రణకు తగిన సాంకేతిక సిబ్బందిని నియమించలేదన్నారు. ఐసీయూ, సాధారణ వార్డులకు ఆక్సిజన్‌ సరఫరాకు సంబంధించిన నాణ్యతతో నిమిత్తం లేకుండా ఒకే పైపులైన్‌ వ్యవస్థ ఉండడం వంటి వివిధ కారణాల వల్ల 162 పీఎస్‌ఏ ప్లాంట్లకు 161 ప్లాంట్లు నిరుపయోగంగా మారాయని చెప్పారు. ఈ సమీక్షలో హెల్త్‌ సెక్రటరీ వీరపాండియన్‌, డీఎంఈ డా.విష్ణువర్థన్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 5న తాగునీటి సరఫరా బంద్

‘ఉక్కు పని’ ఇక వల్లకాదు

Updated Date - Aug 04 , 2026 | 09:03 AM