‘ఉక్కు పని’ ఇక వల్లకాదు
ABN , Publish Date - Aug 04 , 2026 | 08:19 AM
విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ ఓ మణిహారం. అక్కడ ఉద్యోగం అంటే జీవితానికి భరోసా. ఆ ఘనతంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు.. ఎప్పుడెప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేద్దామా అని ఉద్యోగులు ఎదురు చూసే పరిస్థితి దాపురించింది. కొన్నేళ్ల నుంచి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-ఆర్‌ఐఎన్‌ఎల్‌లో ఉద్యోగుల రాజీనామా పరంపర కొనసాగుతూ ఉంది.
విశాఖ స్టీల్‌లో ఉద్యోగుల రాజీనామాల పరంపర
జూలై ఒక్క నెలలో 98 మంది రిజైన్
2021-2026 మధ్య 1,027 మంది రాజీనామా
వెళ్లిపోతున్న వారిలో ఎగ్జిక్యూటివ్‌లు, నాన్‌ఎగ్జిక్యూటివ్‌లు
యాజమాన్యం ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలే కారణం
పదోన్నతులు లేవు.. ప్రోత్సాహమూ కరవు
ఒత్తిళ్లను తట్టుకోలేక ఉద్యోగుల సతమతం
విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి: విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ ఓ మణిహారం. అక్కడ ఉద్యోగం అంటే జీవితానికి భరోసా. ఆ ఘనతంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు.. ఎప్పుడెప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేద్దామా అని ఉద్యోగులు ఎదురు చూసే పరిస్థితి దాపురించింది. కొన్నేళ్ల నుంచి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-ఆర్‌ఐఎన్‌ఎల్‌లో ఉద్యోగుల రాజీనామా పరంపర కొనసాగుతూ ఉంది. కేంద్రం ఆర్థిక ప్యాకేజీ అందించినా ఉద్యోగుల్లో విశ్వాసం కరవైంది. యాజమాన్యం తీసుకుంటున్న ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు, పెడుతున్న ఒత్తిళ్లను తట్టుకోలేక చాలామంది భవిష్యత్తు వెతుక్కుంటూ బయటకు వెళ్లిపోతున్నారు.
ఒక్క జూలై నెలలోనే 98 మంది రాజీనామా సమర్పించారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజీనామాలకు అడ్డుకట్ట వేయడానికి యాజమాన్యం ప్రత్యేక ఉత్తర్వులు జారీచేసినా ఉద్యోగుల వైఖరిలో మార్పు కనిపించడం లేదు. ఇటీవల గణాంకాలు పరిశీలిస్తే 2021 నుంచి జూలై 2026 వరకు మొత్తం 1,027 మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. వీరిలో ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య 585 కాగా, నాన్ ఎగ్జిక్యూటివ్‌లు 442 మంది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్రం రూ. 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ అందించిన తరువాత కూడా 257 మంది రాజీనామా చేయడం గమనార్హం. వీరిలో ఎగ్జిక్యూటివ్‌లు 157 మంది కాగా మిగిలిన 100 మంది నాన్ ఎగ్జిక్యూటివ్‌లు. ఇంకో మూడు, నాలుగు నెలల్లో పదవీ విరమణ చేయాల్సిన వారు సైతం యాజమాన్యం వ్యవహారాలు నచ్చక బయటకు వెళ్లిపోతున్నారు.
కొత్త రిక్రూట్‌మెంట్ లేదు..
విశాఖ ఉక్కులో సీనియర్లు, నిపుణులైన ఉద్యోగులు వందల సంఖ్యలో ఉన్నారు. ఈ ప్లాంట్‌లో ఏడేళ్లుగా పదోన్నతులు లేవు. పైస్థాయిలో పోస్టులు ఖాళీగా ఉంచుతున్నారే తప్ప వాటిని అర్హులైన సీనియర్లతో భర్తీచేయడం లేదు. కొత్త వారిని కూడా రిక్రూట్ చేసుకోవడం లేదు. ఉద్యోగుల సంఖ్య ఎక్కువ ఉందని తప్పుడు ప్రచారాలు చేస్తూ వారి సంఖ్య తగ్గించుకుంటూ పోతున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో మూడు దఫాలుగా వాలంటరీ రిటైర్‌మెంట్ పథకం (వీఆర్‌ఎస్) అమలు చేశారు. ఇలా సర్వీసు వదిలి వెళ్లిపోయిన వారిని సైతం యాజమాన్యం బకాయిలు పెట్టి వేధిస్తోంది. నిబంధనల ఉల్లంఘిస్తూ మొండిగా వ్యవహరిస్తోంది.
జీతాలూ కష్టంగానే..
ఉద్యోగులకు జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు. ఏ నెల ఎంత జీతం ఇస్తారో స్పష్టత లేదు. ప్రతి ఉద్యోగికి నాలుగు నెలల జీతాలు బకాయిలు ఉన్నాయి. అడ్డగోలు హెచ్‌ఆర్ విధానాలతో ఉద్యోగులు విసిగిపోయారు. ఉద్యోగులకు ఇచ్చే అలవెన్సులు తీసేశారు. నిధులు జమ చేసి పెన్షన్లు పొందుతున్న ఉద్యోగులకు కూడా వాటిని సరిగ్గా ఇవ్వడం లేదు. ఆర్థిక విధానాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్లాంటులో పనిచేసే వాతావరణం కూడా భరోసా కల్పించడం లేదు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోననే భయం అందరిలోనూ కనిపిస్తోంది. మంచి భవిష్యత్తు ముందుందని, భయపడవద్దని, అంతా కలసి పనిచేద్దామని యాజమాన్యం చెబుతున్నా.. దానికి తగ్గట్లు చర్యలు లేవని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. పదోన్నతులు ఇస్తామని గానీ, జీతాలు కచ్చితంగా ఇస్తామని గానీ, ఉద్యోగ సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని గానీ యాజమాన్యం ప్రకటించడం లేదు. దీంతో యాజమాన్యంపై ఉద్యోగులకు నమ్మకం లేక రాజీనామాలు చేస్తున్నారు.