ప్రకృతి... ప్రగతి..!
ABN , Publish Date - Aug 29 , 2026 | 05:33 AM
ప్రకృతి ఒడిలో రాష్ట్ర ప్రగతి సాగాలి... పర్యావరణ సమతుల్యతను సంరక్షించుకోవాలి...
గ్రామాల్లో ప్రకృతి ఆధారిత జీవనోపాధి సాకారం
ప్రారంభం కానున్న ఏపీ గ్రీన్ పరిపాలనా కార్యకలాపాలు
అమరావతి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): ప్రకృతి ఒడిలో రాష్ట్ర ప్రగతి సాగాలి... పర్యావరణ సమతుల్యతను సంరక్షించుకోవాలి... వాతావరణ మార్పుల ప్రభావం నుంచి రాష్ట్రాన్ని, భవిష్యతరాలను రక్షించాలి... గ్రామాల్లో ప్రకృతి ఆధారిత జీవనోపాధి లక్ష్యాలను సాధించాలి... ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ మంత్రి పవన్ కల్యాణ్ ఈ సమున్నత ఆకాంక్షల నుంచి రూపుదిద్దుకుందే ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్‌రిచ్‌మెంట్(ఏపీ గ్రీన్). రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటవీ ప్రాంతాన్ని కాపాడుకుంటూ, కొత్త అడవులను సృష్టించడం... 50 శాతం గ్రీన్ కవర్ కార్యక్రమాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పడింది. ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌కు అనుగుణంగా 2047 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం గ్రీన్ కవర్ సాధించే లక్ష్యంతో చేపట్టిన ఈ మహాయజ్ఞంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆ సంస్థ పరిపాలన కార్యకలాపాలు మొదలవుతున్న నేపథ్యంలో పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు.
2030 నాటికి 33శాతం పచ్చదనం లక్ష్యం
2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవులు, పచ్చదనపు విస్తీర్ణాన్ని పెంచడమే ఏపీ గ్రీన్ లక్ష్యం. ప్రస్తుత రాష్ట్ర భూభాగంలో 37.42 లక్షల హెక్టార్లలో నోటిఫైడ్ అటవీ ప్రాంతం ఉంది. ఇది రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 22.96 శాతమే. 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యాల్లో భాగంగా 2030 నాటికి 33 శాతం పచ్చదనం పెంచాలని నిర్ణయించారు. ఇందుకు సమగ్ర ప్రణాళికను పవన్ కల్యాణ్ రూపొందించారు. వచ్చే నాలుగేళ్లలో ఏడాదికి ఎన్ని హెక్టార్లలో పచ్చదనం పెంచాలన్న దానిపై కార్యాచరణ సిద్ధం చేశారు. ఆరు, మూడు నెలలు, నెల వారీ లక్ష్యాలను నిర్దేశించి, ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. పచ్చదనం క్షీణించిన భూములు, మైనింగ్ ప్రభావిత ప్రాంతాలు, బంజరు భూములు, ఇతర ఎకో సెన్సిటివ్ జోన్లలో పచ్చదనం పునరుద్ధరణకు ఏపీ గ్రీన్ ప్రాధాన్యమిస్తుంది. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా నర్సరీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయనున్నారు. చెట్ల ఆధారిత జీవనోపాధిని ప్రోత్సహించడంపై సంస్థ దృష్టి సారిస్తుంది. మొక్కల పెంపకం, మనుగడ, గ్రీన్ కవర్ పెరుగుదల వంటి విషయాలను అధునాతన, శాస్త్రీయ పద్ధతుల్లో పర్యవేక్షిస్తారు.
నిధుల సమీకరణ
ఏపీగ్రీన్ కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, నాబార్డు, సీఎస్ఆర్ నిధులు, కార్బన్ ఫైనాన్స్, కార్బన్ క్రెడిట్లు, గ్రీన్ బాండ్లు, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్, ఎకో టూరిజం వంటి వివిధ వనరుల ద్వారా నిధులను సమీకరించనున్నారు. పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఏపీ గ్రీన్ చైర్మన్, ఎమ్మెల్సీ కే నాగబాబు ఆధ్వర్యంలో నిధుల వినియోగం, పచ్చదనం పెంపొందించే అంశంలో అత్యంత పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేశారు. మిషన్ మోడ్‌లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
మూడంచెల వ్యవస్థతో ఏపీ గ్రీన్ కార్యకలాపాలు
ఏపీ గ్రీన్ కార్యకలాపాలు మూడు అంచెల్లో సాగుతాయి. రాష్ట్ర స్థాయిలో 24 మందితో పాలకమండలి ఉంటుంది. అటవీ శాఖ మంత్రిగా పవన్ కల్యాణ్ చైర్మన్‌గా, ఏపీ గ్రీన్ చైర్మన్ నాగబాబు వైస్ చైర్మన్‌గా ఉంటారు. అటవీ, పర్యావరణ, శాస్త్రసాంకేతిక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక, వ్యవసాయ, గిరిజన సంక్షేమ, విద్య, పరిశ్రమల, రెవిన్యూ, జలవనరుల, రోడ్లు-భవనాల శాఖల ప్రధాన కార్యదర్శులు, పీసీసీఎఫ్ డైరెక్టర్లుగా ఉంటారు. వీరితో పాటు ఏపీ గ్రీన్ సీఈవో, నాబార్డు సీజీఎం, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్, కార్పొరేట్ రంగానికి చెందిన ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజానికి చెందిన ప్రతినిధులు దీనిలో ఉంటారు. ఈ పాలకవర్గం ఏటా రెండుసార్లు సమావేశమై కార్యకలాపాలను సమీక్షిస్తుంది. రెండో అంచెలో ఎగ్జిక్యూటివ్ కమిటీకి కేబినెట్ హోదా కలిగిన ఏపీ గ్రీన్ చైర్మన్ అధ్యక్షత వహిస్తారు. కమిషనర్‌గా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తారు. ప్రతి మూడు నెలలకోసారి కమిటీ సమావేశమౌతుంది. మూడో అంచెలో జిల్లా స్థాయి గ్రీన్ డెవల్‌పమెంట్ అథారిటీకి జేసీ అధ్యక్షత వహిస్తారు. జిల్లా స్థాయిలో వివిధ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు.
ఈ వార్తలనూ చదవండి:
టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..
కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు