Share News

సుప్రీం కోర్టులో తేల్చుకుందాం!

ABN , Publish Date - Oct 02 , 2026 | 04:27 AM

బీసీలకు 34శాతం రిజర్వేషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వెంటనే సుప్రీం కోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే చంద్రబాబు, అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌తోపాటు న్యాయనిపుణులతో మాట్లాడారు.

సుప్రీం కోర్టులో తేల్చుకుందాం!

  • బీసీలకు 34 శాతం కూటమి ఎన్నికల హామీ

  • సోమవారంలోగా పిటిషన్‌ దాఖలు చేయాలి

  • అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

  • వెనుకబడిన కులాలపై వైసీపీ కత్తి కట్టింది

  • కేసులు వేయిస్తోంది: టీడీపీ నేతలు

అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): బీసీలకు 34శాతం రిజర్వేషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వెంటనే సుప్రీం కోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే చంద్రబాబు, అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌తోపాటు న్యాయనిపుణులతో మాట్లాడారు. ‘బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. అన్ని అవరోధాలను అధిగమించి దాన్ని సాకారం చేయాలి. సోమవారంలోగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయాలి’ అని విస్పష్టంగా ఆదేశించారు. వాదనలు వినిపించేందుకు సీనియర్‌ న్యాయవాదులను నియమించాలన్నారు. ‘స్థానిక సంస్థల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. కూటమి మ్యానిఫెస్టోలో ఈ హామీ ఇచ్చాం. దీనిపై పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా తుదివరకూ పోరాడుతాం’ అని స్పష్టం చేశారు. ఈలోగా బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలను కోరారు.

నాడు బీసీ కోటాకు కోత పెట్టిన వైసీపీ

వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు రాజకీయ అధికారాన్ని దూరం చేసే పనిపై దృష్టి పెట్టిందని తెలుగుదేశం ఆరోపిస్తోంది. ‘అప్పటి వరకు 34శాతం ఉన్న బీసీ కోటాను 24శాతానికి తగ్గించేసింది. దీంతో 16 వేల మంది బీసీలు రాజకీయ అధికారానికి దూరమయ్యారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ లభిస్తే, వేల సంఖ్యలో బీసీ నాయకులు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కౌన్సిలర్లుగా, మున్సిపల్‌ చైర్మన్లుగా ప్రజాస్వామ్యంలో కీలక స్థానాల్లోకి వస్తారు. అదే జరిగితే కూటమి ప్రభుత్వానికి బీసీల్లో పేరు వస్తుంది. ఆ అసూయతోనే వైసీపీ ఇటువంటి పిటిషన్లతో రిజర్వేషన్ల ప్రక్రియను చిక్కుముళ్లలో పడేస్తోంది’ అని టీడీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


బీసీలను అణగదొక్కడమే జగన్‌ లక్ష్యం: మంత్రి కొలుసు

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పించడమే కూటమి ధ్యేయమని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ‘బీసీలను అణగదొక్కడమే లక్ష్యంగా జగన్‌ పనిచేస్తున్నారు. నా బీసీలు అంటూనే తన పాలనలో బీసీలను ఊచకోత కోశాడు. బీసీలపై జగన్‌ది కపట ప్రేమ. బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు నడిపించిన ఘనత టీడీపీదే’ అని కొలుసు పేర్కొన్నారు.

అవసరమైతే పార్టీ తరఫున ఇస్తాం: అచ్చెన్నాయుడు

బీసీల రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేయడం బాధాకరమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ తీర్పుతో బీసీల రాజకీయ హక్కు కోసం చేస్తున్న పోరాటం ఆగిపోదని, చివరి వరకూ పోరాడుతామని స్పష్టం చేశారు. బీసీలు ఎదగకూడదనే జగన్‌ ప్యూడల్‌ మనస్తత్వానికి కోర్టులో ఆయన వేయిస్తున్న పిటిషన్లే నిదర్శనమన్నారు.

బీసీలు పాలసీమేకర్లు కావాలి: చింతకాయల విజయ్‌

బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌లను బెస్ట్‌ క్లాస్‌గా నిలబెట్టాలనే ఆలోచన టీడీపీ డీఎన్‌ఏలోనే ఉందని ఎంపీ చింతకాయల విజయ్‌ అన్నారు. బీసీలు కేవలం ఓటర్లుగానే మిగిలిపోకూడదని, పాలసీ మేకింగ్‌లో కీలక భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు వారికి 34 శాతం రిజర్వేషను కల్పించాలని నిర్ణయించారని వివరించారు.


బీసీలపై అదే కక్ష..!

బీసీలకు రాజకీయ అధికారం దక్కకుండా వైసీపీ కుట్రలు చేస్తోందని టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అందులో భాగంగా సొంత మనుషులతో కోర్టుల్లో కేసులు వేయిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక, బీసీ డిక్లరేషన్‌ హామీకి కట్టుబడి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తూ రెండు జీవోలు ఇచ్చింది. వీటిని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటి వెనుక ఉన్న వ్యక్తుల రాజకీయ నేపథ్యాలు చర్చనీయాంశంగా మారాయి. రిట్‌ పిటిషన్‌(పిల్‌) నంబరు 201/2026లో పిటిషనర్‌ తరఫున న్యాయవాది గుండాల శివప్రసాద్‌ రెడ్డి వాదిస్తున్నారు. ఈయన వైసీపీ హయాంలో ఏజీపీగా ఉన్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ అధినాయకత్వంతోనూ, ముఖ్యనేతలతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. పిటిషన్లు వేసి బీసీల రిజర్వేషన్లకు అడ్డంకులు సృష్టించడం వెనుక వైసీపీ హస్తం ఉందనే అనుమానాలకు ఈ ఆధారాలు బలాన్ని చేకూరుస్తున్నాయని చెబుతున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు

ప్రభుత్వ భూములకు స్కెచ్‌

Updated Date - Oct 02 , 2026 | 04:27 AM