ఇంటర్న్‌లకు 10.. పీజీలకు 5 శాతం
ABN , Publish Date - Sep 22 , 2026 | 03:40 AM
రాష్ట్రంలోని జూనియర్ వైద్యుల స్టైపెండ్ పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇంటర్న్‌లకు 10 శాతం, పీజీ విద్యార్థులు, సూపర్ స్పెషాలిటీ వైద్యులు, ఎండీఎస్, డీఎన్‌బీ విద్యార్థుల స్టైఫండ్‌ను 5 శాతం మేరకు పెంచింది.
జూ. వైద్యులకు స్టైపెండ్ పెంపు
ఈ ఏడాది జనవరి నుంచి అమలు
ఏటా 3.5 శాతం పెంపునకు ఆమోదం
వ్యతిరేకిస్తున్న జూడాలు
మరోసారి చర్చలకు డిమాండ్ చేసిన అసోసియేషన్
అమరావతి/గుంటూరు మెడికల్/విజయవాడ, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని జూనియర్ వైద్యుల స్టైపెండ్ పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇంటర్న్‌లకు 10 శాతం, పీజీ విద్యార్థులు, సూపర్ స్పెషాలిటీ వైద్యులు, ఎండీఎస్, డీఎన్‌బీ విద్యార్థుల స్టైఫండ్‌ను 5 శాతం మేరకు పెంచింది. పెంచిన స్టైపెండ్ ఈ ఏడాది జనవరి ఒకటవ తేదీ నుంచి అమలుల్లోకి రానుంది. అయితే.. ఇకపై ఏటా(వచ్చే జనవరి నుంచి) 3.5 శాతం మేరకు స్టైపెండ్ మాత్రమే పెంచుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ సెక్రటరీ వీరపాండియన్ సోమవారం ఉత్తర్వులు(జీఓ 141) జారీ చేశారు. ఆర్థిక శాఖ ఆమోదం మేరకు స్టైపెండ్ పెంపును నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ పెంపుతో ప్రభుత్వం ఏటా రూ.34.08 కోట్ల అదనపు నిధులు కేటాయించాల్సి వస్తుందన్నారు. బోధనాసుపత్రుల్లోని ఇంటర్న్‌లకు ప్రస్తుతం స్టైపెండ్ రూపంలో రూ.25,906 అందుతోంది. వీరికి 10 శాతం పెంచడం వల్ల వారికి నెలకు రూ.28,497 వస్తుంది. పీజీ విద్యార్థులు, సూపర్ స్పెషాలిటీ వైద్యులు, ఎండీఎస్, డీఎన్‌బీ విద్యార్థులకు ప్రస్తుతం అందిస్తున్న స్టైపెండ్‌ను 5 శాతం పెంచి ఇవ్వనున్నారు. మరోవైపు ప్రభుత్వం జూనియర్ వైద్యుల సమ్మెలు ఇతర సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఇకపై ఏటా జనవరి నెలలోనే 3.5 శాతం స్టైపెండ్ పెంచేందుకు ఆంగీకరించింది. భవిష్యత్తులో 3.5 శాతం మించకుండా ఇచ్చేందుకు ఆంగీకరిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. సవరించిన స్టైపెండ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)ను ప్రభుత్వం ఆదేశించింది.
ఇది ఏకపక్షం: అసోసియేషన్
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్టైపెండ్‌పై జూనియర్ వైద్యులు అసమ్మతి ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన పెంపును తాము ఆంగీకరించడం లేదని జూనియర్ వైద్యుల అసోసియేషన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. స్టైపెండ్ పర్సంటేజ్, షరతులపై అంగీకారం కుదరకముందే ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని, జీవో జారీ చేసిందని అసోసియేషన్ ఆరోపించింది. జూనియర్ వైద్యుల అసోసియేషన్‌లో సీనియర్ రెసిడెంట్లు కూడా భాగమేనని స్పష్టం చేసింది. సీనియర్ రెసిడెంట్ల సమస్యలను కూడా తమ ప్రదాన డిమాండ్లలో పేర్కొన్నామని అసోసియేషన్ నేతలు తెలిపారు.
సీనియర్ రెసిడెంట్ల పని గంటలు, ప్రాథమిక సదుపాయాలకు సంబంధించిన డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. తాజాగా జారీ చేసిన స్టైపెండ్ పెంపు జీవోలో సీనియర్ రెసిడెట్ల ప్రస్తావన ఎక్కడా లేదని, వారి సమస్యలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. సానుకూల చర్చలు, ప్రజాస్వామ్య పద్ధతిలో పరస్పర అంగీకారంతో కూడిన పరిష్కారానికే అసోసియేషన్ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై మరోసారి సమీక్షించాలని, ఏపీ జూడా ప్రతినిధులతో మరోసారి చర్చలు జరిపి, పరస్పర అంగీకారంతో స్టైపెండ్‌ను సవరించాలని కోరారు.
హేతుబద్ధంగా లేదు
జూనియర్ డాక్టర్ల ఉపకార వేతనం పెంపు హేతుబద్ధంగా లేదని, తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని తాము అంగీకరించబోమని ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఈశ్వర్ శంకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో సీనియర్ రెసిడెంట్ల స్టైఫండ్ సవరణను చేర్చలేదని ఆరోపించారు. సీనియర్ రెసిడెంట్ల సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మరోసారి చర్చలు జరపాలని కోరారు.
ఈ వార్తలనూ చదవండి....
‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’
ఆర్‌వీ నగర్ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక