త్వరలో రాయితీపై కందిపప్పు, పామాయిల్
ABN , Publish Date - Oct 01 , 2026 | 03:49 AM
బహిరంగ మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు, పామాయిల్‌తోపాటు.. పంచదార, గోధుమపిండిని రాయితీ ధరకు సరఫరా చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
రేషన్ దుకాణాల ద్వారా పంచదార, గోధుమపిండి కూడా..
మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి
బెజవాడలో రాయితీ ఉల్లి కౌంటర్ ప్రారంభం
అమరావతి, విజయవాడ(భారతీనగర్), సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): బహిరంగ మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు, పామాయిల్‌తోపాటు.. పంచదార, గోధుమపిండిని రాయితీ ధరకు సరఫరా చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటికే 1.20 లక్షల టన్నుల కందిపప్పును రాష్ట్రానికి అందించేందుకు కేంద్రం అంగీకరించిందని చెప్పారు. విజయవాడ ఏపీఐఐసీ కాలనీలోని రైతుబజార్‌లో బుధవారం కేజీ ఉల్లిపాయలు రూ.35కు విక్రయించే కౌంటర్లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ఆధారంగా 2కిలోల ఉల్లిపాయలు అందిస్తారని వివరించారు. రాబోయే రోజుల్లో మొబైల్ కౌంటర్లు, మినిలారీల ద్వారా నేరుగా ప్రజల వద్దకే ఉల్లిపాయలు తక్కువ ధరకు విక్రయిస్తామని తెలిపారు.
బియ్యానికి కొరత లేదు
రాష్ట్రంలో బియ్యానికి కొరతలేదని, సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని మంత్రి మనోహర్ ప్రజలను కోరారు. ఎల్‌నినో వల్ల ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఖరీఫ్ సీజన్‌లో 37 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రజా పంపిణీ అవసరాల కోసం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఎల్‌నినో కారణంతో ఆహార ధాన్యాలు, నిత్యావసర సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలించేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
ఈ వార్తలనూ చదవండి...
ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’