బియ్యం ధరలకు కళ్లెం
ABN , Publish Date - Nov 21 , 2026 | 05:10 AM
బహిరంగ మార్కెట్‌లో విపరీతంగా పెరిగిపోతున్న బియ్యం ధరలకు కళ్లెం వేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
వివిధ రకాలపై పరిమితులు విధింపు
బీపీటీ, కేఎన్‌ఎంలు కేజీ రూ.66కి విక్రయం
హెచ్‌ఎంటీ, ఆర్‌ఎన్‌ఆర్‌లు రూ.76 చొప్పున
ఎంటీయూ సాధారణ రకాలు కేజీ రూ.47కే
జైశ్రీరామ్ రకం ధర కేజీ రూ.82గా నిర్ణయం
బియ్యం, ధాన్యం నిల్వలపై కొత్తగా నియంత్రణ
ధరల పెరుగుదల నేపథ్యంలో కీలక ఉత్తర్వులు
అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): బహిరంగ మార్కెట్‌లో విపరీతంగా పెరిగిపోతున్న బియ్యం ధరలకు కళ్లెం వేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు భారీ ఊరట కల్పిస్తూ బియ్యం ధరలపై గరిష్ఠ పరిమితులు విధించింది. రకాల వారీగా వాటి గరిష్ఠ రిటైల్ విక్రయ ధరలను నిర్ణయించింది. ఇకపై బీపీటీ-3291 (సోనా), బీపీటీ-5204 (సాంబా), కేఎన్‌ఎం రకాల బియ్యం కిలో రూ.66కే లభించనున్నాయి. హెచ్‌ఎంటీ, ఆర్‌ఎన్‌ఆర్ రకాలు కేజీ రూ.76, ఎంటీయూ సాధారణ రకాలు కేజీ రూ.47కేవిక్రయించనున్నారు.
జై శ్రీరామ్ రకం కిలో రూ.82గా నిర్ణయించింది. ఈ గరిష్ఠ ధరలకు మించి మార్కెట్‌లో బియ్యం విక్రయించకూడదని స్పష్టం చేసింది. రైతుల నుంచి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కంటే తక్కువకు ధాన్యాన్ని కొనుగోలు చేయకూడదని ఆదేశించింది. రాష్ట్రంలో ధాన్యం, బియ్యం వ్యాపారంపై పర్యవేక్షణను కట్టుదిట్టం చేసింది. అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత, అధిక ధరలకు విక్రయాలతో దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు బియ్యం, ధాన్యం నిల్వలపై సరికొత్త నియంత్రణలు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. వచ్చే జనవరి 31 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వ్యాపారులకు తప్పనిసరి రిజిస్ట్రేషన్
తాజా ఉత్తర్వుల ప్రకారం... రైస్ మిల్లర్లు, ప్రాసెసర్లు, హోల్‌సేల్ వ్యాపారులు, ట్రేడర్లు, రిటైలర్లు, బిగ్ చైన్ రిటైలర్లు తమ వ్యాపారాలకు సంబంధించి జిల్లా పౌరసరఫరాల అధికారుల వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇప్పటికే వ్యాపారాలు నిర్వహిస్తున్న సంస్థలు ఉత్తర్వులు అమల్లోకి వచ్చిన ఏడు రోజుల్లోగా నమోదు ప్రక్రియను పూర్తిచేయాలి. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అయితే 10 క్వింటాళ్లకు మించని బియ్యం లేదా ధాన్యం నిల్వలు, రెండూ కలిపి 25 క్వింటాళ్లకు మించని నిల్వలు ఉన్న చిన్న వ్యాపారులను ఈ నిబంధన నుంచి మినహాయించారు.
ప్రతి వ్యాపారి తన వద్ద ఉన్న ధాన్యం, బియ్యం నిల్వల వివరాలను కేంద్ర ప్రభుత్వ ఫుడ్ స్టాక్ పోర్టల్‌లో ఏడు రోజుల్లోగా నమోదు చేయాలి. బాస్మతి, నాన్ బాస్మతి ప్రీమియం రైస్, సాధారణ రకం బియ్యం, ఉప్పుడు బియ్యం, నూకలు, ధాన్యం.. ఇలా ఆరు రకాలుగా వివరాలు నమోదు చేయాలి. ప్రతి శుక్రవారం స్టాక్ వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి. తప్పుడు సమాచారం ఇచ్చినా, నిల్వలను దాచిపెట్టినా ప్రభుత్వ ఉత్తర్వుల ఉల్లంఘనలుగా పరిగణించి చర్యలు తీసుకుంటారు.
బియ్యం నిల్వలపై పరిమితులు ఇలా..
నాన్ బాస్మతి ప్రీమియం బియ్యం నిల్వలపై ప్రభుత్వం గరిష్ఠ పరిమితులు విధించింది.
ట్రేడింగ్ బిల్లులకు 4 వేల క్వింటాళ్లు లేదా ఏడు రోజుల మిల్లింగ్ సామర్థ్యంలో ఏది ఎక్కువైతే అంత.
కార్పొరేషన్లకు సరఫరా చేసే హోల్‌సేల్ వ్యాపారులకు 1,000 క్వింటాళ్లు
జిల్లా ప్రధాన కార్యాలయాల్లోని ఇతర హోల్‌సేల్ వ్యాపారులకు 500 క్వింటాళ్లు, ఇతర ప్రాంతాల్లోని హోల్‌సేల్ వ్యాపారులకు 250 క్వింటాళ్లు
పట్టణ ప్రాంత రిటైల్ వ్యాపారులకు 100 క్వింటాళ్లు, గ్రామీణ ప్రాంత రిటైలర్లకు 50 క్వింటాళ్లు. ఈ పరిమితులు ఆయా వ్యాపార సంస్థల గోడౌన్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యాపార ప్రాంతాల్లోని మొత్తం నిల్వలకు కూడా వర్తిస్తాయి.
తనిఖీలు.. అక్రమ నిల్వలు సీజ్
ధాన్యం, బియ్యం నిల్వలకు సంబంధించి వ్యాపారులు ప్రతిరోజూ రిజిస్టర్ నిర్వహించాలి. వ్యాపార ప్రాంగణంలో వినియోగదారులకు కనిపించేలా ధరల పట్టికను ప్రదర్శించాలి. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించినట్లు భావిస్తే రెవెన్యూ, పౌరసరఫరాలు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆయా వ్యాపార సంస్థలు, గోడౌన్లు, వాహనాలను తనిఖీ చేస్తారు.
అవసరమైతే రికార్డులను పరిశీలిస్తారు. అక్రమ నిల్వలను గుర్తిస్తే వాటిని స్వాధీనం చేసుకునే అధికారాలను ప్రభుత్వం వారికి కల్పించింది. తనిఖీల సమయంలో లెక్కల్లో పొరపాట్లు, రికార్డుల నమోదులో చిన్నపాటి లోపాలు, నిల్వల్లో తేడాలు వచ్చిన సందర్భాల్లో ప్రభుత్వం చిన్న వ్యాపారులకు కొన్ని మినహాయింపులు కల్పించింది. రిటైలర్లకు వార్షిక టర్నోవర్ రూ.2లక్షల లోపు ఉంటే సాధారణ తనిఖీల నుంచి మినహాయింపునిచ్చారు. కొన్ని ఉల్లంఘనలకు రూ.50వేల వరకు జరిమానా విధించే అధికారాన్ని అధికారులకు ప్రభుత్వం కల్పించింది.
ఈ వార్తలనూ చదవండి:
పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి
తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి