Share News

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత

ABN , Publish Date - Oct 31 , 2026 | 01:34 AM

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత

  • ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాలి

  • ఫిర్యాదులపై తక్షణ స్పందన, నిష్పక్షపాత విచారణ

  • రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా

అమరావతి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పూర్తి పారదర్శకతతో నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల పరిశీలకులు, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా ఆదేశించారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి శుక్రవారం సీడీఎంఏ సంపత్‌కుమార్‌, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల పరిశీలకులు, పోలీసు కమిషనర్లు, డీఐజీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఎన్నికల నిర్వహణ, శాంతిభద్రతలు, రాజకీయ పార్టీల నుంచి అందుతున్న ఫిర్యాదులు, తదుపరి విడత ఎన్నికల సన్నద్ధత, పోలింగ్‌, కౌంటింగ్‌ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా పునేఠా మాట్లాడుతూ, ఎలాంటి నిర్లక్ష్యం, పక్షపాత ధోరణి లేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పించాలని సూచించారు. ఎన్నికల ప్రారంభదశలో ఏడు జిల్లాల్లో పలు ఫిర్యాదులు అందాయని కమిషనర్‌ తెలిపారు. ప్రతి ఫిర్యాదును డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు పంపించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్‌ స్టేషన్‌ నంబర్‌, ఓటర్ల సంఖ్య, భద్రతా ఏర్పాట్లు తదితర వివరాలతో ప్రతి పోలింగ్‌ కేంద్రానికి సంబంధించి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు.


ఒక్క బ్యాలెట్‌ పేపర్‌ కూడా గల్లంతు కాకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. స్ట్రాంగ్‌రూమ్‌లకు సుమారు 100 మీటర్ల దూరంలో ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రిసైడింగ్‌ అధికారి అనుమతి లేకుండా ఎవరూ పోలింగ్‌ కేంద్రాల్లో ప్రవేశించరాదని, మీడియా ప్రతినిధులు ఓటింగ్‌ గోప్యతకు భంగం కలిగించకూడదని సూచించారు. ఐజీ బి.రాజకుమారి మాట్లాడుతూ, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు సాంకేతికతతో ప్రతి కదలికను రికార్డు చేయాలని ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రం లోపలకి పోలీసు సిబ్బంది తమంతట తాము ప్రవేశించకూడదని, ప్రిసైడింగ్‌ అధికారి అనుమతి మేరకే వెళ్లాలని స్పష్టం చేశారు. పోలింగ్‌ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో, 100 మీటర్ల పరిధిలో గుంపులు ఏర్పడకుండా చూడాలని ఆదేశించారు.

ఈ వార్తలనూ చదవండి:

శబరిమలై రైళ్లు ఫుల్‌

ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?

Updated Date - Oct 31 , 2026 | 01:34 AM