Share News

513 మండలాల్లో కరువు ఛాయలు

ABN , Publish Date - Sep 20 , 2026 | 03:39 AM

ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి, అక్టోబరు 1న కరువు మండలాలను ప్రకటించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కరువు మండలాలను గుర్తించడంతో పాటు ఎక్కడా పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

513 మండలాల్లో కరువు ఛాయలు

  • 1న కరువు మండలాల ప్రకటన

  • శాస్త్రీయంగా వర్షాభావ పరిస్థితుల అంచనా

  • పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు

  • ఉద్యాన పంటల రక్షణకు రూ.190 కోట్లు

  • మైక్రో ఇరిగేషన్‌, ప్రకృతి సాగుకు ప్రాధాన్యం

  • తాగునీటి ఎద్దడి తలెత్తకుండా కార్యాచరణ

  • ఎల్‌నినో, వర్షాభావంపై సీఎం సమీక్ష

అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి, అక్టోబరు 1న కరువు మండలాలను ప్రకటించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కరువు మండలాలను గుర్తించడంతో పాటు ఎక్కడా పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై ప్రతి నెలా కేంద్రానికి నివేదికలు పంపాలని నిర్దేశించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావం, కరువు ప్రభావం, వ్యవసాయ-ఉద్యాన పంటల స్థితి, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, పంటలను కాపాడేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, తాగునీటి సరఫరాపై శనివారం ఉండవల్లి క్యాంప్‌ కార్యాలయంలో చంద్రబాబు సమీక్షించారు. కరువు మండలాల గుర్తింపు ప్రక్రియలో భాగంగా ఆరు శాఖల నుంచి అందే సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని, వర్షపాతం, పంటల పరిస్థితి, భూగర్భ జలాలు, నేలలో తేమశాతం, శాటిలైట్‌ చిత్రాలు, జలాశయాల్లో నీటి నిల్వలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు సీఎంకు అధికారులు వివరించారు.

286 మండలాల్లో తీవ్ర కరువు

2026 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ప్రాథమిక అంచనా ప్రకారం మొత్తం 513 మండలాల్లో కరువు ఛాయలున్నాయని సీఎం దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. వీటిల్లో 268 మండలాల్లో తీవ్రంగాను, 245 మండలాల్లో మోస్తరుగాను కరువు ఉందన్నారు. కరువు పరిస్థితులపై వ్యవసాయశాఖ క్షేత్రస్థాయి పరిశీలన చేస్తోందని చెప్పారు. జిల్లా కలెక్టర్ల మార్గ దర్శకత్వంలో క్షేత్రస్థాయి బృందాలు పంట నష్టం, దిగుబడి నష్టాన్ని పరిశీలించి, కలెక్టర్లకు నివేదిక ఇస్తుందని తెలిపారు. రెవెన్యూ -విపత్తుల నిర్వహణ శాఖకు కలెక్టర్లు కరువు మండలాల ప్రతిపాదనలను సమర్పిస్తారని, దీనికి ఈనెల 24 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 29న రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలించాక, కరువు మండలాలను ప్రకటించనున్నట్లు అధికారులు వివరించారు. వర్షాభావ పరిస్థితులతో పాటు ఎల్‌నినో ప్రభావాన్ని కూడా అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.


17 వేల హెక్టార్లలో పంటపై ఎల్‌నినో ప్రభావం

రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 1,357 రైతుసేవా కేంద్రాల పరిధిలోని పంటలు హైరిస్క్‌ కేటగిరిలో ఉన్నాయన్నారు. ఎల్‌నినోతో 17,916 హెక్టార్లలో నారింజ, బత్తాయి, మామిడి, ఎర్రమిర్చి, ఉల్లి, కూరగాయ పంటలు ప్రభావితం అవుతున్నాయని తెలిపారు. దీనిపై సీఎం మాట్లాడుతూ ఉద్యాన పంటలను కాపాడటానికి ఇప్పటికే రూ.190 కోట్లు కేటాయించామని, దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నీటి లభ్యత తగ్గుతున్న పరిస్థితుల్లో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణాన్ని కాపాడేందుకు మైక్రో ఇరిగేషన్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఏపీ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు కింద రైతులకు సంబంధించి నాలుగు కీలక సేవలను ‘మనమిత్ర’ వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. సూక్ష్మసేద్యంతో పాటు ప్రకృతి సేద్యం వైపు రైతుల దృష్టి మళ్లించేలా చూడాలని నిర్దేశించారు.

తాగునీటి ఎద్దడి తలెత్తనీయొద్దు: చంద్రబాబు

రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. తాగునీటికి బోర్లుపైన ఆధారపడే ప్రాంతాలకు అవసరమైతే అదనంగా ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించేలా చూడాలన్నారు. విశాఖలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలని నిర్దేశించారు. ఇంజనీర్లు- కాంట్రాక్టర్లతో అత్యవసర సమావేశం నిర్వహించి, విశాఖ తాగునీటి సరఫరా పనులను చేపట్టాలని స్పష్టంచేశారు. విశాఖ సమీపంలోని రిజర్వాయర్లను నింపేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. మేఘాద్రిగడ్డకు పోలవరం లెఫ్ట్‌ మెయిన్‌ కెనాల్‌ నుంచి ప్యాకేజీ నంబర్‌-8 కింద పైపులైన్‌ ద్వారా నీటిని తరలించే పనుల్లో వేగం పెంచాలన్నారు. విశాఖ నగరానికి మరో రెండు నెలలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.

ఈ వార్తలనూ చదవండి...

విశాఖకు గోదావరి జలాలు

కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పరిధి పెంపు

Updated Date - Sep 20 , 2026 | 03:42 AM