హింసకు పాల్పడితే ఉపేక్షించేది లేదు
ABN , Publish Date - Oct 23 , 2026 | 06:16 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసకు పాల్పడినా, నామినేషన్ల దాఖలును అడ్డుకున్నా ఉపేక్షించేది లేదని డీజీపీ హెచ్చరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా గురువారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మొత్తం 31 ఘటనలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు.
నామినేషన్ల అడ్డగింత, పత్రాల ధ్వంసంపై డీజీపీ సీరియస్
అమరావతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసకు పాల్పడినా, నామినేషన్ల దాఖలును అడ్డుకున్నా ఉపేక్షించేది లేదని డీజీపీ హెచ్చరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా గురువారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మొత్తం 31 ఘటనలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు. వీటిలో హింస, ఘర్షణలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినవి 22 కాగా.. నామినేషన్ పత్రాలను లాక్కోవడం, చించివేయడానికి సంబంధించినవి తొమ్మిది ఉన్నాయని తెలిపారు. అనంతపురంలో అత్యధికంగా 8 ఘటనలు నమోదయ్యాయి. వీటిలో 3 హింసాత్మక ఘటనలు కాగా.. 5 నామినేషన్ పత్రాల ధ్వంసానికి సంబంధించినవి. అన్నమయ్య, కడప, ప్రకాశం జిల్లాల్లో మూడేసి చొప్పున హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
తిరుపతిలో 3, చిత్తూరు, శ్రీ సత్యసాయి, పల్నాడు జిల్లాల్లో రెండేసి హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. నెల్లూరు, కర్నూలు, మార్కాపురం జిల్లాల్లో ఒక్కొక్క హింసాత్మక ఘటన నమోదైంది. నంద్యాల, ఏలూరు జిల్లాల్లో నామినేషన్ పత్రాలను చించివేసిన ఘటనలు వెలుగుచూశాయి. మొత్తం 16 సందర్భాల్లో పత్రాలను లాక్కోవడం, చించివేయడం లేదా ధ్వంసం చేయడం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 6 ఘటనల్లో రాళ్లు రువ్వడం, రాళ్లు లేదా కర్రలతో దాడులు చేయడం చోటుచేసుకున్నాయి. రెండు కార్లు, రెండు మోటార్‌సైకిళ్లు కలిపి నాలుగు వాహనాలకు నిప్పుపెట్టారు. రెండు నివాస గృహాలపై దాడులతోపాటు ధ్వంసానికి పాల్పడ్డారు. వీటిలో ఒక ఇంటిని ఎర్త్‌మూవర్‌తో కూల్చివేసిన ఘటన కూడా ఉంది. మరోచోట గాలిలోకి కాల్పులు జరిపారు.
అభ్యర్థులను నామినేషన్ కేంద్రానికి తీసుకెళుతున్న పోలీసు వాహనంపై రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైంది. పోటీలో ఉన్న ఓ అభ్యర్థితో సహా ఇద్దరు వ్యక్తులు విషమ పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం అందింది. ఆయా ఘటనలకు సంబంధించి 16కేసులు నమోదు చేసినట్లు డీజీపీ కార్యాలయం వెల్లడించింది. మరో 11 ఘటనలకు సంబంధించి కేసుల నమోదు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. ఇప్పటివరకు 54 మందిని నిందితులుగా గుర్తించారు. ఇంకా నిందితులను గుర్తించేందుకు వీడియోలు, సీసీటీవీ దృశ్యాలు, ఫొటోలను పరిశీలిస్తున్నారు.
అన్ని పార్టీల వారిపైనా చర్యలు
టీడీపీ, వైసీపీ, సీపీఐ(ఎం) అభ్యర్థులతోపాటు ఓ స్వతంత్ర అభ్యర్థి కూడా దాడులు లేదా అడ్డంకులను ఎదుర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలనే తేడా లేకుండా నేరాలకు పాల్పడిన వారందరిపైనా ఒకే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులపై దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది. బీఎన్ఎస్ సెక్షన్ 132తోపాటు వర్తించే ఇతర నిబంధనల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. పెండింగ్‌లో ఉన్న ఘటనల్లో కేసుల నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని, నిందితులను అరెస్టు చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది.
సున్నితమైన నామినేషన్ కేంద్రాలు, గ్రామాల్లో అదనపు బలగాలను మోహరించాలని సూచించింది. అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది, ప్రజలు ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. బెదిరింపులు, అడ్డంకులు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటే ప్రజలు 100 లేదా 112కు ఫోన్ చేయాలని, లేదంటే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించింది.
ఈ వార్తలనూ చదవండి: