తుఫాన్లలో మీ సేవలు భేష్!
ABN , Publish Date - Nov 10 , 2026 | 06:07 AM
తుఫాన్లు, భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలను రక్షించిన ఏపీఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ప్రశంసించారు.
ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందికి డీజీపీ ప్రశంసలు
328 మందికి రివార్డులు అందజేత
అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): తుఫాన్లు, భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలను రక్షించిన ఏపీఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ప్రశంసించారు. అర్నబ్, మురసు తుఫాన్ల సమయంలో అత్యుత్తమ సేవలు అందించిన 328 మంది అధికారులు, సిబ్బందికి మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన రివార్డులు అందజేశారు.
తీవ్ర గాలులు, భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదంలో చిక్కుకున్న ప్రజల వద్దకు చేరుకుని ప్రాణాలు కాపాడటం అభినందనీయమని కొనియాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సహాయక పరికరాల వినియోగంలో నైపుణ్యం పెంచుకోవాలని, జాతీయ స్థాయిలో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని నిర్దేశించారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఇతర రాష్ర్టాల విపత్తు ప్రతిస్పందన బృందాలతో కలిసి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ప్రతి సహాయక చర్యను ఒక అనుభవంగా తీసుకుని ఎదురైన సవాళ్లు, అనుసరించిన విధానాలు, నేర్చుకున్న పాఠాలను కేస్ స్టడీలుగా రూపొందించాలని నిర్దేశించారు. ఇందుకోసం ఏపీఎస్‌డీఆర్‌ఎఫ్‌కు ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేసి శిక్షణ వివరాలు, విజయవంతమైన ఆపరేషన్ల అనుభవాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో ఐజీ ఆపరేషన్స్ సీహెచ్.శ్రీకాంత్, ఏపీఎస్పీ బెటాలియన్ల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి: