బలంగా ఉన్న చోటే పోటీ
ABN , Publish Date - Sep 23 , 2026 | 04:08 AM
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సిద్ధంగా ఉండాలని, పోటీచేసిన ప్రతిచోటా(100 శాతం స్ట్రయిక్ రేట్) విజయం సాధించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు.
ఈ సారీ 100 శాతం స్ట్రయిక్ రేట్
మనల్ని పదవుల్లో కూర్చోబెట్టింది జనసైనికులు.. వారికి సీట్లివ్వండి
వైసీపీ ప్రలోభాలకు లొంగొద్దు..
ఫ్రెండ్లీ పోటీ ఉంటే పోటీ చేయండి..
స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన రాష్ట్రస్థాయి సన్నాహక భేటీలో పవన్
కాకినాడ, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సిద్ధంగా ఉండాలని, పోటీచేసిన ప్రతిచోటా(100 శాతం స్ట్రయిక్ రేట్) విజయం సాధించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు. కూటమికి చెడ్డపేరు తెచ్చేలా పార్టీ నేతలెవరూ వ్యవహరించవద్దని స్పష్టం చేశారు. బలం ఉన్న స్థానాల్లోనే పోటీ చేయాలని, వైసీపీ ప్రలోభాలకు లొంగి బలం లేనిచోట కూడా పోటీకి ప్రయత్నాలు చేయవద్దని దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికలపై జనసేన రాష్ట్రస్థాయి సన్నాహక సమావేశం కాకినాడలోని గోదావరి కళాక్షేత్రంలో మంగళవారం జరిగింది. జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు. ‘‘స్థానిక సంస్థల్లో.. ఏయే స్థానాల్లో పార్టీ బలంగా ఉంది?. ఎక్కడెక్కడ పోటీచేస్తే బాగుంటుందో అధ్యయనానికి నియమించిన కమిటీలతో నేతలు కలిసి ఉండి తగిన నిర్ణయం తీసుకోవాలి. ఎక్కడైనా కూటమి పార్టీలకు చెందిన నేతలతో ఫ్రెండ్లీ పోటీ ఉంటుందని భావించిన చోట పోటీ చేస్తే చేయవచ్చు.’’ అని పేర్కొన్నారు.
కష్టపడ్డ కార్యకర్తలకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలన్నారు. కొంతమంది నేతలు తాను నియోజకవర్గాలకు వచ్చినప్పుడే హడావుడి చేస్తున్నారని, ఆ తర్వాత పార్టీని అసలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ‘‘నాతో ఎంతో అనుబంధం ఉన్న జనసైనికులను తెచ్చి నా ముందే షో చేస్తే ఎలా?’’ అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది నేతలు కార్యకర్తల కృషిని మర్చిపోయేలా వ్యవహరిస్తున్నారని, ఇది సరికాదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి, నాదెండ్ల మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలను జనసేన శ్రేణులు మరో విధంగా అర్థం చేసుకున్నాయని, తన ఉద్దేశం అది కాదన్నారు. పార్టీ బలంగా ఉన్నచోట పోటీ చేయాలనేదే తన ఉద్దేశమని వివరణ ఇచ్చారు.
ఈ వార్తలనూ చదవండి...
పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..
సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం