Share News

పంట నష్టాలపై నివేదికలివ్వండి

ABN , Publish Date - Sep 26 , 2026 | 03:42 AM

తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల జరిగిన పంటల నష్టాన్ని తక్షణమే ఎన్యూమరేషన్‌ నిర్వహించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంట నష్టంతో పాటు దెబ్బతిన్న రోడ్లు....

పంట నష్టాలపై నివేదికలివ్వండి

  • వర్ష ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం

  • సమన్వయంతో పని చేయాలి: అచ్చెన్న

అమరావతి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల జరిగిన పంటల నష్టాన్ని తక్షణమే ఎన్యూమరేషన్‌ నిర్వహించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంట నష్టంతో పాటు దెబ్బతిన్న రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల నష్టాలను సేకరించాలన్నారు. అత్యవసర పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని స్పష్టం చేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని సూచించారు. శుక్రవారం వ్యవసాయ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులు రాజశేఖర్‌, మనజీర్‌జిలానీ, శ్రీనివాసులు, రాంశంకర్‌ నాయక్‌, అమరేంద్రకుమార్‌ తదితరులతో మంత్రి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మన్యం, కోనసీమ, శ్రీకాకుళం కలెక్టర్లతో ఆయా జిల్లాల్లో పరిస్థితులపై మంత్రి ఆరా తీశారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు, ఆక్వా, పశుసంపద నష్టాలపై క్షేత్రస్థాయిలో తక్షణమే సర్వే చేపట్టి, వాస్తవ నివేదికలను అందించాలని సూచించారు. ముంపునకు గురైన పొలాలు సందర్శించి రైతులకు తగిన సాంకేతిక సలహాలు ఇవ్వాలన్నారు.


పంటల సాగుకు ప్రణాళిక

వినియోగ అవసరాలు, పంటల ఉత్పత్తి, రైతులకు కనీస మద్దతు ధర, వాతావరణ అనుకూలత, మార్కెట్‌ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని జిల్లాల వారీగా సమతుల్య పంటల ప్రణాళికను రూపొందించినట్లు అచ్చెన్నాయుడు చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరల స్థిరీకరణ, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర, రబీ పంటల ప్రణాళికపై మంత్రుల కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు మార్కెట్‌ జోక్యం ద్వారా ఉత్పత్తుల కొనుగోలుకు రూ2,216.48 కోట్లు అవసరమౌతాయని అంచనా వేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 8.81 లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు కార్యాచరణ సిద్ధం చేశామని చెప్పారు.

ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 1.98 లక్షల హెక్టార్లు, కడప, పల్నాడు జిల్లాల్లో 82 వేల హెక్టార్లు, నెల్లూరు జిల్లాలో 78 వేల హెక్టార్లలో ఎంపిక చేసిన పంటలను సాగు చేసేలా రైతుల్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. ముందుగా నమోదు చేసుకున్న రైతుల నుంచి రాగులు, కందులు, మినుములను కనీస మద్దతు ధరకు 100 శాతం కొనుగోలు చేస్తామని ప్రకటించారు. పచ్చిరొట్ట పంటల విత్తనాలను కూడా కొనుగోలు చేస్తామని చెప్పారు. పెసలు, శనగలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు ఉత్పత్తిలో 30శాతం కనీస మద్దతు ధరకు కొనుగోలుకు చర్యలు తీసుకుంటామన్నారు. మొక్కజొన్నకు మద్దతు కల్పిస్తామని చెప్పారు. జొన్నలు, రాగులను రేషన్‌షాపుల్లో సరఫరా చేసేందుకు మద్దతు ధరకు కొనుగోలు చేసే అంశంపై కేంద్రంతో చర్చిస్తామన్నారు. ఉల్లిని ధరల స్థిరీకరణ నిధితో కొనుగోలు చేసి మార్కెట్లలో విక్రయిస్తామన్నారు. రాష్ట్రంలో అదనపు, అనధికార ఎఫ్‌సీవీ పొగాకు విక్రయాలకు కేంద్రం అనుమతించిందని మంత్రి తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి..

ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్

హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

Updated Date - Sep 26 , 2026 | 03:42 AM