ఫీజు కడితేనే అప్పటిదాకా సర్టిఫికెట్లు ఇచ్చేది లేదు!
ABN , Publish Date - Jun 04 , 2026 | 04:32 AM
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు భారీగా పెరిగిపోయాయి. జగన్ హయాంలో చివరి ఏడాది 2023-24 విద్యా సంవత్సరంలో మూడు క్వార్టర్ల ఫీజులు సుమారు రూ.2000 కోట్లు పెండింగ్ ఉన్నాయి.
విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్న కాలేజీలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు 4 వేల కోట్లపైనే
2025-26లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకే ఫీజులు విడుదల
మిగిలిన విద్యార్థులకు సర్టిఫికెట్లు నిలిపివేస్తున్న కాలేజీలు
ఫీజులు చెల్లించి తీసుకోవాలని స్పష్టంచేస్తున్న వైనం
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీటెక్ విద్యార్థులు
ఉన్నత విద్య, ఉద్యోగ అవసరాల కోసం నానాపాట్లు
ఫైనలియర్ విద్యార్థుల ఫీజులైనా ఇవ్వాలనే డిమాండ్లు
విద్యార్థులకు మళ్లీ సర్టిఫికెట్ల కష్టాలు మొదలయ్యాయి. 2025-26 విద్యా సంవత్సరం ముగిసిన నేపథ్యంలో సర్టిఫికెట్ల కోసం వెళ్తున్న విద్యార్థులకు యాజమాన్యాలు మొండిచేయి చూపిస్తున్నాయి. ప్రభుత్వం భారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టడంతో.. ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఎంటెక్, ఇతర ఉన్నత విద్య కోర్సుల్లో చేరాలన్నా లేదా ఉద్యోగాల్లో చేరాలన్నా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థులకు ఫీజుల తిప్పలు మరింతగా పెరుగుతున్నాయి. సకాలంలో అన్ని సర్టిఫికెట్లు సమర్పించకపోతే విదేశాల్లో అడ్మిషన్లు కోల్పోయే ప్రమాదం ఉంది. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు భారీగా పెరిగిపోయాయి. జగన్ హయాంలో చివరి ఏడాది 2023-24 విద్యా సంవత్సరంలో మూడు క్వార్టర్ల ఫీజులు సుమారు రూ.2000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. కూటమి సర్కారు వచ్చిన తర్వాత తొలి ఏడాది 2024-25కు చెందిన ఫీజులను పూర్తిగా చెల్లించారు. కానీ... 2025-26లో నాలుగు క్వార్టర్ల ఫీజులు పెండింగ్ పెట్టారు. కేంద్ర ప్రభుత్వ వాటా రావడంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు చెందిన సుమారు రూ.500 కోట్ల ఫీజులు మాత్రమే చెల్లించారు. ఇతర విద్యార్థులకు చెందిన సుమారు రూ.2 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వెరసి... మొత్తంగా రూ.4 వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. దీంతో తాజాగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఫైనలియర్ ఫలితాలు వచ్చాయి. యూనివర్సిటీలు దశల వారీగా సర్టిఫికెట్లు విడుదల చేస్తున్నాయి. అయితే, ప్రభుత్వం భారీగా ఫీజులు పెండింగ్ పెట్టినందున ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీలు స్పష్టం చేస్తున్నాయి. విదేశీ చదువుల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు కనీసం పదో తరగతి, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు అయినా ఇవ్వాలని అడుగుతు న్నా కాలేజీలు స్పందించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో...
ప్రభుత్వం సకాలంలో ఫీజులు విడుదల చేయడం లేద ని, ఈ క్రమంలో తాము విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేస్తే తమ ఆర్థిక పరిస్థితి ఏం కావాలని కాలేజీ యాజమాన్యా లు ప్రశ్నిస్తున్నాయి. 7 క్వార్టర్ల ఫీజులు పెండింగ్‌లో ఉంటే కాలేజీలు నడపలేని పరిస్థితి వస్తోందని, ఆర్థికంగా బలహీనంగా ఉన్నందునే విద్యార్థులైనా ఫీజులు కట్టాలని అడుగుతున్నామని చెబుతున్నాయి. అయితే అప్పులు చేసి ఫీజులు కట్టినా ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చే ఫీజులు కాలేజీల ఖాతాల్లో జమ అవుతాయి. అప్పుడు విద్యార్థులు ఫీజు ల కోసం మళ్లీ కాలేజీల చుట్టూ తిరగాలి. యాజమాన్యాలు సక్రమంగా తిరిగి ఇస్తాయా? అనే సందేహంతో కొందరు ఫీజులు కట్టేందుకు వెనకాడుతున్నారు. గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద ఇచ్చే ఫీజులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అయ్యేవి. దీంతో ముందుగానే యాజమాన్యాలు ఫీజులు వసూలు చేశాయి. ఆ తర్వాత ప్రభుత్వం విడుదల చేసిన ఫీజులు తల్లుల ఖాతాల్లోకి చేరడంతో ఇబ్బంది రాలేదు. అయితే అసలు ఫీజులను విద్యార్థులకు ముడిపెట్టకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఫీజులను తల్లుల ఖాతాలకు కాకుండా కాలేజీ ల ఖాతాలకు జమ చేసే విధానం తెచ్చింది. అయితే విధా నం మారినా కాలేజీలు మాత్రం ఫీజులు విద్యార్థులే కట్టాలని పట్టుబడుతున్నాయి. మొత్తం ఫీజులు వెంటనే విడుదల చేయలేకపోయినా, ఫైనలియర్ విద్యార్థులకు ఫీజులు ఇస్తే సర్టిఫికెట్ల కష్టాలు తాత్కాలికంగా తప్పుతాయి. ఆ తర్వాత మిగిలిన విద్యార్థులకు దశలవారీగా ఫీజులు విడుదల చేసినా ఇబ్బంది ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే యూనివర్సిటీలకు చెందిన ప్రభుత్వ కాలేజీల్లో ఫీజుల వసూళ్లు లేకుండా చూడాలని విద్యార్థు లు కోరుతున్నారు. గతేడాది ప్రైవేటు కాలేజీలతో పాటు యూనివర్సిటీ కాలేజీలు కూడా ఫీజులు కోసం సర్టిఫికెట్లు ఆపేశాయి. ప్రభుత్వ కాలేజీలే సర్టిఫికెట్లు ఆపేస్తుంటే, తాము మాత్రం ఎందుకు విడుదల చేయాలని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి.