ఉపాధ్యాయులపై రౌడీలను ఎగదోస్తారా?
ABN , Publish Date - Sep 22 , 2026 | 03:35 AM
వైసీపీ రౌడీలు.. గురువులపై దాడి చేస్తున్నారని.. ఇలాంటివి చూస్తూ ఊరుకోబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. డీఎస్సీ నియామక ప్రక్రియపై అవసరమైతే కోర్టులకు వెళ్లవచ్చని.. కానీ ఉపాధ్యాయులపైకి రౌడీలను ఎగదోస్తున్నారని మండిపడ్డారు.
ఈ దాడులను చూస్తూ ఊరుకోం: సీఎం
రౌడీయిజం చేస్తే తోక కత్తిరిస్తాం
డీఎస్సీ నియామకాల్లో అవినీతికి తావు లేదు
నా హయాంలో ఎప్పుడూ పేపర్ లీక్ కాలేదు
14 డీఎస్సీలు ఇస్తే చిన్న పొరపాటూ జరగలేదు
ప్రతి ఆరోపణకూ సమాధానం చెప్పాం
మహిళా అధికారులు దీటుగా బదులిచ్చారు
ప్రక్రియపై కావాలంటే కోర్టులకు వెళ్లొచ్చు
టీచర్లపైకి రౌడీలను ఎగదోయడమేంటి?
మీడియా ముసుగులో ఓ రిపోర్టర్ దాడి
వైసీపీ మూకలను ఇంకా ఉపేక్షించాలా?
అమరావతి అభివృద్ధిని చూసే కుట్రలు
జే బ్రాండ్స్, ఏపీపీఎస్సీ అవకతవకలకు గొడ్డలి పార్టీ సమాధానం చెప్పాలి
కుప్పం బహిరంగ సభలో సీఎం చంద్రబాబు
మెగా డీఎస్సీపై 355 పిటిషన్లు వేశారు. టీచర్ల రిక్రూట్‌మెంట్ జరగకుండా అడ్డుపడ్డారు. అయినా పారదర్శకంగా నియామకాలు జరిపాం. ఇది జరిగిన ఏడాది తర్వాత ఇప్పుడు లేనిపోని దుష్ప్రచారం చేస్తూ బురద జల్లుతున్నారు.
- సీఎం చంద్రబాబు
కుప్పం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): వైసీపీ రౌడీలు.. గురువులపై దాడి చేస్తున్నారని.. ఇలాంటివి చూస్తూ ఊరుకోబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. డీఎస్సీ నియామక ప్రక్రియపై అవసరమైతే కోర్టులకు వెళ్లవచ్చని.. కానీ ఉపాధ్యాయులపైకి రౌడీలను ఎగదోస్తున్నారని మండిపడ్డారు. రాజధాని అమరావతి అభివృద్ధి చెందుతుంటే చూడలేక కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ధైర్యముంటే జే బ్రాండ్స్‌పై.. వైసీపీ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ అవకతవకలపై గొడ్డలి పార్టీ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండ్రోజుల పర్యటనకు వచ్చిన ఆయన సోమవారం బహిరంగ సభలో మాట్లాడారు. డీఎస్సీ ఉద్యోగాలు తమ కష్టార్జితమని టీచర్లంతా నినదిస్తున్నారని.. ఫేక్ పార్టీ అందరినీ ఫేక్ అంటే సహించేది లేదని విజయవాడలో స్పోర్ట్స్ టీచర్లు ఆందోళన చేస్తుంటే వైసీపీ రౌడీలు దాడి చేయడం ఏమిటని ధ్వజమెత్తారు. ‘సీబీఎన్ జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్లలో అవినీతే జరగదు. నా హయాంలో ఎప్పుడూ పేపర్ లీక్ కాలేదు.
ఎన్నో డీఎస్సీలు, ఎన్నో ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించాం. ఎప్పుడూ తప్పులు జరగలేదు. 14 సార్లు డీఎస్సీలు పెట్టాం. చిన్న పొరపాటు కూడా లేకుండా పరీక్షలు నిర్వహించాం. మెగా డీఎస్పీ-2025పై గొడ్డలి పార్టీ చేసిన ప్రతి ఆరోపణకూ సమాధానం చెప్పాం. ఇద్దరు మహిళా అధికారులు దీటుగా జవాబిచ్చారు. చట్టబద్ధంగా జరిగిన ప్రక్రియపై అవసరమైతే కోర్టులకు వెళ్లొచ్చు. కానీ దాడులేంటి? ఉపాధ్యాయులపైకి రౌడీలను ఎగదోయడమేంటి? అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే సాక్ష్యాధారాలతో నోళ్లు మూయిస్తాం. వాస్తవాలతో బట్టలూడదీస్తాం’ అని తేల్చిచెప్పారు. జగన్ ప్రభుత్వం సర్టిఫికెట్లు ఇచ్చిన క్రీడాకారులకు ఉద్యోగాలిస్తే, వారినీ ఫేక్ అంటున్నారని ఆక్షేపించారు. ‘వాళ్లిచ్చిన సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లోకి వచ్చిన వారిని కూడా ఫేక్ అంటున్నారు. గురువులపై గొడ్డలి పార్టీ రౌడీలు దాడి చేశారు. ఇది చూస్తుంటే బాధ, ఆవేదన కలుగుతున్నాయి. తమపై దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ.. కర్నూలు కొండారెడ్డి బురుజు, విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం, విశాఖ సముద్రం ఒడ్డున టీచర్లు గర్జించారు. కానీ కుక్కతోక వంకర అన్నట్లు గొడ్డలి పార్టీ తీరు మారలేదు. మీడియా ముసుగులో ఓ రిపోర్టర్.. టీచర్‌పై దాడి చేశారంటే వైసీపీ మూకలు ఎంతకు బరితెగించాయో అర్థం చేసుకోండి. ఇలాంటి వాళ్లను ఇంకా ఉపేక్షించాలా? వీరిలాగే కొనసాగితే ఆస్తులకు, ఆడబిడ్డలకు రక్షణ ఉంటుందా’ అని ప్రశ్నించారు.
ఆ ఐదేళ్లలో మామూలు నష్టం కాదు..
2019-24 మధ్య రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని. అది మామూలు నష్టం కాదని సీఎం అన్నారు. నాటి పాలనలో పాలకులే రౌడీయిజం చేశారని.. దారుణాలకు పాల్పడ్డారని చెప్పారు. ‘కుప్పం వస్తే నన్ను కూడా ఇబ్బందులు పెట్టారు. దౌర్జన్యాలకు దిగారు. ఓడిపోయిన తర్వాత కూడా చంపడానికైనా, చావడానికైనా సిద్ధం అంటూ రౌడీయిజం చేస్తున్నారు. రౌడీయిజం చేసేవారి తోక కత్తిరిస్తాం’ అని హెచ్చరించారు. రౌడీలను, విధ్వంసకారులను తరిమికొట్టే సత్తా కుప్పానికి ఉందన్నారు. ఫ్లెక్సీలకు పొట్టేళ్లు బలిచ్చి రక్తాభిషేకం చేస్తున్నవారిని సైకోలనాలా.. మానసిక రోగులనాలా అని ప్రశ్నించారు.
ముందు జాగ్రత్తవల్లే తాగునీరిస్తున్నాం
ముందు జాగ్రత్తగా అన్ని రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేయడం వల్లే ప్రస్తుతం తాగునీరైనా ఇవ్వగలుగుతున్నామని సీఎం అన్నారు. ‘ఎల్‌నినో ప్రభావంతో నేడు తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. రాయలసీమే కాకుండా రాష్ట్రం మొత్తం తీవ్ర కరువుతో అల్లాడుతోంది. కృష్ణా, గోదావరి నదుల్లో నీరు తగ్గింది. జలాశయాల్లో తగినన్ని నిల్వలు లేవు. గతేడాది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 669 కిలోమీటర్ల దూరం ఎన్నో లిఫ్టులతో హంద్రీ-నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలను కుప్పం తీసుకొచ్చి సాగుకు 2 టీఎంసీల నీరిచ్చాం. ఇందువల్లే సాగు విస్తీర్ణం 15,500 ఎకరాలకు పెరిగింది. నియోజకవర్గంలోని 550 ఇరిగేషన్ చెరువులు నింపాం. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో రిజర్వాయర్లలో నీరు తగ్గడంతో తాగడానికి మాత్రమే ఇవ్వడం సాధ్యపడుతోంది’ అని చెప్పారు. ప్రకృతి సేద్యంతో వాతావరణ తాపాన్ని పరిహరించి.. భూ, వాయు, నీటి కాలుష్యాన్ని నివారించి ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించవచ్చన్నారు. ప్రకృతి సేద్యాన్ని దేశానికే నమూనాగా అమలు చేస్తున్నామన్నారు. పీఎండీఎస్ (వర్షాకాలానికి ముందు పొడి విత్తనాలు విత్తడం) విధానం ద్వారా సాగు ప్రక్రియ చేపడితే ఎల్‌నినో ప్రభావం తగ్గుతుందన్నారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రకృతిని రక్షించుకుంటే మనం కూడా భద్రంగా ఉంటామన్నారు. సభలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పీకేఎం ఉడా చైర్మన్ సురేశ్, చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు షణ్ముగంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గొడ్డలి పార్టీకి ఒక్క సీటూ ఇవ్వొద్దు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క స్థానమైనా ఇవ్వకుండా గొడ్డలి పార్టీకి గట్టి సమాధానమివ్వాలని ప్రజలకు చంద్రబాబు పిలుపిచ్చారు. ‘ప్రతి వార్డులో, ప్రతి పంచాయతీలో కూటమి అభ్యర్థులే గెలవాలి. ఇదే అభివృద్ధికి నిజమైన సూచిక. మతమార్పిడులు చేసే పార్టీ, రౌడీలను పెంచి పోషించే గొడ్డలి పార్టీని తరిమికొట్టండి. రాష్ట్రంలో రాజకీయ ముసుగులో రౌడీ అనేవాళ్లు ఉండడానికి వీల్లేదు. కుప్పం నుంచే ఆ ప్రక్రియ మొదలు కావాలి’ అని సభలో అన్నారు.
తొలి రోజు అభివృద్ధి కార్యక్రమాలివీ..
తన పర్యటనలో తొలిరోజు సోమవారం సీఎం కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. రూ.10 కోట్లతో నిర్మించనున్న ఆర్డీవో, ఏఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. రూ.3.30 కోట్లతో నిర్మించిన సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్, మెటీరియల్ రికవరీ సెంటర్‌ను ప్రారంభించారు. 10 ఎకరాల్లో రూ.2.70 కోట్లతో చేపట్టనున్న మల్లానూరు జూనియర్ కాలేజీ పనులకు భూమిపూజ చేశారు. కుప్పం మున్సిపాలిటీలో రూ.38 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. వ్యవసాయ ఫీడర్ల కోసం 15 మెగావాట్ల పీఎం కుసుమ్ సోలార్ ప్రాజెక్టులను ప్రారంభించారు.
ఈ వార్తలనూ చదవండి....
‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’
ఆర్‌వీ నగర్ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక