పోలవరంపై స్టాప్ వర్క్ ఆర్డర్‌ను శాశ్వతంగా ఎత్తివేయండి!
ABN , Publish Date - Oct 09 , 2026 | 04:20 AM
AP CM Chandrababu Seeks Permanent Clearance for Polavaramపోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్ర పర్యావరణం-అటవీశాఖ జారీచేసిన ‘స్టాప్ వర్క్’ ఉత్తర్వులను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
ముగ్గురు సీఎంలను సమావేశపర్చండి
న్యూఢిల్లీ, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్ర పర్యావరణం-అటవీశాఖ జారీచేసిన ‘స్టాప్ వర్క్’ ఉత్తర్వులను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ముంపు ప్రభావంపై ఒడిసా, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కోరారు. ఈ సమస్యకు సామరస్య పరిష్కారం కోసం జలశక్తి మంత్రి ఆధ్వర్యంతో తమ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి, ఇటీవల రాష్ట్రంలో రూ.30 వేల కోట్లతో చేపట్టిన జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార పథకం పనులపై విస్తృతంగా చర్చించారు. ఈ రెండు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు నిధుల కొరత రాకుండా ఎప్పటికప్పుడు సకాలంలో విడుదల చేయాలని చంద్రబాబు కోరారు. ఒడిసా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పోలవరం బ్యాక్‌వాటర్‌కు సంబంధించి చేపట్టాల్సిన రక్షణ కట్టల (ప్రొటెక్టివ్ ఎంబాంక్‌మెంట్స్) నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్‌లో ఉందని, ఈ కారణంతో కేంద్ర పర్యావరణ-అటవీ మంత్రిత్వ శాఖ గతంలో జారీ చేసిన స్టాప్ వర్క్ ఆర్డర్‌ను ప్రస్తుతం నిలుపుదలచేసినా.. ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకుల్లేకుండా దానిని పూర్తిగా, శాశ్వతంగా రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ రెండు రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేలా కేంద్రం చొరవ చూపాలని.. ముగ్గురు సీఎంలతో త్రైపాక్షిక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని.. పరస్పర సహకారం, సమన్వయం, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును సంపూర్ణంగా పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే లక్ష్యంతో పనులను పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు.
మొదటి దశలో 41.15 మీటర్ల కాంటూరు వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన సహాయ, పునరావాస పనులను వేగవంతం చేశామని తెలిపారు. నిర్మాణ పనులకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో.. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి, పునరావాసానికి కూడా అంతే సమాన ప్రాధాన్యం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. దీనికి కేంద్రం నుంచి నిధుల కొరత లేకుండా చూడాలన్నారు. అనంతరం 45.72 మీటర్ల కాంటూరు వరకు నీటి నిల్వకు చేపట్టాల్సిన కార్యాచరణపైనా సీఎం, పాటిల్ చర్చించారు. గోదావరి వరద జలాలు సముద్రం పాలు కాకుండా పట్టిసీమ ద్వారా ఎత్తిపోసి సద్వినియోగం చేసుకుంటున్న తీరును, దక్షిణ భారతంలో నదుల అనుసంధానంతో కలిగే ప్రయోజనాలను చంద్రబాబు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే పోలవరాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఇటీవల ప్రొద్దుటూరు వేదికగా శ్రీకారం చుట్టిన ‘జల్‌జీవన్ మిషన్-అమరజీవి జలధార’ గురించీ వివరించారు. రాష్ట్రంలోని మొత్తం 95 లక్షల గ్రామీణ కుటుంబాల్లో ఇప్పటికే 62 లక్షల ఇళ్లకు కొళాయి కనెక్షన్లు ఉన్నాయని.. తాజాగా మరో 27 లక్షల కుటుంబాలకు ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించే పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. పనుల పురోగతికి అనుగుణంగా కేంద్ర నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..
డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు