ఇటు తుఫాన్లు.. అటు కరువు
ABN , Publish Date - Nov 05 , 2026 | 05:52 AM
ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతం తుఫాన్లతో ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు తీవ్ర వర్షాభావం, ఎల్‌నినో కారణంగా రాయలసీమ, ఇంకొన్ని ప్రాంతాలు కరువుతో అల్లాడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
అల్లాడుతున్న రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోండి
బాధిత రైతు కుటుంబాలకు డ్రాట్ కార్డులు
త్వరితంగా పంటల బీమా పరిహారం
సాగు రుణాల రీషెడ్యూలింగ్‌కు సాయం
జీరామ్‌జీ పనిదినాలు 200 రోజులకు పెంచాలి
జల్‌జీవన్ మిషన్ పథకాన్ని విస్తరించాలి
కేంద్ర బృందానికి సీఎం వినతులు
అమరావతి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతం తుఫాన్లతో ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు తీవ్ర వర్షాభావం, ఎల్‌నినో కారణంగా రాయలసీమ, ఇంకొన్ని ప్రాంతాలు కరువుతో అల్లాడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తీవ్ర వర్షాభావంతో వ్యవసాయ రంగానికి జరిగిన నష్టాన్ని, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేలా అన్ని విధాలా సాయం అందించి, ఆదుకోవాలని కేంద్రబృందానికి విజ్ఞప్తి చేశారు. కరువు పరిస్థితుల అంచనాకు వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల బృందం సోమ, మంగళవారాల్లో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పర్యటించింది. కరువు పరిస్థితులపై అధ్యయనం చేసింది.
బుధవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసింది. వర్షాభావం, వరుస తుఫాన్లు, పంట నష్టాలు, రైతుల సమస్యలకు ప్రభుత్వం చేపడుతున్న ఉపశమన చర్యలను ఆయన వారికి వివరించారు. ‘ఈ ఏడాది సాధారణం కంటే గణనీయంగా వర్షపాతం తగ్గింది. దీంతో ఖరీఫ్‌లో పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సీమ జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సాగునీటితో పాటు తాగునీరు, పశుగ్రాసం సమస్యలు కూడా తలెత్తాయి.
అనంతపురం జిల్లాలో దేశంలోనే రెండో అత్యల్ప వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 21 జిల్లాల్లోని 412 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించాం. కరువు నష్టాన్ని అంచనా వేసి, సాయం కోరుతూ ఇప్పటికే కేంద్రానికి విజ్ఞాపన సమర్పించాం. వారం రోజుల్లో మరో రిపోర్టు అందజేస్తాం’ అని చెప్పారు. మరోవైపు కోస్తా జిల్లాల్లో తుఫాన్ల కారణంగా పంటలు, ఇతర మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లిందన్నారు. ఈ విభిన్న ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం ప్రత్యేకంగా స్పందించి, తగిన సహాయం అందించాలని కోరారు.
సాగుకు ఉపాధి పథకం..
ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. అయితే ఈ తరహా సాగుకు వీబీ-జీరామ్‌జీ పథకం కింద కనీస పని దినాలను 200 రోజులకు పెంచి, వ్యవసాయ రంగానికి అవసరమైన పనులకు ఈ పథకాన్ని వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని కేంద్ర బృందాన్ని కోరారు. తద్వారా రైతులకు మానవ వనరుల సమస్య తీరతాయన్నారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో అర్హులైన కరువు బాధిత కుటుంబాలకు డ్రాట్ కార్డులు జారీ చేసే అంశాన్ని కేంద్రం పరిశీలించాలి.
దీనివల్ల కేంద్ర సహకారంతో నిత్యావసర సరుకులను సబ్సిడీపై వారికి అందించే వీలుంటుంది. అలాగే రైతుల రుణాల రీ-షెడ్యూలింగ్ వంటి ఉపశమన చర్యలు అందేలా కేంద్రం సహకరించాలి. భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోయాయి. జల్ జీవన్ మిషన్(జేజేఎం) పథకాన్ని మరింత విస్తరించాలి. రైతులకు పంటల బీమా పరిహారంతో పాటు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా అందేలా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే పంటల బీమా క్లెయిమ్స్‌పై కేంద్రం చొరవ తీసుకోవాలి’ అని విజ్ఞప్తిచేశారు.
ఆ మిర్చి ఎగుమతయ్యేలా చూడండి
శ్రీలంకలోని కొలంబో పోర్టులో నిలిచిపోయిన మిర్చి కంటెయినర్ల అంశంపై ఆయా దేశాలతో సంప్రదింపులు జరపాలని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు సీఎం చంద్రబాబు బుధవారం లేఖ రాశారు. చైనా, బంగ్లాదేశ్, ఇండోనేసియా, థాయ్‌లాండ్, సింగపూర్ లాంటి దేశాలకు వెళ్లాల్సిన 150కి పైగా మిర్చి కంటెయినర్లు కొలంబో పోర్టులో నిలిచిపోయాయని వివరించారు.
వెంటనే తాత్కాలిక సాయం ప్రకటించండి
అర్నబ్, మురసు తుఫాన్లతో పంట నష్టపోయిన రైతులకు తక్షణం తాత్కాలిక సాయాన్ని ప్రకటించాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరారు. రైతుల కష్టాలు, సమస్యలపై కేంద్రానికి లేఖలు రాయడంతో పాటు పలుమార్లు కేంద్రమంత్రులతో ఫోన్‌లో మాట్లాడారు. అర్నబ్ తుఫాన్ కారణంగా రూ.4,563 కోట్ల మేర రాష్ట్రానికి నష్టం వాటిల్లినట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపింది. మురసు తుఫాన్ కారణంగా 7 జిల్లాల్లోని 465 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు కేంద్ర హోం మంత్రికి సీఎం మరో లేఖ రాశారు.
15 రోజుల్లో కేంద్రానికి నివేదిక
కరువు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి, పంట నష్టాలను అంచనా వేసింది. రైతులతో నేరుగా మాట్లాడి, సమస్యలు తెలుసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాలు, క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా 15 రోజుల్లో కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని బృందం తెలిపింది. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్రానికి అందించాల్సిన సాయంపై కేంద్రం తదుపరి చర్యలు తీసుకుంటుంది.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్
ఫోర్జరీ, చీటింగ్ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్