Share News

పెన్షనర్లకు ప్రభుత్వం తీపికబురు

ABN , Publish Date - Sep 23 , 2026 | 03:48 AM

విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. 70, 75 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు వైసీపీ ప్రభుత్వం తగ్గించిన అదనపు క్వాంటం పెన్షన్‌ శాతాన్ని తిరిగి పెంచుతూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022లో 11వ పీఆర్సీ సందర్భంగా అదనపు క్వాంటం పెన్షన్‌ను వైసీపీ ప్రభుత్వం తగ్గించింది.

పెన్షనర్లకు ప్రభుత్వం తీపికబురు

  • జగన్‌ తగ్గించిన అదనపు క్వాంటం పెన్షన్‌ తిరిగి పెంపు..

  • జనవరి నుంచి 70 ఏళ్ల వయస్సు దాటితే 10 శాతం,

  • 75 దాటితే 15 శాతం అదనపు పెన్షన్‌

అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. 70, 75 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు వైసీపీ ప్రభుత్వం తగ్గించిన అదనపు క్వాంటం పెన్షన్‌ శాతాన్ని తిరిగి పెంచుతూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022లో 11వ పీఆర్సీ సందర్భంగా అదనపు క్వాంటం పెన్షన్‌ను వైసీపీ ప్రభుత్వం తగ్గించింది. 70 ఏళ్లు నిండిన వారికి 10 శాతం నుంచి 7శాతానికి, 75 ఏళ్లు నిండిన వారికి 15 శాతం నుంచి 12 శాతానికి ఈ అదనపు పెన్షన్‌ తగ్గింది. అప్పటి నుంచి పెన్షనర్ల సంఘాలు దీనిపై ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వచ్చాయి. పెన్షనర్ల ఆర్థిక, ఆరోగ్య అవసరాలను మానవీయకోణంలో పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు పాత పద్ధతినే పునరుద్ధరించాలని నిర్ణయించారు.

పునరుద్ధరణ తర్వాత ఇలా..

  • తాజా జీవో ప్రకారం, ఇకపై 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు 10 శాతం, 75 సంవత్సరాలు నిండిన వారికి 15 శాతం అదనపు పెన్షన్‌ లభిస్తుంది.

  • 80 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పెన్షనర్లకు ప్రస్తుతం ఉన్న అదనపు పెన్షన్‌ 20 శాతం, 50 శాతంలో ఎటువంటి మార్పు లేదు.

  • ఈ సవరించిన అదనపు పెన్షన్లు డిసెంబరు, 2026 నెలకు సంబంధించిన పెన్షన్‌ నుంచి వర్తిస్తాయి. అంటే జనవరి 1, 2027 పెన్షనర్ల ఖాతాల్లో జమ అయ్యే పెన్షన్‌ బిల్లు ద్వారా ఈ పెరిగిన నగదు అందుతుందని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది.


ఉద్యోగ సంఘాల హర్షం

పెన్షనర్లకు అదనపు పింఛను(అడిషనల్‌ క్వాంటం ఆఫ్‌ పెన్షన్‌) పునరుద్ధరిస్తూ జీవో 126ను విడుదల చేయడంపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. జేఏసీ ఉద్యమ కార్యాచరణ సందర్బంగా 5న సీఎం సానుకూలంగా స్పందించి ఈ ఉత్తర్వులు ఇచ్చారని ఏపీ జేఏసీ అమరావతి జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌ వలిశెట్టి దామోదరరావు పేర్కొన్నారు. ఇటీవల ఉద్యమ కార్యాచరణలో కూడా ఈ ఆంశాన్ని ఒక ప్రధాన డిమాండ్‌గా పెట్టామన్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో దీర్ఘకాలిక సమస్య పరిష్కారమైందన్నారు. కాగా, ప్రభుత్వ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు అదనపు క్వాంటంను పునరుద్దరించడంపై ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆలపర్తి విద్యాసాగర్‌, డీవీ.రమణ హర్షం వ్యక్తం చేశారు. ఎన్జీవోల కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. ఈ జీవో ద్వారా సుమారు నాలుగు లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందన్నారు. పీఆర్సీ కమిటీ నియమాకం, హెల్త్‌కార్డులపై ఇచ్చిన హామీలపై కూడా త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ వార్తలనూ చదవండి...

పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..

సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

Updated Date - Sep 23 , 2026 | 03:48 AM