Share News

గొడ్డలి పార్టీకి బీసీలంటే ద్వేషం

ABN , Publish Date - Oct 02 , 2026 | 04:20 AM

బీసీలకు మొదట రాజకీయంగా గుర్తింపు తెచ్చింది ఎన్టీఆర్‌. ఆ తర్వాత ఎప్పటికప్పుడు బీసీలకు అండగా నేను నిలబడ్డాను. 1995లో స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చాను. కానీ గొడ్డలిపార్టీ దానిని 24 శాతానికి తగ్గించి...

గొడ్డలి పార్టీకి బీసీలంటే ద్వేషం

  • అందుకే కోర్టులో వ్యాజ్యాలతో కుట్రలు

  • 34 శాతం రిజర్వేషన్లకు మోకాలడ్డారు: బాబు

  • హైకోర్టులో కొట్టివేసే పరిస్థితి తెచ్చారు

  • సుప్రీంకు వెళతాం..అక్కడా పోరాడతాం

  • బీసీలను రాజకీయంగా పైకి తెచ్చింది టీడీపీనే

  • పేదరికాన్ని మానవీయ కోణంలో చూస్తున్నాం

  • సంకల్పం మంచిదైతే దేవుడు మనతోనే

  • కొత్తగా రోడ్డు డాక్టరు విధానం

  • మార్చి నాటికి పోలవరం మొదటి దశ పూర్తి

  • ప్రపంచ పర్యాటక పటంలో సూర్యలంక

  • రేపల్లె ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి వెల్లడి

  • స్వయంగా ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ

బీసీలకు మొదట రాజకీయంగా గుర్తింపు తెచ్చింది ఎన్టీఆర్‌. ఆ తర్వాత ఎప్పటికప్పుడు బీసీలకు అండగా నేను నిలబడ్డాను. 1995లో స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చాను. కానీ గొడ్డలిపార్టీ దానిని 24 శాతానికి తగ్గించి, బీసీలకు అన్యాయం చేసింది. దానివల్ల 16,800 మంది పదవులకు దూరమయ్యారు. మేం ఇప్పుడు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంటే, గొడ్డలిపార్టీ కోర్టుల్లో వ్యాజ్యాలు వేయించింది. మేం తెచ్చిన జీవోను హైకోర్టులో కొట్టివేసే పరిస్థితిని ఆ పార్టీ తెచ్చింది. దీనిని సవాల్‌ చేస్తాం. సుప్రీంకోర్టును ఆశ్రయించి అక్కడ కూడా పోరాడతాం.

- సీఎం చంద్రబాబు


బాపట్ల, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీకి 45 ఏళ్లుగా అండగా నిలిచిన బీసీలకు న్యాయం చేసే బాధ్యత ఎన్డీఏతో పాటు టీడీపీ తీసుకుంటుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. బీసీలపై ఉన్న ద్వేషంతోనే గొడ్డలిపార్టీ రిజర్వేషన్లపై కుట్రలు పన్ని పిటిషన్లు వేయించి అడ్డు తగిలిందని మండిపడ్డారు. ‘‘ఏది ఏమైనా వెనకబడిన వర్గాలను కాపాడుకుంటాం. రాజకీయంగా వారిని పైకి తీసుకొచ్చే బాధ్యతను తీసుకుంటాం.’’ అని చంద్రబాబు ప్రకటించారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకమే వెయ్యేనుగుల బలమని వ్యాఖ్యానించారు. పేదల సేవలో.. పథకంలో భాగంగా బాపట్ల జిల్లా రేపల్లెలో గురువారం జరిగిన ‘ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగానే, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేసిన అంశం ఆయనకు తెలిసింది. దీనిపై సీఎం వెంటనే స్పందించారు. బీసీల రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే గొడ్డలిపార్టీ పిటిషన్ల పేరుతో కుట్రలకు తెర తీసిందని మండిపడ్డారు. రిజర్వేషన్ల అంశంపై శుక్రవారమే అత్యున్నత న్యాయస్థానాన్ని (సుప్రీంకోర్టు) ఆశ్రయిస్తామని ప్రకటించడంతో పాటు, గొడ్డలిపార్టీ వైఖరిపై మండిపడ్డారు. మెగా డీఎస్సీని యజ్ఞంలా నిర్వహించి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తే, వాటిపై కూడా 350 కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. ఇప్పుడు వెనకబడిన వర్గాలపై ద్వేషంతో కోర్టుకెళ్లి, వారికి దక్కాల్సిన రిజర్వేషన్లకు అడ్డు తగిలారన్నారు. పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా రూ. వేల కోట్లను ఖర్చు చేస్తున్నామని, రోడ్డుపై గుంతలు కనపడితే అధికారులను ఉపేక్షించేది లేదని, నూతనంగా రోడ్డు డాక్టర్‌ విధానాన్ని తీసుకొస్తామన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..


అడ్డుకుంటే ఆగేదే లేదు..

‘‘రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితులను సైతం గొడ్డలిపార్టీ రాజకీయం చేస్తోంది. నేను వరుణ దేవుణ్ణి ప్రార్థించాను. ఆ తర్వాత 24 గంటల్లోనే విశాఖపట్నం సహా పలు ప్రాంతాల్లో 27 సెంటిమీటర్ల వర్షం కురిసింది. మన సంకల్పం మంచిదైతే దేవుడు మనతోనే ఉంటాడనడానికి ఇదే నిదర్శనం. అడ్డుకుంటే ఆగేదే లేదు. నాయకుడిగా ప్రజల రేపటి భవిష్యత్తు గురించే ఆలోచిస్తాను. ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను కేవలం డబ్బుల పంపిణీగానే చూడడం లేదు. వారి జీవితాలకు భరోసా ఇవ్వడంతో పాటు, ఆర్థిక అసమానతలు తొలగించి, మంచి భవిష్యత్‌ ఇవ్వడానికి మార్గంగా చూస్తున్నాం. పింఛన్ల కోసం ఇప్పటివరకు రూ.76,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రూ.33,000 కోట్లు అందించాం. కష్టాలున్నా పారిపోవడం లేదు. అధిగమిస్తున్నాం. పోలవరం మొదటి దశను వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తి చేసి కృష్ణానదితో అనుసంధానం చేసి, డెల్టాలకు నీటి సమస్యే లేకుండా అన్‌స్టాపబుల్‌ చేస్తా. పోలవరంతో పాటు 35 ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. రాయలసీమలో గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌కు శ్రీకారం చుడుతున్నాం’’

సర్వేలో ఎన్డీఏ గ్రాఫ్‌ పెరిగింది

‘‘తాజా సర్వే రిపోర్టుల్లో గొడ్డలిపార్టీ పరపతి దిగజారిపోయింది. ఎన్డీయే పరపతి పైకి ఎగబాకింది. అసెంబ్లీ మీద అలిగిన పార్టీకాదు.. ప్రజలే మాకు ప్రతిపక్షంగా పనిచేస్తున్నాం. మేమంతా ప్రజలకు సేవకులం తప్ప పెత్తందార్లం కాదు. సుదీర్ఘకాలం పాటు ఒకే పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కానీ, దేశాలు కానీ అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచాయి. మీరు చూపించే అభిమానం శాశ్వతంగా ఉంటే, ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా రాష్ట్రాన్ని నిలుపుతా’’


అమరావతిని అడ్డుకోవాలని చూస్తే మసైపోతారు

‘‘గొడ్డలిపార్టీ ఎన్ని విన్యాసాలు చేసినా అమరావతిని ముక్కోటి దేవతలు కాపాడుకున్నారు. అమరావతి అభివృద్ధి నా ఒక్కడేది కాదు, వేలమంది రైతుల త్యాగం. అమరావతిపై కుట్రలు చేస్తే మసైపోతారు తప్ప, మీ వల్ల ఏమీ కాదు. కాలానుగుణంగా అప్‌గ్రేడ్‌ అవడంతో పాటు నిత్యం నేర్చుకోవడానికే ప్రాధాన్యమిస్తాను. ఇప్పుడే ఇక్కడ ఉన్న పిల్లలతో మాట్లాడా. అందరూ ఏఐ కోర్సులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వీరంతా జెన్‌జీ, ఆల్ఫా యుగం వారే. సైబరాబాద్‌ కంటే మెరుగైన సిటీగా అమరావతి ఉంటుంది. బాపట్ల జిల్లాకు దేవుడిచ్చిన వరం సూర్యలంక. గోవా కంటే బ్రహ్మాండంగా ప్రపంచ పర్యాటకపటంలో ఉంచే బాధ్యత నాది. ఇక్కడ వాన్‌పిక్‌ సిటీ ఇండస్ట్రియల్‌ కారిడార్‌గా ఆవిర్భవించేది. గొడ్డలిపార్టీ నేత నిర్వాకంతో అన్యాయం జరిగింది. విశాఖ, విజయవాడ, మంగళగిరి తదితర ప్రాంతాల్లో నివాస స్థలాల్లో ఉన్న పేదలకు పట్టాలిచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా రూ.52వేల కోట్ల విలువైన స్థలాలను పేదల సొంతం చేశాం. లక్ష మంది డ్వాక్రా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాం. మరో 5లక్షల మందిని వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌లో భాగంగా పారిశ్రామికవేత్తలుగా తయారుచేస్తాం’’ అని సీఎం తెలిపారు.

భేష్‌..అనగాని : సీఎం ప్రశంస

  • సత్యప్రసాద్‌ పాదాభివందనం.. వారించిన చంద్రబాబు

భూ సమస్యలు పరిష్కరించడంలో రెవెన్యూశాఖ సమర్థవంతంగా పనిచేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ, క్యూఆర్‌ కోడ్‌తో భూ ఇక్కట్లకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా మంత్రి అనగాని సత్యప్రసాద్‌ కృషిని సీఎం కొనియాడారు. ‘‘రేపల్లె ప్రాంతంలో బీసీ బిడ్డ అనగాని భగవంతరావు మంత్రిగా చక్కగా పనిచేశారు. ఇప్పుడు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ సత్తా చాటుతున్నారు.’’ అని ప్రశంసించారు. అయితే ఈ అభినందనలు ఇప్పటి వరకేనని... వచ్చే మార్చికి ఉన్న ప్రోగ్రస్‌తో పూర్తిగా అభినందిస్తానని చమత్కరించారు. తన అకౌంట్‌ అంతా ఏరోజుకారోజు సెటిలయిపోతుందని, నిత్యం ఫలితాలు కనబడాలని సీఎం సరదాగా వ్యాఖ్యానించారు.


వన్‌స్టాప్ సెంటర్స్‌కు భూమి పూజ

రేపల్లె ప్రజావేదిక ప్రాంగణంలోవివిధ విభాగాల స్టాల్స్‌ను సీఎం సందర్శించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వన్‌స్టాప్ సెంటర్స్‌ నూతన భవనాల శంకుస్థాపన శిలా ఫలకాన్ని ఈ సందర్భంగా సీఎం ఆవిష్కరించారు. ఇప్పటికే బాపట్లలో వన్‌స్టా్‌ప సెంటర్‌ సేవలందిస్తుండగా, రాష్ట్రంలోని మరో పది చోట్ల దాదాపు రూ.6 కోట్లతో వన్‌స్టాప్‌ సెంటర్‌లకు భవనాలు నిర్మించనున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు

ప్రభుత్వ భూములకు స్కెచ్‌

Updated Date - Oct 02 , 2026 | 04:20 AM