Share News

కొనుగోలు భారం తగ్గాలి!

ABN , Publish Date - Nov 19 , 2026 | 03:10 AM

విద్యుత్‌ కొనుగోలు భారం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నొక్కిచెప్పారు. కరెంటు డిమాండ్‌, ఉత్పత్తి, సరఫరా వంటి అంశాల్లో ఏఐ వంటి టెక్నాలజీలను ఉపయోగించి సామర్థ్యం పెంచుకోవాలన్నారు.

కొనుగోలు భారం తగ్గాలి!

  • కరెంటు డిమాండ్‌కు అనుగుణంగా ప్రణాళికలు

  • ప్రైవేటుపై ఆధారపడడం తగ్గించాలి.. ప్రభుత్వ ప్రాజెక్టులను గ్రౌండ్‌ చేయాలి

  • గ్రీన్‌ ఎనర్జీ పథకాలు వేగవంతం కావాలి.. సూర్యఘర్‌ అమల్లో తొలి స్థానానికి రావాలి

  • ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, హాస్టళ్లపై సోలార్‌ రూఫ్‌ టాప్‌ నెలకొల్పాలి

  • నీటి ప్రాజెక్టులు, కాల్వ గట్లపైనా సౌర ప్లాంట్లు.. ట్రాన్స్‌ఫార్మర్ల చోరీలపై

  • అత్యంత కఠిన చర్యలు.. విద్యుత్‌ శాఖపై సమీక్షలో సీఎం ఆదేశం

అమరావతి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ కొనుగోలు భారం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నొక్కిచెప్పారు. కరెంటు డిమాండ్‌, ఉత్పత్తి, సరఫరా వంటి అంశాల్లో ఏఐ వంటి టెక్నాలజీలను ఉపయోగించి సామర్థ్యం పెంచుకోవాలన్నారు. అప్పుడు అధిక ధరకు విద్యుత్‌ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదని చెప్పారు. బుధవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో విద్యుత్‌ రంగంపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

రాష్ట్ర విద్యుత్‌ అవసరాల కోసం ప్రైవేటు సంస్థలపై ఆధారపడడం తగ్గించాలన్నారు. దీనికోసం ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ ప్రాజెక్టులను గ్రౌండ్‌ చేయాలన్నారు. పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ను అంచనా వేసి.. తదనుగుణంగా ప్రణాళికలు రూపొందించి.. తక్షణం వాటిని అమలు చేయాలన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు విద్యుత్‌ డిమాండ్‌ 18.23 శాతం పెరిగిందని అధికారులు తెలిపారు. ఎల్‌నినో వంటి సమస్యల కారణంగా వర్షాకాలంలో కూడా డిమాండ్‌ అనూహ్యంగా పెరిగిందని.. ఇలాంటి సవాళ్లను ముందుగానే అంచనా వేసుకుని ఎదుర్కోవాలని సీఎం సూచించారు.


వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉన్నందున కరెంటు కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యుదుత్పత్తి వ్యయాన్ని తగ్గించడంతోపాటు విద్యుత్‌ ధరలూ తగ్గేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరెంటు చార్జీలు పెంచబోమని ఎన్నికల్లో హామీ ఇచ్చామని.. దానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. పునరుత్పాదక విద్యుదుత్పత్తిని భారీగా పెంచే దిశగా చేపట్టిన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఆదేశించారు. విద్యుత్‌ రంగంలో 2024 జూన్‌ నుంచి 103 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని, వీటి ద్వారా రూ.4.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అధికారులు వివరించారు.

విశాఖ భాగస్వామ్య సదస్సులో ఇంధన రంగానికి సంబంధించి రూ.2.56 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణతో పాటు ఒప్పందాలు కార్యరూపం దాల్చడంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఎంవోయూలు చేసుకున్న ప్రతి గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టు క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యేలా నిర్దిష్ట కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌-3 కింద త్వరగా టెండర్లు పిలిచి, రెండేళ్లలోగా కార్యరూపంలోకి తీసుకురావాలన్నారు.


36,050 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులు!

పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 36,050 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు వివరించారు. పోలవరం పరిసరాల్లో 27 పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులకు అనువైన ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులపై మరింత పరిశోధన, అధ్యయనం జరగాలని సీఎం సూచించారు. పీఎం సూర్యఘర్‌ పథకం అమల్లో ప్రస్తుతం దేశంలో నాలుగో స్థానంలో ఉన్న మన రాష్ర్టాన్ని మొదటి స్థానానికి తీసుకెళ్లాలని నిర్దేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలపై సోలార్‌ రూఫ్‌ టాప్‌ ఏర్పాటుతో పాటు.. సాగునీటి ప్రాజెక్టులు, కాల్వ గట్లపై సోలార్‌ ప్లాంట్లు నెలకొల్పాల్సి ఉందన్నారు. సోలార్‌ రూఫ్‌ టాప్‌ ఏర్పాటులో నాయుడుపేట, మాచర్ల, నరసరావుపేట డివిజన్లు ముందున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 7.42 లక్షల రూఫ్‌టాప్‌ ఇన్‌స్టలేషన్లు పూర్తి చేసినట్లు చెప్పారు. 10 లక్షల లక్ష్యాన్ని డిసెంబరు నాటికి చేరుకోవాలని సీఎం స్పష్టం చేశారు.

చోరీలపై కఠిన చర్యలు..

విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీల అంశం కూడా సమీక్షలో చర్చకు వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో, పొలాల్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు పెద్ద ఎత్తున చోరీకి గురవుతున్నాయని అధికారులు తెలిపారు. రాగి తీగల కోసం వాటిని దొంగలిస్తున్నారని చెప్పగా.. అలాంటివారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అదేశించారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడంతో పాటు విద్యుత్‌ సరఫరాలో సమస్యలకు కారణమవుతున్న వారిని వదిలిపెట్టవద్దని స్పష్టం చేశారు. దర్యాప్తునకు పోలీసుల సహకారం తీసుకోవాలని.. చోరీలకు పాల్పడేవారికి గట్టి గుణపాఠం చెప్పాలన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్

పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్

Updated Date - Nov 19 , 2026 | 03:20 AM