సుస్థిరతతోనే పెట్టుబడులు!
ABN , Publish Date - Sep 18 , 2026 | 03:31 AM
‘సుస్థిరతతో నమ్మకం పెరుగుతుంది. నమ్మకంతో పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడుల వల్ల ఉద్యోగాలు సమకూరుతాయి. అభివృద్ధీ జరుగుతుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీని దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడిగా అభివర్ణించారు. మోదీ పాతికేళ్ల ప్రజాప్రస్థానాన్ని పురస్కరించుకుని గురువారం వారాణసీలోని రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ‘వారాణసీ-వడ్‌నగర్ సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.
మోదీ.. సరైన సమయంలో సరైన నాయకుడు
25 ఏళ్లుగా ప్రభుత్వాధినేతగా ఉండడం
మామూలు విషయం కాదు..
దేశాన్ని ప్రగతి దిశగా నడుపుతున్నారు
జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు
మేకిన్ ఇండియాను బలోపేతం చేశారు
నదుల అనుసంధానం ఆయనతోనే సాధ్యం
మహిళలకు 33శాతం కోటా.. గేమ్ చేంజర్
ఏపీకి కేంద్రం నుంచి పెద్దఎత్తున సహకారం
వారాణసీ-వడ్‌నగర్ సేవా అభియాన్‌లో సీఎం
అవి వస్తే ఉపాధి, అభివృద్ధి: చంద్రబాబు
గతంలో యువత ఉద్యోగాల మీదే ఆధారపడేది. అయితే ప్రధాని మోదీ దూరదృష్టి కారణంగా 2.20 లక్షల స్టార్ట్‌పల ద్వారా యువతే ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగింది. ఇప్పుడు అద్భుతమైన స్టార్టప్ ఎకో సిస్టం కలిగిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.25 ఏళ్ల పాటు నిరంతరాయంగా ప్రభుత్వాధినేతగా ఉండడం మామూలు విషయం కాదు. మోదీ సమాజాన్ని చదివారు.. దానికనుగుణంగా పాలన చేపట్టారు. 2003లో గుజరాత్ సీఎంగా ఉండగా ‘వైబ్రంట్ గుజరాత్’ కార్యక్రమం నిర్వహించారు.. ఇప్పుడది గ్లోబల్ బ్రాండ్‌గా మారింది. - సీఎం చంద్రబాబు
అమరావతి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ‘సుస్థిరతతో నమ్మకం పెరుగుతుంది. నమ్మకంతో పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడుల వల్ల ఉద్యోగాలు సమకూరుతాయి. అభివృద్ధీ జరుగుతుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీని దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడిగా అభివర్ణించారు. మోదీ పాతికేళ్ల ప్రజాప్రస్థానాన్ని పురస్కరించుకుని గురువారం వారాణసీలోని రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ‘వారాణసీ-వడ్‌నగర్ సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.
దేశాన్ని మోదీ అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ఆయనకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని తన ప్రసంగంలో పిలుపిచ్చారు. కాశీ పుణ్యక్షేత్రం మోదీ కర్మభూమి అని.. వారాణసీకి నేతను ఎన్నుకోవడమే కాదు... దేశానికి ఓ గొప్ప నాయకుడిని అందించిందని తెలిపారు. ‘వీకేఎస్ అనేది అభివృద్ధి మంత్రం.. ఈ మంత్రంతో దేశం అభివృద్థిపథంలో దూసుకుపోతోంది. వీ అంటే వడ్‌నగర్.. కే అంటే కాశీ.. ఎస్ అంటే సెప్టెంబరు’ అని చెప్పారు. ఎన్‌డీఏ ఐక్యతే దేశానికి బలమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం పెద్దఎత్తున సాయం అందిస్తోందన్నారు. అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు ఇస్తున్న మద్దతును రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరువలేరని తెలిపారు. దేశంలో భిన్న సంస్కృతులు, భిన్న భాషలు ఉన్నా.. దేశాభివృద్థి, ఆత్మనిర్భరతే మన లక్ష్యమన్నారు. సుస్థిరత వల్లే ఇది సాధ్యమవుతుందని స్పష్టంచేశారు.
ప్రపంచం సంక్షోభంలో కూరుకుపోతున్న వేళ
మోదీ ప్రభుత్వ విజయాలను చంద్రబాబు వివరించారు. 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని.. 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందుతున్నాయని చెప్పారు. ‘జల్‌జీవన్ మిషన్, అమృత్ వంటి పథకాల ద్వారా 4 కోట్ల ఇళ్లకు తాగునీటి సౌకర్యం కల్పించారు. ఇవి అంకెలు మాత్రమే కాదు.. వీటి వెనుక పేద, మధ్య తరగతి కుటుంబాల అభివృద్ధి-సంక్షేమం ఉంది. పీఎం కిసాన్ కింద 11 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇందులో ఎలాంటి మధ్యవర్తులూ లేరు. నేరుగా రైతుల ఖాతాలకే నగదు జమ చేస్తున్నారు’ అని తెలిపారు. ప్రపంచంలో వివిధ దేశాలు సంక్షోభంలో కూరుకుపోతున్న వేళ నరేంద్ర మోదీ దేశానికి మంచి నాయకత్వం అందించారని.. ఆత్మనిర్భర్ భారత్, వోకల్ ఫర్ గ్లోబల్ విధానాలతో మేకిన్ ఇండియా కాన్సె్‌ప్టను బలోపేతం చేశారని ప్రశంసించారు. ‘గతంలో రక్షణ పరికరాలను దిగుమతి చేసుకునేవాళ్లం, ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి చేరాం. టెక్నాలజీని పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్న ఏకైక ప్రధాని మోదీయే. మహిళా సంక్షేమం, సాధికారత కోసం ఆయన కృషి అపూర్వం.. బేటీ బచావో-బేటీ పడావో, లఖ్‌పతి దీదీ స్కీంలు ఇందుకు నిదర్శనం. ఉజ్వల పథకం ద్వారా క్లీన్ ఫ్యూయల్‌ను ప్రోత్సహిస్తున్నారు. ముద్ర పథకం పెట్టుబడులు సమకూరుస్తోంది. స్వయం సహాయక సంఘాలు నమ్మకాన్ని పెంచుతున్నాయి. నారీశక్తి అధినియం ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వబోతున్నారు. ఇది గేమ్ చేంజర్ కాబోతోంది’ అని చెప్పారు.
వన్ గ్రిడ్ వన్ నేషన్ మోదీ ఘనతే
దేశం మొత్తానికి ఒకే పవర్ గ్రీడ్ ఏర్పాటు చేసిన ఘనత మోదీదేనని సీఎం పేర్కొన్నారు. ‘దేశం నలుమూలలకూ కనెక్టివిటీ పెంచారు. వందే భారత్ రైళ్లను ప్రారంభించారు.. బుల్లెట్ ట్రైన్లు రాబోతున్నాయి. నదుల అనుసంధానం మాత్రం పెండింగ్‌లో ఉంది.. ఇది కూడా మోదీ ద్వారానే సాధ్యమవుతుంది. బ్రహ్మపుత్ర, గంగ, మహానది, కావేరి, గోదావరి నదులను అనుసంసంధానం చేస్తే దేశానికి తిరుగుండదు. మోదీ సారథ్యంలో అభివృద్ధి పట్టణాలకే కాదు.. గ్రామీణ ప్రాంతాలకూ చేరింది’ అని తెలిపారు. ప్రపంచం ముందు భారత్‌ను తిరుగులేని శక్తిగా నిలబెట్టిన ఘనత మోదీదేనన్నారు. ఎవరైనా మన దేశంపై దాడి చేయాలంటే భయపడేలా చేశారని తెలిపారు. ‘నేను కూడా నక్సలిజాన్ని ఎదుర్కొన్నాను.. నన్ను నక్సలైట్లు టార్గెట్ చేశారు.. కానీ ఇప్పుడు దేశంలో నక్సలిజం, మావోయిజం అనేదే లేకుండా చేశారు. దటీజ్ నరేంద్ర మోదీ.’ అని చెప్పారు.
కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు
కాశీవిశ్వనాథుడిని చంద్రబాబు దర్శించుకున్నారు. యోగి ఆదిత్యనాథ్, రాజ్‌నాథ్, చిరాగ్ పాసవాన్‌తో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వనాథుడిని పవిత్ర జలాలతో అభిషేకించారు. అర్చకులు ఆశీర్వదించి.. తీర్థప్రసాదాలు అందించారు. కేంద్ర మంత్రులు, యూపీ సీఎంతో కలిసి ఆలయ ప్రాంగణంలోని భక్తులకు సీఎం ప్రసాదం పంచారు. ఆయన వెంట ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీశ్ ఉన్నారు.
హిందీలో ప్రారంభించి.. హిందీలోనే ముగించారు..!
‘ఆజ్ మై కాశీకే పవిత్ర ధర్తీ పర్ ఖడా హూ.. యే మేరేలియే గర్వ్ కా క్షణ్ హై’ అంటూ చంద్రబాబు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘దేశ్ బదల్ రహా హై, దేశ్ ఆగే బఢ్ రహా హై.. నయా భారత్ హై.. ఆత్మ నిర్భర్ భారత్ హై’ అంటూ నినదించారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్, వికసిత్ భారత్.. యహీ హమారా సంకల్ప్ హై’ అంటూ ప్రసంగం ముగించారు.
కష్టసుఖాల్లో బాబు తోడు: చిరాగ్
చంద్రబాబు తన తండ్రి రామ్‌విలాస్ పాసవాన్‌కు అత్యంత సన్నిహితుడని కేంద్ర మంత్రి చిరాగ్ పాసవాన్ అన్నారు. కష్టసుఖాల్లో తన తండ్రికి తోడుగా నిలిచారంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు.
వెరీ వెల్ అంటూ రాజ్‌నాథ్ ప్రశంసలు
వారాణసీ-వడ్‌నగర్ సేవా సంకల్ప్ అభియాన్‌లో సీఎం ప్రసంగానికి మంచి స్పందన లభించింది. రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్ చప్పట్లతో మార్మోగింది. రామజన్మభూమి మొదలుకొని ఆపరేషన్ సింధూర్ వరకు ప్రతి అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రసంగం ముగిసిన వెంటనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ‘వెరీ వెల్.. వెరీ వెల్’ అంటూ ప్రశంసించారు. చప్పట్లతో అభినందనలు తెలుపాలంటూ సభికులను కోరారు. సేవా అభియాన్‌లో చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అయోధ్యలో వేంకటేశ్వర ఆలయం..
శ్రీరాముని జన్మస్థలం అయోధ్యలో కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించాలని భావిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ ఆలయ నిర్మాణానికి 10 ఎకరాలు కేటాయించాలని యూపీ సీఎం యోగిని కోరారు.
వారాణసీ నియోజకవర్గంలో రక్తదాన శిబిరాలు
మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వారాణసీ లోక్‌సభ నియోజకవర్గమంతటా బీజేపీ పెద్దఎత్తున వేడుకలు నిర్వహించింది. ఆ పార్టీ కార్యకర్తలు ప్రజలకు పండ్లు, మిఠాయిలు పంచారు. ఇదే సమయంలో రక్తదాన శిబిరాలను, పారిశుధ్య డ్రైవ్‌లను కూడా నిర్వహించారు. ఈ వేడుకల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పంకజ్ చౌధరితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, లోక్‌జనశక్తి (రాంవిలాస్) నేత చిరాగ్ పాసవాన్ తదితరులు పాల్గొన్నారు. మోదీ దేశం కోసం, వికసిత భారతం కోసం చిరకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని తాము ప్రార్థించామని రాజ్‌నాథ్ మీడియాకు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి: