Share News

మరో 4 రోజులు భారీ వర్షాలు

ABN , Publish Date - Nov 04 , 2026 | 04:48 AM

వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం, గాలుల తీవ్రత తదితర అంశాలపై చంద్రబాబు ఆరా తీశారు. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయని అధికారులు తెలిపారు.

మరో 4 రోజులు భారీ వర్షాలు

వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం, గాలుల తీవ్రత తదితర అంశాలపై చంద్రబాబు ఆరా తీశారు. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయని అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 20.38 సెం.మీ. సగటు వర్షపాతం పమోదైందని చెప్పారు. బాపట్ల జిల్లాలో 21, ప్రకాశం జిల్లాలో 20సెం.మీ. మేర వర్షాలు పడ్డాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్‌, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలపై అధిక ప్రభావం ఉంటుందని, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. తూర్పుగోదావరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

25 శాతం తగ్గిన వాన లోటు

వరుస తుఫాన్లతో వర్షపాతం మెరుగై, రాష్ట్రంలో వానలోటు 53 శాతం నుంచి 28 శాతానికి తగ్గిందని సీఎం చెప్పారు. ‘భారీ వర్షాలతో 696 టీఎంసీల నీరు వచ్చింది. రిజర్వాయర్లకు 11 టీఎంసీలు, మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులకు 25 టీఎంసీలు చేరింది. భూగర్భజలం 0.45 మీటర్లు పెరిగింది. సీమలో 40 శాతం నుంచి 50శాతం వరకూ లోటు ఉండగా, కోస్తాలో మెరుగైంది’ అని సీఎం తెలిపారు. రాష్ట్రంలో కరువు బృందాలు ఒకవైపు, తుఫాన్‌ పరిస్థితులపై మరోవైపు కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయని అన్నారు.


టెక్నాలజీతో తుఫాన్ల గమనం అంచనా

‘టెక్నాలజీ సాయంతో ఆర్టీజీఎస్‌ నుంచి తుఫాన్ల కదలికలను గుర్తించి, చివరి గ్రామం వరకు ముందస్తు సమాచారం అందించి, అప్రమత్తం చేశాం. లోతట్టు ప్రాంతాల వారిని శిబిరాలకు తరలించాం. గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు, రోగులకు సౌకర్యాలు కల్పించాం. ముందు 4గంటలకు ఓసారి తర్వాత గంటకోసారి బులెటిన్లు ఇచ్చాం. చాలాచోట్ల సహాయ కార్యక్రమాల్లో ప్రజలు కూడా భాగస్వామ్యమయ్యారు. అవేర్‌ ద్వారా ఆర్టీజీఎస్‌లో అంచనాలు విశ్లేషించుకొని, డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోగలిగాం. వాతావరణ సమాచారాన్ని సేకరించాం. ముంపు గ్రామాలను ముందే గుర్తించాం. క్షేత్రస్థాయి వాస్తవాలతో పోల్చినప్పుడు మా అంచనాల్లో 90శాతం కచ్చితత్వం ఉందని తేలింది. వర్షపాతం, వరద ప్రవాహాలను రిజర్వాయర్లకు మళ్లించడంపై దృష్టిపెట్టాం. ఆస్తి, ప్రాణనష్టం గణనీయంగా తగ్గించాం. వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ చర్యల ద్వారా ప్రజలకు నమ్మకం కల్పించాం’ అని సీఎం తెలిపారు.

20రోజులు పట్టే పని 5రోజుల్లో చేశారు

‘అర్నబ్‌ తుఫాన్‌ వల్ల 4,095 గ్రామాల్లో 31వేల విద్యుత్‌ స్తంభాలు పడిపోతే.. సిబ్బంది వర్షంలోనే పని చేశారు. 20 రోజులు పట్టే పనిని 4, 5 రోజుల్లోనే చేశారు. ప్రాణాలు లెక్క చేయకుండా పని చేశారు. కొన్నివేల చెట్లు తొలగించారు. తుఫాన్‌ సమయంలో 19వేల రేషన్‌ దుకాణాల్లో రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు నిల్వ ఉంచాం. 897 వైద్య బృందాలు, 108, 104 సిద్ధంగా ఉంచాం. యాంటీ స్నేక్‌ వాక్సిన్‌ కూడా సిద్ధం చేశాం. పారిశుధ్యం, తాగునీటికి ప్రాధాన్యం ఇచ్చాం. అంటువ్యాధులు రాకుండా ప్రజలు తగిన కనీస జాగ్రత్తలు తీసుకోవాలి’ అని చంద్రబాబు సూచించారు.


ఉద్యోగులకు సీఎం అభినందనలు

క్షేత్రస్థాయిలో యంత్రాంగం బాగా పని చేసిందని సీఎం ప్రశంసించారు. అధికారులు, ఉద్యోగులు, పోలీస్‌, రెవెన్యూ, వైద్య, మున్సిపల్‌, అగ్నిమాపక, పీఆర్‌ సిబ్బంది రాత్రింబవళ్లు టీం స్పిరిట్‌తో కష్టపడి పనిచేశారని కొనియాడారు. విద్యుత్‌ సిబ్బంది చాలా శ్రమపడ్డారని అన్నారు. ప్రజల కోసం కష్టపడ్డ సిబ్బందిని ఆయన అభినందించారు. కాగా, మురసు తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం పర్యటిస్తానని సీఎం చెప్పారు. సహాయ చర్యలు ఏ విధంగా అమలయ్యాయో, ప్రజలు ఎలా స్పందిస్తున్నారో స్వయంగా తెలుసుకుంటానని చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలా చేయగలిగిన పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. తుఫాన్‌ సహాయ చర్యలపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం

కూటమికే.. పట్టణం

Updated Date - Nov 04 , 2026 | 04:49 AM