ఒప్పందాలే కాదు.. ఉత్పత్తీ ప్రారంభం కావాలి
ABN , Publish Date - Oct 23 , 2026 | 04:36 AM
రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌లో పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్‌లో ప్రభుత్వంతో సహా ప్రైవేటు భాగస్వామ్యంలోనూ భారీగా పెట్టుబడులు వచ్చేలా..
రాయలసీమ హార్టికల్చర్ హబ్‌లో పెట్టుబడులు కీలకం
రాష్ట్రంలో సెమీకండక్టర్ తయారీ ఎకోసిస్టమ్ అభివృద్ధి కావాలి
పశ్చిమ, తూర్పు దేశాలను అనుసంధానించేలా మన పోర్టులు
ఎస్‌ఐపీబీలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం
ఇప్పటివరకు 714 ఒప్పందాల్లో 519 ప్రాజెక్టుల కార్యాచరణ
ఎన్నికల కోడ్ వల్ల పెట్టుబడుల వివరాలు వెల్లడించని ప్రభుత్వం
అమరావతి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌లో పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్‌లో ప్రభుత్వంతో సహా ప్రైవేటు భాగస్వామ్యంలోనూ భారీగా పెట్టుబడులు వచ్చేలా పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు పెట్టుబడులుగా మారి ఉత్పత్తి ప్రారంభించే అంశంపైనా దృష్టి పెట్టాలని ఆదేశించారు. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 22వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు లోకేశ్, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, నారాయణ, కందుల దుర్గేశ్ వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు పలు అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
పరిశ్రమలు, ఇంధన శాఖ, పర్యాటక శాఖ, ఐటీ-ఎలకా్ట్రనిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో వచ్చిన పెట్టుబడుల ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమోద ముద్ర వేసింది. అయితే.. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో.. ఏయే ప్రాంతాలకు ఎంతెంత పెట్టుబడితో పరిశ్రమల ప్రతిపాదనలకు ఆమోదం లభించిందన్న వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన 714 ఒప్పందాల్లో 519 ప్రాజెక్టుల కార్యాచరణ ప్రారంభమైనట్టు అధికారులు సీఎంకు తెలిపారు. కాగా.. వచ్చే నెలలో విశాఖలో నిర్వహించనున్న పారిశ్రామిక పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు కోసం అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్‌ను సిద్ధం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. సెమీకండక్టర్ రంగంలో తయారీ యూనిట్లతో కూడిన ఎకోసిస్టమ్ రాష్ట్రంలో ఏర్పాటు కావాలని సీఎం ఆకాంక్షించారు.
రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ పోర్టులు అభివృద్ధి చేయాలి
లాజిస్టిక్స్ రంగంలోనూ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వీలుగా పోర్టులు, ఎయిర్‌పోర్టులతోపాటు తూర్పు, పశ్చిమ దేశాలకు కనెక్టివిటీని పెంచడంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ పోర్టు డెవలప్‌మెంట్ విధానాన్ని అమలు చేయాలని మౌలిక సదుపాయాల కల్పన శాఖను ఆదేశించారు. పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో ఓడరేవులు ప్రాధాన పాత్రను పోషిస్తాయని అన్నారు. గ్లోబల్ స్థాయిలో పశ్చిమ, తూర్పు దేశాలను అనుసంధానం చేసేలా రాష్ట్రంలో ఓడరేవులను అభివృద్ధి చేయాలని చెప్పారు. రాష్ట్రంలోని ఉత్పత్తులను విదేశాలకు నేరుగా ఎగుమతి చేసేలా ఓడరేవులు ఉండాలని, దానికి అనువుగా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలని అన్నారు. దీనికి తగ్గ కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పారు. ప్రధానంగా వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలైన పాలసీని రూపొందించాలన్నారు. ఇందుకోసం ఈ రంగాల్లో నిష్ణాతులైన కన్సల్టెట్లను నియమించుకోవాలని సూచించారు.
నౌకా మరమ్మతు కేంద్రాలకు ప్రోత్సాహం
నౌకాశ్రయాల్లో చర్యలు చేపట్టేందుకు మౌలిక సదుపాయాల కల్పన శాఖ సిద్ధమైంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు భారీ నౌకాశ్రయ నిర్మాణాలను చేపడుతున్న ఆ శాఖ.. ఇకపై నౌకా తయారీ, మరమ్మతు కేంద్రాలనూ ప్రోత్సహించాలని భావిస్తోంది. భారీ నౌకల మరమ్మతు పనులకు చాలా సమయం పడుతుంది. అప్పటిదాకా వాటిని ఓడరేవు బెర్త్‌ల్లోనే పార్కింగ్ చేసేందుకు భారీ మొత్తాలను చెల్లించాల్సి వస్తోంది. ఈ వ్యయాన్ని తగ్గించేందుకు రాష్ట్రంలోని నౌకాశ్రయాల్లోనే కొన్ని బెర్తులను రిపేరు కోసం కేటాయించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు నౌకాయాజమాన్యాలకు వ్యయం తగ్గుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టులను టెండరు ప్రక్రియ ద్వారా పూర్తిగా అప్పగించకుండా, లీజులకు ఇవ్వడంపైనా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది.
ఈ వార్తలనూ చదవండి: