వరుస విపత్తులు.. నిరంతర సమీక్షలు!
ABN , Publish Date - Nov 04 , 2026 | 04:55 AM
రోజుల వ్యవధిలోనే రాష్ట్రాన్ని ముంచెత్తిన అర్నబ్, మురసు తుఫాన్లతో సీఎం చంద్రబాబు కంటిపై కునుకు లేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు.
అర్నబ్, మురసు తుఫాన్లతో సీఎం బిజీ బిజీ
ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు
ప్రాణ, ఆస్తినష్టం తగ్గించే లక్ష్యంతో ముందస్తు సన్నద్ధత
టెక్నాలజీతో ప్రజలకు సూచనలు, హెచ్చరికలు జారీ
ఒకేసారి వేలాది మంది సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్‌లు
తెల్లవార్లూ కలెక్టర్లు, అధికారులతో వరుసగా సమీక్షలు
తుఫాన్ల నష్టాలకు సాయం కోరుతూ కేంద్రానికి ఫోన్లు
ఈసారి కొత్తగా ‘మనమిత్ర’ సేవలు అందుబాటులోకి
అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): రోజుల వ్యవధిలోనే రాష్ట్రాన్ని ముంచెత్తిన అర్నబ్, మురసు తుఫాన్లతో సీఎం చంద్రబాబు కంటిపై కునుకు లేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు. వరుస విపత్తులపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అర్నబ్ అనుభవంతో మురసు తుఫాన్‌పై వాతావరణ శాఖ హెచ్చరించినప్పటి నుంచే అధికారులను ముందస్తుగా సన్నద్ధం చేశారు. సహాయ, పునరావాస చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. అర్నబ్ సమయంలో దాదాపు పదిసార్లు సమీక్షలు, టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించిన చంద్రబాబు... తుఫాన్ నష్టాన్ని పరిశీలించడానికి కేంద్ర బృందాలను పంపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.
ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పరిస్థితులను పరిశీలించేందుకు అక్టోబరు 29, 30 తేదీల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఆ మర్నాడే (అక్టోబరు 31న) రాష్ట్ర సచివాలయానికి వచ్చి.. మురసు తుఫాన్ ముప్పుపై ఆర్టీజీఎస్ నుంచి సమీక్ష నిర్వహించారు. నవంబరు 1న క్యాంప్ కార్యాలయంలో మరోసారి తుఫాన్ ప్రభావంపై సమీక్షించి, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తుఫాన్ నేపథ్యంలో 2న తన ఢిల్లీ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. తీవ్ర గాలులకు పెద్దసంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతాయన్న అంచనాలతో తమిళనాడు సీఎం విజయ్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో ఫోన్‌లో మాట్లాడి, సిబ్బందిని, సామగ్రిని పంపాలని కోరారు. ఇప్పటికే అర్నబ్ తుఫాన్‌లో దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల పునరుద్ధరణకు తెలంగాణ నుంచి సిబ్బంది వచ్చి రాష్ట్రంలో పనిచేస్తున్నారు.
చంద్రబాబు విజ్ఞప్తికి రెండు రాష్ట్రాల సీఎంలు సానుకూలంగా స్పందించి, అవసరమైన సిబ్బందిని పంపారు. సోమవారం ఉదయం ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి తుఫాన్ ప్రభావంపై సమీక్షించిన సీఎం.. ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న 45వేల మంది సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మరోవైపు అర్నబ్ తుఫాన్ నష్టాన్ని పరిశీలించేందుకు అక్టోబరు 31, నవంబరు 1న క్షేత్రస్థాయిలో పర్యటించిన కేంద్రబృందంతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రానికి త్వరితగతిన కేంద్ర సాయం అందేలా చూడాలని కోరారు. తర్వాత పంటల బీమాపై అధికారులతో చర్చించారు. రాత్రి 9.30 గంటలకు మరోసారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్లను అప్రమత్తం చేశారు. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకే మళ్లీ కలెక్టర్లతో మాట్లాడారు.
ఉదయం అమిత్ షాకు ఫోన్ చేసి, అర్నబ్ తుఫాన్ నుంచి కోలుకోకముందే.. మురసు వచ్చిందని చెప్పారు. వివిధ జిల్లాల్లో పంట, ఆస్తి నష్టాలను వివరించారు. తగిన సహాయంతో రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. అనంతరం తుఫాన్ పరిస్థితిని సమీక్షించారు. అర్నబ్ తుఫాన్ హెచ్చరికలు మొదలైనప్పటి నుంచి టెక్నాలజీతో ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేయించడం ద్వారా ఆస్తి, ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించేందుకు చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు మురసు ప్రభావంపైనా నిరంతరం సమీక్షలు చేస్తున్నారు.
మరోవైపు అర్నబ్ సమయంలో ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభావిత ప్రాంతాల ప్రజల నుంచి సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ విధానంపై కేంద్ర బృందం ప్రశంసలు కురిపించింది. కాగా, అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు వేగంగా సాగడంతో దాదాపు అన్ని గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రస్తుతం మురసుతో ప్రభావితమైన ప్రాంతాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం