రాష్ట్రాన్ని రాక్షసులకు వదిలేయాలా?
ABN , Publish Date - Oct 25 , 2026 | 04:19 AM
ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి, పనిచేసిన ఐదేళ్లూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి విఫల సీఎంగా ముద్రపడ్డారు. పార్టీని రౌడీలు, బ్లేడ్ బ్యాచ్‌లకు అడ్డాగా మార్చి పార్టీ అధ్యక్షుడిగా విఫలమయ్యారు. ఏ కొడుకూ చేయని విధంగా తండ్రి పేరును బజారుకీడ్చి కొడుకుగా విఫలమయ్యారు.
ఎన్నికలు జరగడం ఇష్టం లేకే దాడులు.. విధ్వంసం
గొడ్డలిపార్టీ అరాచకాలను చూస్తూ ఊరుకోబోం
హింసకు ప్రతిహింస కూటమి విధానం కాదు
కానీ, దాడులు చేస్తుంటే భయపడి వెన్ను చూపబోం
వీళ్లను ఎన్నుకుంటే సమాజానికి ఏం లాభమో ప్రజలూ ఆలోచించాలి.. జగన్ ఓ విఫలమైన వ్యక్తి!
సీఎంగా, పార్టీ అధ్యక్షుడిగా విఫలం..
కొడుకుగా, అన్నగా విఫలమైన చరిత్ర
చివరికి బాధ్యతగల పౌరుడిగానూ పనికిరాడు
అభివృద్ధికి వీలుంటుందనే స్థానిక ఎన్నికలు
వాటిని సైతం వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారు
ఇప్పుడు ఏకంగా మేనకోడలి పెళ్లికీ అడ్డంకులు
రాజకీయ విలువలే కాదు, కుటుంబ విలువలూ లేవు
దౌర్జన్యాలు.. పిటిషన్లు.. లిటిగేషన్లు.. జగన్ నైజం
రాష్ట్రం తగలబడినా తాను నెగ్గాలన్నదే లక్ష్యం
గొడ్డలి పార్టీ అధినేత ఓ క్రిమినల్ లిటిగెంట్..
బీసీలకు న్యాయం చేస్తుంటే, అడ్డుకున్నారు
అధికారంలో ఉండగా చేసిన ఏకగ్రీవాలు మరిచారా?
మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు ఆగ్రహం
ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి, పనిచేసిన ఐదేళ్లూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి విఫల సీఎంగా ముద్రపడ్డారు. పార్టీని రౌడీలు, బ్లేడ్ బ్యాచ్‌లకు అడ్డాగా మార్చి పార్టీ అధ్యక్షుడిగా విఫలమయ్యారు. ఏ కొడుకూ చేయని విధంగా తండ్రి పేరును బజారుకీడ్చి కొడుకుగా విఫలమయ్యారు. చెల్లెళ్లకు అన్యాయం చేసి అన్నగా విఫలమయ్యారు. చివరికి ఓ బాధ్యతగల పౌరుడిగానూ జగన్ విఫలమయ్యారు.
- సీఎం చంద్రబాబు
అమరావతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): జగన్ అన్ని విధాలా విఫలమైన వ్యక్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షునిగా, కుమారుడిగా, అన్నగా.. చివరకు దేశ పౌరుడిగానూ జగన్‌ది విఫల చరిత్రేనని మండిపడ్డారు. ‘‘రాష్ట్రాభివృద్ధి పట్టదు. దేశం గురించి పట్టదు. చివరికి ప్రజాసమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి రమ్మంటే అక్కడికీ రాడు. ఇలాంటి వ్యక్తులను ఎన్నుకోవడం వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం కలుగుతుందో ప్రజలు ఆలోచన చేయాలి.’’ అని సీఎం కోరారు. ఎవరికి నేర చరిత్ర ఉందో ప్రజలు అర్థం చేసుకుని వ్యవహరించాలన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అరాచకాలను వివరించేందుకు సీఎం క్యాంప్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అరాచకాలను వీడియోల ద్వారా వివరించారు. ‘‘అదే హింస, అవే అబద్ధాలు, అవే అరాచకాలు’ పేరుతో బుక్లెట్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘కొందరు చేసే అరాచకాల వల్ల వల్ల రాష్ట్ర ప్రతిష్ఠ మొత్తం దిగజారుతోంది. ఏపీలో పెట్టుబడులు పెట్టాలా..వద్దా.. అని పారిశ్రామికవేత్తలు అనుమానపడే పరిస్థితులను తెచ్చారు. పారిశ్రామికవేత్తలకు నమ్మకం కల్పిచడం కోసం ఎస్ర్కో ఖాతా ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహాకాలిస్తున్నాం. రాష్ర్టాన్ని నంబర్-1 చేయాలనేది మా లక్ష్యం. ఇలాంటి వ్యక్తులు అడ్డుపడితే మా లక్ష్యాన్ని అధిగమించడం కష్టమవుతుంది.
అభివృద్ధి కుంటుపడుతుంది. 2019-24 మధ్య ప్రజలు నిద్రలేని రాత్రులు గడిపారు. కనీసం రోడ్లపైకి కూడా రాలేని పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా లేదు. ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారు. ఒక్క నిమిషం ఏమరుపాటుగా ఉన్నా, గొడ్డలి పార్టీ వ్యక్తులు నిలువునా ముంచేస్తారు. గతంలో ఇలాంటి వ్యక్తిని రాష్ర్టానికి రానీయకుండా కన్న తండ్రి వైఎస్సే దూరంగా ఉంచేయాలని అనుకున్నారు. రక్త బంధానికి కూడా విలువ ఇవ్వని వ్యక్తి, ఇక ప్రజలకు ఏం విలువ ఇస్తారు..?’’ అని ప్రశ్నించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
వైసీపీ హింసాత్మక రాజకీయాలపై చర్చ జరగాలి
‘‘రాష్ట్రంలో వైసీపీ నేరమయ రాజకీయాలు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలిరోజు నుంచే వైసీపీ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. గొడ్డలి పార్టీకి చెందిన ఓ ఎంపీ వాహనంతో కూటమి కార్యకర్తలను తొక్కించారు. ఆ కారులో మద్యం బాటిళ్లు, మారణాయుధాలు ఉన్నాయి. పుంగనూరు, రాయచోటి, కనిగిరి, దర్శి, కడప, తంబళ్లపల్లె, తిరుపతి ఇలా వేర్వేరు ప్రాంతాల్లో గొడ్డలి పార్టీ నేతలు అరాచకం సృష్టించారు. రాష్ట్రం తగలబడి పోయినా ఫర్వాలేదని, తమ అజెండా నెగ్గాలనే ఆలోచనతోనే వైసీపీ ఇదంతా చేస్తోంది. పంజాబ్ నుంచి కిరాయి ముఠాలను తీసుకువచ్చి భయభ్రాంతులకు గురిచేశారు. కనిగిరిలో నామినేషన్ కేంద్రంలోకి వైసీపీ కార్యకర్తలు దూసుకెళ్లి విధ్వంసం సృష్టించారు. తంబళ్లపల్లెలో జనసేన కార్యాలయంపై దాడి చేశారు. హింసాత్మక రాజకీయాలను ప్రొత్సహిస్తున్న వైసీపీ విధానంపై ప్రజల్లో చర్చ జరగాలి. ‘సర్’ నిబంధనల ప్రకారమే కూటమి పార్టీలు వ్యవహరిస్తున్నాయి. కానీ దీనికి విరుద్ధంగా వైసీపీ వ్యవహరిస్తోంది. హింస చేస్తోంది వాళ్లే. పిటిషనర్లూ వాళ్లే. ఇదెక్కడి అరాచకం? గతంలో బాబాయిని హత్య చేసి ఫేక్ ప్రచారం చేశారు. ఇప్పుడూ అదే తంతు. కోర్టులకు వెళ్లి తప్పుడు పిటిషన్లు వేస్తూ, క్రిమినల్ లిటిగెంట్లుగా తయారయ్యారు. హైకోర్టుతోపాటు సుప్రీం కోర్టుకూ తప్పుడు సమాచారం ఇచ్చారు.’’
అరాచకాలను చూస్తూ వదిలేయలేం
‘‘ప్రజాస్వామ్యయుతంగా పనిచేయటమే కూటమి పార్టీలకు తెలిసిన విషయం. గొడ్డలి పార్టీ చేసే అరాచకాలను చూస్తూ వదిలివేయలేం. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ దాడులు చేసి వాహనాలు దహనం చేసి హింసాత్మక ఘటనలకు పాల్పడింది. అసత్యాలను పదేపదే చెబుతూ, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ప్రెస్ మీట్లు పెట్టడానికే జగన్ బెంగళూరు నుంచి అమరావతికి వచ్చి వెళుతున్నారు. వైసీపీకి చెందిన మాజీ డిప్యూటీ స్పీకర్ స్వయంగా.. రాష్ట్రంలో ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ జరిగిందని చెబితే.. వైసీపీ అధ్యక్షుడు మాత్రం అసత్యాలు చెబుతున్నారు. వైసీపీ హయాంలో జరిగిన స్థానిక సంస్థల్లో 24 శాతం ఏకగ్రీవాలు చేసుకున్నారు. అప్పటి ఎస్ఈసీనే భయపెట్టారు. ఎస్ఈసీ ప్రాణభయంతో కేంద్రం నుంచి భద్రత తీసుకోవాల్సిన పరిస్థితి నాడు తీసుకొచ్చారు.’’
ఎన్నికల్ని అడ్డుకోవడమే జగన్ ఎజెండా
‘‘స్థానిక సంస్థల ఎన్నికలు జరక్కూడదన్నదే వైసీపీ సింగిల్ పాయింట్ ఎజెండా. అందుకే బరితెగించి హింసాత్మక ఘటనలకు తెగబడుతోంది. గతంలోనూ, ఇప్పుడూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే బాధితులు. మా వాళ్లనే కొట్టి వైసీపీ ఎదురుదాడికి పాల్పడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలను అభివృద్థికి ఓ అవకాశంగా భావించాం. కానీ గొడ్డలి పార్టీ అభివృద్ధిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. నేరమయ రాజకీయాల్ని ఛేదించటం సవాలే కానీ కష్టం ఏమీ కాదు. ఫ్యాక్షనిజం, నక్సలిజం వంటి సమస్యలను చూశాను. కానీ ఏకంగా ఓ రాజకీయ పార్టీ చేస్తున్న నేరమయ రాజకీయాలతో శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కావడం తొలిసారి చూస్తున్నాను.
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందులలో 33 స్థానాలూ ఏకగ్రీవం కావటం దౌర్జన్యం కాదా? కడపలో 79 శాతం ఎంపీటీసీలు, 76 శాతంజడ్పీటీసీలు ఏకగ్రీవం చేసుకోవడం దౌర్జన్యం కాదా? జగన్ గురివింద తరహాలో మాట్లాడుతున్నారు. హింసకు ప్రతిహింస మా విధానం కాదు. అదే సమయంలో, భయపడి వెన్ను చూపేది లేదు. కుతంత్రాలతో రక్తపాతం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. రాక్షసుల్లా దాడులు చేస్తుంటే, రాష్ట్రాన్ని వారికి వదిలేసి వెళ్లిపోవాలా? రాష్ట్రవ్యాప్తంగా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలయ్యాయి. వైసీపీ వారు కూడా టీడీపీతో పోటీగా నామినేషన్లు వేశారు.
28 జిల్లాల్లో 9,829 ఎంపీటీసీలకు గానూ మొత్తం 51,902 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో 27,772 నామినేషన్లు కూటమి పార్టీలు వేస్తే, వైసీపీ 20,556 నామినేషన్లు దాఖలు చేసింది. 659 జడ్పీటీసీ స్థానాలకుగానూ మొత్తం 5,724 నామినేషన్లు పడగా, వాటిలో 3,012 నామినేషన్లు కూటమి పార్టీలు వేస్తే, వైసీపీ 1,815 నామినేషన్లు వేసింది. వాస్తవాలు ఈ విధంగా ఉంటే, తమను నామినేషన్లు వేయనీయలేదని గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది. బీసీలకు న్యాయం చేయాలని 34 శాతం రిజర్వేషన్ ఇస్తే, వైసీపీ 59 పిటిషన్లతో అడ్డుకుంది.’’ అని చంద్రబాబు మండిపడ్డారు.
మేనకోడలు వివాహానికీ అడ్డంకులే
‘‘బాబాయిని చంపేసి నేరం చెల్లెలిపై నెట్టేశారు. నిందితుడిని అరెస్టు చేయడానికి సీబీఐ వేస్త, అడ్డుకున్న వ్యక్తి విలువల గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. రాజకీయ విలువలు ఎటూ లేవు. కనీసం నైతిక విలువలు కూడా లేకుండా పోయాయి. కుటుంబ విలువల్ని వదిలేసి ఆస్తుల కోసం సొంత తల్లికి, చెల్లికి కూడా అన్యాయం చేస్తున్నారు. మేనకోడలు వివాహానికి యలహంక ప్యాలెస్ ఇవ్వనని చెబుతున్నారు. వైఎస్ యలహంక ప్యాలెస్‌లో జగన్, షర్మిలకు చెరొక భాగం ఇచ్చారు. ఇప్పుడు సెక్యూరిటీ సమస్య అంటూ సొంత మేనకోడలి వివాహాన్నే అడ్డుకుంటున్నారు. ఇదేం చోద్యం. ఆస్తిలో చెల్లికీ భాగం ఉంది.
మేనకోడలి పెళ్లిని అడ్డుకుని కంస మామలా తయారయ్యాడు. ఆయన మనస్తత్వం రాష్ర్టానికి ఎంత ప్రమాదకరమన్నది ప్రజలకు కూడా తెలియాలి.’’ అని చంద్రబాబు అన్నారు. ఎవరు మంచి చేశారో వారికి మద్దతు ఇచ్చి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ వార్తలనూ చదవండి: