Share News

ప్రజల ప్రాణాలే ముఖ్యం

ABN , Publish Date - Nov 04 , 2026 | 04:40 AM

‘ఓవైపు ఎల్‌నినో ఇబ్బంది పెడుతోంది. మరోవైపు అర్నబ్‌, మురసు తుఫాన్లు వరుసగా వచ్చాయి. ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు మీనమేషాలు లెక్కపెట్టను. చిన్నాపెద్దా అని ఆలోచించను.

ప్రజల ప్రాణాలే ముఖ్యం

  • వారికి కష్టం వస్తే మీనమేషాలు లెక్కపెట్టను .. ఎన్నికల కంటే ప్రజల బాధలకే తొలి ప్రాధాన్యం

  • రెస్క్యూ, రిలీఫ్‌, రిహాబిలిటేషన్‌పై దృష్టి సారించాం

  • నేటిలోగా బాధితులకు సాయం అందించాలి

  • ఓవైపు వరుసగా 2 తుఫాన్లు... మరోవైపు ఎల్‌నినో

  • ఒకేసారి మూడు సవాళ్లను ఎన్నడూ చూడలేదు

  • తుఫాన్ల నిర్వహణపై మాన్యువల్‌ రూపొందిస్తాం

  • కలెక్టర్లు టీం లీడర్లుగా పనిచేశారు: సీఎం కితాబు

  • ఉద్యోగులు, సిబ్బంది బాగా కష్టపడ్డారని ప్రశంసలు

  • నేడు ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ‘ఓవైపు ఎల్‌నినో ఇబ్బంది పెడుతోంది. మరోవైపు అర్నబ్‌, మురసు తుఫాన్లు వరుసగా వచ్చాయి. ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు మీనమేషాలు లెక్కపెట్టను. చిన్నాపెద్దా అని ఆలోచించను. పొరుగు రాష్ట్రాల సహకారం తీసుకోవడానికీ వెనుకాడను. ప్రజల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తాం. తుఫాన్ల నుంచి సాధారణ స్థితికి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలు, బాధలకే తొలి ప్రాధాన్యం ఇచ్చామని స్పష్టం చేశారు. వరుస తుఫాన్ల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న సహాయ చర్యలపై మంగళవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అర్నబ్‌ తుఫాన్‌ సహాయ చర్యలు తీసుకుంటుండగానే మురసు వచ్చింది.

మరోవైపు రాయలసీమలో ఎల్‌నినోతో వర్షాభావం, కరువు పరిస్థితులు ఉన్నాయి. ఒక రాష్ట్రంలో ఒకే సమయంలో ఇన్ని విపత్తులను ఎదుర్కోవడం ఇదే తొలిసారి. ఇలాంటి పరిస్థితిని నేనెప్పుడూ చూడలేదు. మొట్టమొదటిసారిగా ఒకేసారి మూడు సవాళ్లను ఎదుర్కొంటున్నాం. తుఫాన్లలో రెస్క్యూ, రిలీఫ్‌, రిహాబిలిటేషన్‌ అనే మూడు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాం. తుఫాన్లను ఎదుర్కొనేందుకు స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల నుంచి రాష్ట్ర సచివాలయం వరకు యంత్రాంగాన్ని సమాయత్తం చేశాం. తుఫాన్ల గమనాన్ని అంచనా వేస్తూ, గాలుల వేగాన్ని, వర్షపాతాన్ని విశ్లేషించుకుంటూ, సహాయ చర్యల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాం. అందరి ప్రాణాలు కాపాడాలని, ఆస్తి నష్టాన్ని తగ్గించాలని, సాధారణ పరిస్థితులు నెలకొల్పే లక్ష్యంతో పనిచేస్తున్నాం.


హుద్‌హుద్‌, తితలీ హరికేన్‌, మొంథా తుఫాన్ల నుంచి పాఠం నేర్చుకుని, ఇప్పుడు ప్రజలను కాపాడాలని ప్రయత్నిస్తున్నా. గతంలో ఒడిశాలో తుఫాన్‌ సహాయక చర్యలకు మన రాష్ట్రం నుంచి సిబ్బందిని పంపాం. ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక సీఎంలతో, తెలంగాణ డిప్యూటీ సీఎంతో మాట్లాడాను. ఏపీలో పరిస్థితిని వివరించి, విద్యుత్‌ పునరుద్ధరణకు సిబ్బందిని పంపాలని కోరా. రాష్ట్రంలో పరిస్థితిపై కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాం. కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తానని అమిత్‌ షా హామీ ఇచ్చారు. అర్నబ్‌ తుఫాన్‌ వల్ల రూ.4,526 కోట్ల నష్టం వాటిల్లింది. 3.52 లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 23,211 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.

దీనిపై కేంద్రానికి మధ్యంతర నివేదిక పంపాం. త్వరలో పూర్తి నివేదిక పంపుతాం. మురసు తుఫాన్‌ పరిస్థితిపై ప్రాథమిక అంచనాలు సిద్ధం చేస్తున్నాం. తుఫాను బాధితులకు ఇవ్వాల్సిన సాయాన్ని బుధవారం సాయంత్రంలోగా అందించాలని కలెక్టర్లను ఆదేశించా. పంటల బీమా పథకంలో ప్రీమియం చెల్లించిన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖను ఆదేశించా. ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా, బీమా కంపెనీలు పారదర్శకంగా, నిజాయితీగా పనిచేయాలని సూచించా’ అని సీఎం వివరించారు.


శాశ్వత పరిష్కారాలపై దృష్టి

రాష్ట్రంలో విపత్తులను ఎదుర్కోవటానికి నిర్దిష్ట ప్రమాణాలతో మాన్యువల్‌ రూపొందిస్తామని చంద్రబాబు తెలిపారు. గతంలో విపత్తు నిర్వహణ మాన్యువల్‌ తయారు చేయించానని చెప్పారు. తుఫాన్ల సమయంలో ఎదురయ్యే అనుభవాలను సమగ్రంగా విశ్లేషించి, భవిష్యత్‌లో నష్టాలను తగ్గించేందుకు శాశ్వత పరిష్కారాలపై దృష్టిపెడతామన్నారు. ఈదురుగాలులు తట్టుకునేలా విద్యుత్‌ స్తంభాల నిర్మాణంలో మార్పులు చేయడమా? అండర్‌ కేబుల్‌ వంటి ప్రత్యామ్నాయ సాంకేతిక పరిష్కారాలు అనుసరించాలా అనేది పరిశీలిస్తామని చెప్పారు. తుఫాన్లను దృష్టిలో పెట్టుకుని, పంటల సాగు సీజన్‌లో మార్పులు చేయాలా? ప్రకృతి విపత్తులను తట్టుకోగలిగే వంగడాలను ప్రోత్సహించాలా? అనే దానిపై వ్యవసాయ నిపుణులతో చర్చిస్తామని తెలిపారు. ఇన్‌పుట్‌ సబ్సిడీతో పాటు విపత్తుల సమయంలో పంటల బీమా రైతులకు బాగా ఉపయోగపడుతుందని, దీనిపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఎలాంటి విపత్తు వచ్చినా రైతులు నష్టపోకుండా సమగ్ర కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం

కూటమికే.. పట్టణం

Updated Date - Nov 04 , 2026 | 04:46 AM