Share News

‘అసెంబ్లీ’ని మించి గెలుపు

ABN , Publish Date - Nov 10 , 2026 | 03:32 AM

స్థానిక ఎన్నికల్లో తమ కూటమి ఘన విజయం సాధించిందని.. 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ప్రజాదరణ మరింత పెరిగిందని సీఎం చంద్రబాబు విశ్లేషించారు.

‘అసెంబ్లీ’ని మించి గెలుపు

  • 58.9 శాతం ఓట్లతో ‘స్థానిక’ పట్టాభిషేకం: సీఎం

  • 2024తో పోలిస్తే 3.6 శాతం పెరిగిన కూటమి ఓట్లు

  • వైసీపీకి తగ్గిన ఓట్లు 6.25 శాతం

  • 100 పట్టణ సంస్థల్లో 94 చోట్ల కూటమి పాగా

  • పల్లెల్లోనూ అదే జోరు..

  • ఒక్కటి మినహా 27 జడ్పీల్లో పాగా

  • 22 మున్సిపాలిటీలు, 7 జడ్పీల్లో వైసీపీ ఒక్క స్థానమూ గెలవలేదు

  • మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, యువతకు పెద్దపీట

  • మరో 30 ఏళ్లకు సరిపోయేలా కొత్త నాయకత్వం సిద్ధం: సీఎం

అమరావతి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో తమ కూటమి ఘన విజయం సాధించిందని.. 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ప్రజాదరణ మరింత పెరిగిందని సీఎం చంద్రబాబు విశ్లేషించారు. పట్టణ, పరిషత్‌ ఎన్నికల్లో కలిపి 58.9 శాతం ఓట్లు సాధించామని.. గత ఎన్నికల్లో సాధించిన 55.3 శాతం ఓట్ల కంటే 3.6 శాతం ఇపెరుగుదల నమోదైందని తెలిపారు. ఇదే సమయంలో వైసీపీ ఓట్ల శాతం 39.81శాతం నుంచి 33.56 శాతానికి పడిపోయిందని, ఆ పార్టీకి 6.25 శాతం ఓట్లు తగ్గాయని చెప్పారు. పట్టణ, గ్రామీణ ప్రజలతోపాటు ఉద్యోగులూ కూటమికి జై కొట్టారని తెలిపారు.

సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో స్థానిక ఎన్నికల ఫలితాలు, వివిధ స్థాయుల్లో కూటమి సాధించిన విజయాలు, అభ్యర్థుల ఎంపికకు అనుసరించిన విధానం, సామాజిక ప్రాతినిధ్యానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని గణాంకాలతో వివరించారు. పట్టణాల్లో కూటమికి 65.7 శాతం పోస్టల్‌ బ్యాలెట్లు రాగా, వైసీపీకి 27.42 శాతం వచ్చాయని.. పరిషత్‌ ఎన్నికల్లో కూటమికి 62.83 శాతం, వైసీపీకి 31.46 శాతం లభించాయని చెప్పారు. ఈ ఓట్ల శాతాలు చూస్తేనే.. ఉద్యోగులు సహా అన్ని వర్గాలూ కూటమిని ఏ స్థాయిలో ఆదరించారో అర్థం చేసుకోవచ్చన్నారు.

బాగా పనిచేసిన ఉద్యోగులు, అధికారుల పనితీరును తాను బహిరంగంగానే ప్రశంసిస్తున్న విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. కూటమి పట్టణ సంస్థల్లో 59.9 శాతం ఓట్లు పొందిందని.. పరిషత్‌లలో 57.6 శాతం ఓట్లు సాధించిందన్నారు.


తిరుగులేని విజయాలు, మెజారిటీలు

రాష్ట్రవ్యాప్తంగా 659 జడ్పీటీసీ స్థానాలకు గాను కూటమి 576 కైవసం చేసుకుందని ముఖ్యమంత్రి తెలిపారు. ‘మొత్తం 28 జిల్లాల్లో 27 జిల్లాల్లో కూటమి ఆధిక్యత సాధించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే వైసీపీ మాకంటే ఎక్కువ స్థానాలు పొందింది. ఏడు జిల్లాల్లో.. అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, మార్కాపురం, పల్నాడు, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో ఆ పాఈర్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది. మొత్తం 9,818 ఎంపీటీసీ స్థానాల్లో మేం 7,803 గెలుచుకున్నాం.

రాష్ట్రవ్యాప్తంగా 90 శాతం మండలాధ్యక్ష స్థానాలను కూటమి కైవసం చేసుకునే అవకాశముంది. పట్టణ సంస్థల ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించాం. మొత్తం 100 మేయర్‌/చైర్‌పర్సన్‌ పదవులకు గాను 94 గెలుచుకున్నాం. ఇందులో టీడీపీ వాటా 70, జనసేన 20, బీజేపీ వాటా 4. కూటమికి 13 మేయర్‌ పదవుల్లో 12.. 87 చైర్‌పర్సన్‌ పదవుల్లో 82 దక్కాయి. మొత్తం 3,941 వార్డులకు గాను 3,233 వార్డుల్లో జయకేతనం ఎగురవేశాం. 100 పట్టణ సంస్థల్లో 95 చోట్ల కౌన్సిల్‌లో కూటమికే మెజారిటీ లభించింది. వైసీపీ కేవలం 4 పట్టణాల్లోనే విజయం సాధించింది. 558 వార్డులకే పరిమితమైంది. 22 పట్టణ సంస్థల్లో ఒక్క వార్డు కూడా గెలవలేకపోయింది’ అని వివరించారు.


దశాబ్దాల తర్వాత పులివెందులలో స్వేచ్ఛ..

విశాఖలో 2,47,817 ఓట్ల మెజారిటీ, విజయవాడలో 1,30,872 ఓట్లు, గుంటూరులో 96,294 ఓట్ల ఆధిక్యంతో కూటమి విజయం సాధించిందని ముఖ్యమంత్రి తెలిపారు. పులివెందులలో సైతం 13,875 ఓట్ల మెజారిటీతో చైర్‌పర్సన్‌ పదవిని కైవసం చేసుకున్నామని.. మొత్తం 40 వార్డుల్లో 37 గెలుచుకున్నామని చెప్పారు. ‘కడప కార్పొరేషన్‌లో 65,588 ఓట్ల మెజారిటీతో మా మేయర్‌ అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ వార్డుల్లో కూటమి 64 గెలుచుకుంది.

రౌడీ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారు. జిల్లాలోని 9 పట్టణ స్థానిక సంస్థలూ కూటమి ఖాతాలో పడ్డాయి. 345 వార్డుల్లో వైసీపీ కేవలం 9కే పరిమితమైంది. దశాబ్దాల తర్వాత పులివెందులలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయి. ప్రజాస్వామ్యబద్థంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే ఫలితాలు ఇలాగే ఉంటాయి. అనంతపురంలో మేయర్‌ పదవి దక్కకపోయినా కార్పొరేటర్లలో ఎక్కువ మంది కూటమి వాళ్లే గెలిచారు’ అని చెప్పారు.

మహిళలకు 60 శాతం..:

మేయర్లు, చైర్‌పర్సన్ల ఎంపికలో మహిళలకు, బీసీలకు, అణగారిన వర్గాలు, మైనారిటీలకు పెద్దపీట వేశామని చంద్రబాబు చెప్పారు. ‘టీడీపీ నుంచి గెలిచిన 70 మంది మేయర్లు/చైర్‌పర్సన్లలో 42 మంది మహిళలే. అంటే 60 శాతం ప్రాతినిధ్యం కల్పించాం. అలాగే టీడీపీ గెలిచిన పది మేయర్‌ పదవుల్లో 8 స్థానాల్లో.. విజయనగరం, విశాఖ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, కడప, కర్నూలు, చిత్తూరు నగరాలకు మహిళలే నాయకత్వం వహిస్తారు. 70 మంది మేయర్లు/చైర్‌పర్సన్లలో 44 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందినవారు.

మొత్తంగా ఈ వర్గాలకు 62.9 శాతం ప్రాతినిధ్యం కల్పించాం. బీసీలకు 25 పదవులు, ఎస్సీలకు 9, మైనారిటీలకు 9, ఎస్టీలకు ఒకటి దక్కాయి. మొత్తం 27 సామాజిక వర్గాలకు చెందినవారు టీడీపీ తరఫున మేయర్లు, చైర్‌పర్సన్లుగా ఎన్నిక కావడం సామాజిక న్యాయానికి నిదర్శనం. మా పార్టీ నుంచి ఎన్నికైన పది మంది మేయర్లు పది భిన్న సామాజిక వర్గాలకు చెందినవారు. వీరిలో నలుగురు బీసీలు, నలుగురు ఓసీలు, ఒకరు ఎస్సీ, మరొకరు మైనారిటీ వర్గానికి చెందినవారు. మేయర్లు/చైర్‌పర్సన్లుగా ఎన్నికైన 9 మంది ముస్లింలలో ఆరుగురు మహిళలే’ అని వివరించారు.


యువత, విద్యావంతులకు ప్రోత్సాహం

పట్టణ స్థానిక సంస్థల నాయకత్వంలో యువతకు, విద్యావంతులకు ప్రాధాన్యం ఇచ్చామని సీఎం తెలిపారు. ‘టీడీపీ నుంచి గెలిచిన 70 మంది మేయర్లు/చైర్‌పర్సన్లలో 55 మంది డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతలు కలిగినవారు. వీరిలో 11 మంది పీజీ చదివారు. అంటే 78.6 శాతం మంది ఉన్నత విద్యావంతులే. 31 మంది 45 ఏళ్లలోపు వారు. ఎనిమిది మంది 35 ఏళ్లలోపు వారు. పది మంది టీడీపీ మేయర్ల సగటు వయసు 39 ఏళ్లు.

రాజంపేటలో 26 ఏళ్ల డాక్టర్‌ దొంతం గాయత్రి, మచిలీపట్నంలో 29 ఏళ్ల షేక్‌ అబ్దుల్‌ అబీదా, విజయనగరంలో 31 ఏళ్ల అవనాపు భార్గవి, విశాఖలో 32 ఏళ్ల డాక్టర్‌ ముక్కా శ్రావణి మేయర్లుగా ఎన్నిక కావడం యువతకిచ్చిన అవకాశాలకు నిదర్శనం. ఒంగోలులో 27వ డివిజన్‌ నుంచి 24 ఏళ్ల చావలి చార్పిత కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారు, అత్యంత నిరుపేదలు, రోజువారీ కూలీలు, రాజకీయ నేపథ్యం లేనివారు, సమాజంలో మంచి పేరున్నవారు.. ఇలా విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వారికి నాయకత్వ అవకాశాలు కల్పించాం.

రాజకీయాల్లో మేం చేసిన ప్రయోగాలు అద్భుత ఫలితాలిచ్చాయి. మరో 30 ఏళ్ల పాటు పార్టీకి, రాష్ర్టానికి సేవలందించేలా కొత్త నాయకత్వాన్ని తయారు చేశాం’ అని చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

పల్లెపోరుకు వేళాయె!

ఆ ఒక్కచోట ఎందుకిలా?

Updated Date - Nov 10 , 2026 | 03:35 AM